కుంభమేళా అంటే ఏమిటి?
కుంభమేళా అనేది ఈ ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ కుంభమేళాకు కేవలం భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా అతిపెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఎందుకు ఇంతమంది భక్తులు ఒకేచోట హాజరవుతారు? ఈ కుంభమేళా ప్రత్యేకతలు ఏమిటి? తెలుసుకుందాం రండి....
మన సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 4 సంవత్సరాలకు ఒకసారి సాధారణ కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, 144 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు.సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి వివిధ రాశిచక్రాలలో ఆ కాలంలో ఏ స్థానంలో ఉంటారు అనేదానిపై ఆధారపడి, కుంభమేళా స్థలం నిర్ణయించబడుతుంది..
సూర్యుడు, చంద్రుడు కర్కాటకంలో, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు నాసిక్ - త్య్రంబకేశ్వర్ లోను (గోదావరి నది ఒడ్డున),
సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు ధనస్సులో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను (గంగా నది ఒడ్డున),
సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను (గంగా-యమునా మరియు అదృశ్య సరస్వతి నదుల సంగమం),
సూర్యుడు, చంద్రుడు మేషరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను ( క్షిప్రా నది ఒడ్డున) నిర్వహిస్తారు.
అయితే వీటన్నింటిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లోనే గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహా కుంభం వేళ గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.
2013 సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్‌లో పూర్ణ కుంభమేళా (ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది)నిర్వహించారు.2019 సంవత్సరంలో ప్రయాగలో అర్ధ కుంభమేళా (6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది) నిర్వహించారు.
ఇప్పుడు 2025 సంవత్సరంలో ప్రయాగలో జరిగేది మహా కుంభమేళా. (144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగేది)
కుంభమేళాకు ఆధారాలు :పౌరాణిక ఆధారాలు :
పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మథనం సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహా భారతంలో, రామాయణం లో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
పురాణాల ప్రకారం... దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవ దానవుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు, ఆ అమృతభాండంలోని కొన్ని చుక్కలు నాశిక్, ఉజ్జయిని, ప్రయాగ, హరిద్వార్ లలో పడ్డాయి. అమృత బిందువులు పడిన ఈ 4 ప్రదేశాలలోనే కుంభమేళా జరుగుతుంది. ఈ కాలంలో నదీ జలాలు అమృతంగా మారతాయని శాస్త్రం. దేవతలకు 12 రోజులు భూలోకంలో 12 సంవత్సరాలకు సమానం. అందుకే ప్రతీ 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పూర్ణ కుంభమేళాకు అంతటి ప్రాముఖ్యత.
చారిత్రక ఆధారాలు :కుంభమేళా స్నానానికి దాదాపు 1400 ఏళ్లకు పైగా చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. 629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ యొక్క రచనలలో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇదే మొట్ట మొదటగా లభించిన చారిత్రక ఆధారం. కానీ పురాణాల ప్రకారం అమృతకలశం ఉద్భవించినప్పటి నుండే ఈ కుంభ మేళ స్నానాలు ప్రారంభం అయ్యాయని, అప్పటినుండి నిరంతరం ఆగకుండా జరుగుతున్నాయని హిందువుల విశ్వాసం. కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు అని అంటారు కానీ అది నిజం కాదు. ఆది శంకరాచార్యులవారికి పూర్వం నుండే కుంభమేళా జరిగినట్టు చారిత్రక ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఆదిశంకరాచార్యులవారు కుంభ స్నాన పద్దతులను పునరుద్ధరించి అఖాడాలను స్థాపించారని చెప్తారు.
2025 సంవత్సరంలో ముఖ్యమైన షాహీ స్నాన తేదీలు :