బుధవారం, అక్టోబర్ 17, 2018

ప్రయాగ & గయ (నా కాశీ యాత్రలో భాగంగా) - Prayaga & Gaya

మేము 9 రోజుల కాశీ యాత్ర చేసాము. మా యాత్రలో భాగంగా మధ్యలో ఒకరోజు ప్రయాగ, ఒకరోజు గయ వెళ్లి వచ్చాము. నా యత్రానుభవం బట్టి కాశీ వెళ్ళిపోయి వెనుకకు వచ్చి గయ యాత్ర చేసేకన్నా ముందుగా గయలో దిగిపోయి అక్కడ కార్యక్రమాల తరువాత కాశీ లేదా గయ నుండే నేరుగా అలహాబాద్ వెళ్లి అక్కడి నుండి కాశీ వెళ్ళేలాగా ప్రణాళిక వేసుకుంటే అటు సమయంతో పాటూ డబ్బు కూడా ఆదా అవుతుందని నా అభిప్రాయం. 

మా ప్రయాణం విశాఖపట్నం మీదుగా సాగింది కాబట్టి ఈ ప్రణాళిక కుదురుతుంది కానీ హైదరాబాద్ నుండి కాశీ వెళ్ళేవాళ్ళకి ముందే అలహాబాద్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ముందు ప్రయాగ.. తర్వాత కాశీ వెళ్లడం మంచిది. కానీ వైజాగ్.. పూరీ.. ఈ రూట్ లో కాశీ వెళ్లే యాత్రికులు ముందు గయలోనే దిగిపోండి.

గయ :
కాశీ నుండి గయ సుమారు 260 కి.మీ. ఉంటుంది. మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి గయకు బయలుదేరాము. సుమారుగా మధ్యాహ్నం 1 గంటకు గయ చేరుకున్నాం.

ప్రయాగ, కాశీ, గయ అనే ఈ మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 

అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి.

గయ మహత్యం
ఆధ్యాత్మిక వైభవాన్నే కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయ క్షేత్రప్రస్తావన మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో కూడా ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు,
స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది.

అత్యంత పవిత్రక్షేత్రంగా కీర్తించబడిన గయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ మహర్షిముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది.

స్థల పురాణం:
పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాలు పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటా లేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడివిష్ణువు వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. 

సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు. "గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను" అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు.

అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞం వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు “మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచండి" అని ఆదేశించాడు. 

దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచినా తల కదులూతునే ఉంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని ఉండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాద ధూళి సోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన శిల బరువుకు ఎలా
అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవరూ ఇకమీదట నన్ను చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు. గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది.

గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగమిస్తూ ఉండడం వలన ఈ క్షేతం ప్రయాగతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూ వుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. పిండ ప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉందని చెప్పవచ్చు. 

విష్ణుపద మందిరం:
ఫల్గుణీ నదీతీరంలోనే విష్ణుపద మందిరం కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగిన ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే  గదాధరుడు అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గదాధర స్వామిగా పూజ అందుకుంటున్నాడు. 

ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర
అడుగుల పొడవు, అర్థ అడగు వెడల్పు ఉన్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు. 

ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని “అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు చిరకాలం అక్షయవటంగా వర్థిల్లమని వరాన్ని ప్రసాదించిందట. 

మంగళగౌరి ఆలయం:
ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో ఉంది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడి, శక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి. గయలో అమ్మవారి తొడ భాగం పడింది.

గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా ఉంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా ఉంటుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

బుద్ధగయ:
గయ నుండి బుద్ధగయ సుమారు 12 కి.మీ. ఉంటుంది. సిధ్ధార్ధుడు జ్ఞానోదయం పొందిన రావిచెట్టు ఇక్కడే ఉంది. ఈ బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తరువాతనే సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఈ రావిచెట్టుకింద ధ్యానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ మ్యూజియంలో బుద్ధుని జ్ఞానోదయ ఉదంతంపై నిర్మించిన డాక్యుమెంట్‌ తప్పక చూడాల్సిందే. 170 అడుగుల ఎత్తున నిర్మించిన మందిరంలోని బుద్ధభగవానుడు జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తాడు. బౌద్ధులకు అతి పవిత్ర క్షేత్రం ఈ బుద్ధ గయ. ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలు బహు సుందరంగా ఉంటాయి.

అలహాబాద్ (ప్రయాగ) : 
మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరాము. సుమారు 9 గంటలకు ప్రయాగ చేరుకున్నాం. వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం ఉంది.

గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. గంగానది శివుడిని తాకి పునీతమైతే, యమునా నది కృష్ణయ్య లీలలను నింపుకుంది. చల్లని సరస్వతీ నది అంతర్వాహినిగా ఈ సంగమ ప్రదేశంలో కలుస్తుంది. ఈ జీవనదుల్లో ప్రవహించే నీటితో దాదాపు ఉత్తర భారతం అంతా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. 

ప్రయాగ మహత్యం: బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలోనే అనేక యజ్ఞాలు చేశాడట. అందుకే ఈ ప్రదేశానికి ప్రయాగ అనే పేరు వచ్చిందట.

ప్రయాగ అనగా 
ప్ర = ప్రకృష్ట (అనేక)
యాగ = యజ్ఞాలు జరిగిన క్షేత్రం

సముద్రగుప్తుడు కూడా ప్రయాగలో 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడట.

ప్రయాగలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య నివాసం ఉంటాయి. ఇక మాఘమాసంలో అయితే లెక్కకే అందనన్ని తీర్థాలు ప్రయాగ తీర్ధంలో కొలువై ఉంటాయట. స్వయంగా బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటాడట. ఇక్కడ చనిపోయిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందట. జన్మ జన్మాంతరాలలో సంచయమైన పాపం, ప్రయాగ తీర్థ స్నానం వల్ల పోతుందట.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 

అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి. అందుకే స్నానానికి ముందు ఇక్కడ (ప్రయాగలో) శిరోముండనం చేయించుకుంటారు.

సంగమ స్థలం విస్తీర్ణం సుమారుగా 5 యోజనాలు ఉంటుంది. సంగమ ప్రాంతం గంగా యమునల ప్రవాహం కారణంగా మూడు భాగాలుగా ఉంటుంది. గంగకు ఉత్తరాన ఉన్న స్థలాన్ని గంగాపాఠ్ లేదా ఆహ్వనీయాగ్నికుండం అని, ఈ రెండు నదుల మధ్యన ఉన్న ప్రదేశాన్ని (గంగకు దక్షిణాన, యమునకు ఉత్తరాన ఉన్న భాగం దోఆబ (ద్వాబా) లేదా గార్హాపత్యాగ్ని కుండం అని, యమునకు దక్షిణాన ఉన్న స్థలాన్ని యమునాపాఠ్ లేదా దక్షిణాగ్ని కుండం అని అంటారు. ఈ మూడు ప్రాంతాలలో శుచిగా, నియమాలతో ఒక్కొక్కరోజు చొప్పున గడిపితే, ఆయా క్షేత్రాలలో అగ్ని (త్రేతాగ్నులు) ఉపాసన చేసిన ఫలితం (యజ్ఞ ఫలం) దక్కుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది.

ఇక్కడ ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేళా, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభ మేళా, 144 సంవత్సరాలకి ఒకసారి మహా కుంభ మేళా జరుగుతాయి. ఈ మేళాలు నిర్వహించడానికి వెనుక ఒక పురాణగాధ ఉంది. దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ సమయంలో అమృతం కోసం దేవతలకీ, అసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండం నుండి అమృతం తొణికి కొన్ని చుక్కలు నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లలో పడ్డాయట. కానీ, ప్రయాగలోని ఈ త్రివేణీ సంగమంలో అయితే అమృత భాండమే పడిందట. అందుకనే ఈ సంగమ ప్రదేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

వేణీ దానం:
త్రివేణీ సంగమంలో ఆచరించాల్సిన ప్రత్యేక పూజ ఈ వేణీ దానం. సుమంగళులైన స్త్రీలు తమ భర్తకు అర్చన చేసి, తను తెలిసీ తెలియక చేసిన తప్పులన్నిటికి క్షమాపణకోరి, అతని చేత కొంత జుట్టు కత్తిరింపజేసి, ఆ జుట్టును త్రివేణీ సంగమంలో వదులుతారు. సాధారణంగా కత్తిరించిన జుట్టు నీటిపై తేలుతుంది. కానీ ఇక్కడ జుట్టు మునుగుతుంది. ప్రయాగలో వేణీ దానం చేసిన స్త్రీలు నిత్య పసుపు కుంకుమలతో ఉండి, సుమంగళులుగానే మరణిస్తారట. ఈ వేణీ దానం తంతు అంతా భార్యను భర్త ఒడిలో కూర్చోపెట్టి చేయిస్తారు. 

కాశీ యాత్ర లో భాగంగా మనం ఇంటికి తీసుకెళ్లే గంగాజలం త్రివేణీ సంగమం నుండే తీసుకెళ్లాలి. కాబట్టి గంగాజలం నింపుకోడానికి ఖాళీ డబ్బాలు (బాటిల్స్) తీసుకెళ్లడం మర్చిపోకండి. 

ప్రయాగలో వసతులు : 
(ఇది నేను సేకరించిన సమాచారం మాత్రమే. ఎందుకంటే మేము తెల్లవారుఝామున కాశీ నుండి బయలుదేరి, మరలా రాత్రికి కాశీ చేరిపోయాం)
మీరు ప్రయాగకు చేరుకొనే ముందు రోజు, ప్రయాగలో ఉన్న శ్రీ లక్ష్మణ కుమార శాస్త్రి గారికి ఫోన్ చేసి, మీరు వస్తున్న ట్రైన్, కోచ్ వివరాలు తెలియజేస్తే, వారు మిమ్మల్ని తమ సత్రానికి చేర్చడానికి అక్కడి వ్యక్తులను పురమాయిస్తారు.  వీరి సత్రంలో వసతి గృహాలు ఉచితమే. కాకపోతే ప్రయాగలోని తంతులన్నీ వీరి పురోహితులతోనే జరిపించుకోవలసి ఉంటుంది. సత్రానికి చేరుకున్నాక, మీరు ఏమేమి చేయదలచుకున్నారో వాటికి తగిన రుసుము చెల్లిస్తే, ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదును తీసుకెళ్ళి, సంగమం వద్దనున్న వారి అర్చకులకు చూపిస్తే, మీ కార్యక్రమాలన్నిటినీ వారే చూసుకుంటారు.

Address: శ్రీ లక్ష్మణ కుమార శాస్త్రి, 110/105, Bakshi Daragunj, Allahabad, Uttar Pradesh - 211 006
Phone: 09415238615
Land Line: 0532 - 2501729, 2506058

వసతితో పనిలేకుండా, కేవలం సంగమ స్నానమే అయితే ఆలోక్ ధర్మాధికారి గారు బాగా చేయిస్తారట. ఆయన ఫోన్ నెంబరు 09452934193 & 09335355520

ప్రయాగలో దర్శించవలసిన ఆలయాలు, ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటి వివరాలు... 

పాతాళపుర మందిర్ :
త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట ఒకటి ఉంది. కోట లోపలికి ప్రవేశం నిషిద్ధం. కానీ ఈ కోటలో ఉన్న పాతాళపుర మందిర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఫోటోలు మాత్రం తీయనివ్వరు. కోట అంతా ఆర్మీ వాళ్ళ నిరంతర గస్తీతో కట్టు దిట్టంగా ఉంటుంది.

పాతాళపుర మందిర్ సుమారుగా 84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా ఉంటుంది. దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం ఉంది. గయలో కురుక్షేత్రంలో చనిపోయిన తమ బంధుజనానికి పాండవులు శ్రార్ధ కర్మలు నిర్వహించారట. ఇంకా ఈ ఆలయంలో వేద వ్యాసుడు, వాల్మీకి, సనక సనందులు, ఇంకా అనేక ఋషులు, దేవతల విగ్రహాలు ఉన్నాయి.

అక్షయవట్ : ఇక్కడే అతి పురాతనం అయిన వట వృక్షం ఒకటి ఉంది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే ఉండేదట. అక్బర్ కోట కట్టించినప్పుడు స్ధలం ఎత్తు పెంచడంతో ప్రస్తుతం ఇవి భూగర్భంలోకి వెళ్లాయి. ఈ వటవృక్షానికి ఉన్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలట. ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి, చెట్టు మొదళ్ళను కౌగలించుకోమంటారు.

యముడు, దండపాణి, భైరవుడు, ప్రయాగ రాజేశ్వరి, గంగామాత, మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతి దేవి, జాంబవంతుడు, ఇంకా అనేక దేవీదేవతలు కొలువై ఉన్నారు. 

శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి, ఈ వట వృక్షం కిందనే కూర్చున్నాడట. ఇక్కడే తన తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడట. భరతుడు తన అన్నను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, ఇక్కడ ఆగాడని తెలుసుకుని, ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఒక విగ్రహం ఉంటుంది. 

ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వం ఈ చెట్టు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకునేవారట.

ఈ కోటలోనే మన దేశంలో ప్రసిద్ధి చెందిన అశోక స్తంభం ఉంది. దీన్ని కౌశాంభి నుండి తెచ్చి, ఇక్కడ స్ధాపించారట.


బడే హనుమాన్ మందిర్ :
పాతాళపుర మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం. రామ రావణ యుధ్ధానంతరం ఆంజనేయస్వామి కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. అందుకనే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని చాలా ప్రయత్నాలు చేశారట. విగ్రహాన్ని తవ్వేకొద్దీ భూమిలో గుంటలాగా ఏర్పడి, విగ్రహం ఇంకా స్ధిరంగా అయిపోయిందట. ఇప్పటికీ విగ్రహం ఆ గుంటలోనే ఉంటుంది. వర్షాకాలంలో గంగానది పొంగితే, గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందట. అప్పుడు ఆంజనేయస్వామి గంగలో స్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తుందట. 

స్వామి ఆవిర్భావానికి మరో కధ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం కనౌజ్ ప్రాంతంలో సంతానం లేని గొప్ప ధనవంతుడు వింధ్యాచలం వెళ్లి పెద్ద హనుమాన్ విగ్రహాన్ని తయారు చేయించి, స్వామికి స్నానం చేయించాలని భావించాడట. ఈ విగ్రహానికి వివిధ పవిత్ర క్షేత్రాలలో స్నానం చేయిస్తూ, త్రివేణీ సంగమంలో కూడా స్నానం చేయించి, ఆ రాత్రి అక్కడే నిద్రించాడట. రాత్రి కలలో విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలనే భావన రావడంతో, ఉదయం లేవగానే కనౌజ్ కు బయలు దేరి వెళ్ళిపోయాడట. ఇంటికి చేరగానే భార్య గర్భం దాల్చిందని తెలిసి, బడే హనుమాన్ స్వామి అనుగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకోగా, కొంత కాలానికి కొడుకు పుట్టాడట.

బడే హనుమాన్ ఇక్కడే నీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాడట. ఒక రోజు వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన బాలగిరి స్వామీజీ త్రివేణీ సంగమంలో స్నానం చేసి, తన త్రిశూలాన్ని నేలమీద గుచ్చగా, అక్కడ బడే హనుమాన్ విగ్రహం కనిపించిందట. నెమ్మదిగా ఇసుక, మట్టి తీయించి విగ్రహం బయటపడేట్లు చేసి, స్వామి అనుగ్రహం కోసం అక్కడే తపస్సు చేశారట. దీనితో బడే హనుమాన్ కీర్తి జనంలో బాగా వ్యాపించిందని చెప్తారు.

శంకర విమాన మండపం :
జగద్గురువులయిన ఆదిశంకరాచార్యుల వారు, కుమార స్వామి స్వరూపం అయిన కుమరిల భట్టు అనే విద్వాంసుడిని తన అద్వైత తత్వ జ్ఞానంతో ఓడించిన ప్రదేశంలో ఆయన విజయానికి గుర్తుగా ఒక విజయ స్తంభాన్ని స్థాపించాలని, కంచి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు సంకల్పించి నిర్మించిన కట్టడమే ఈ శంకర విమాన మండపం లేదా శంకర మఠం. 

ఈ మండప నిర్మాణం ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో కామాక్షీ దేవి, ఆదిశంకరాచార్యులు, కుమారిల భట్టు విగ్రహాలతో పాటు అనేక దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యోగశాస్త్ర బద్దంగా 1008 లింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఇంకా 108 విష్ణాలయాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. బడే హనుమాన్ మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ 4 అంతస్థుల విమాన మండపం.

మాధవేశ్వరీ శక్తి పీఠం :
అష్ఠాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం తప్పక దర్శించాల్సిన ఆలయం. మాధవేశ్వరీ దేవిని అలోపీ దేవిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు పడినట్టు దేవీభాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులుగా ఒక నలుచదరం పీఠం ఉండి, దానిపైన ఒక  వస్త్రంతో హుండీ వేలాడతీసి ఉంటుంది. హుండీ క్రిందుగా ఒక ఉయ్యాల కట్టి ఉంటుంది. భక్తులు తమ కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచే మొక్కుతారు.

దీనికి ప్రక్కగా అమ్మవారి దివ్యమంగళ రూపంతో ఉండే పాలరాతి విగ్రహంతో పాటూ, శివుడు సతీదేవిని భుజం పైన వేసుకుని ఉగ్రతాండవం చేస్తున్నట్టు ఉండే ప్రతిమ చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో శివుడు కూడా మహా లింగ రూపుడై కొలువుతీరాడు. ఈ ఆలయ ఆవరణలోనే శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం క్రిందనే ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. వీరిని అర్చిస్తే సమస్త గ్రహ దోషాలూ నశిస్తాయని నమ్మకం. ఇక్కడే ఉన్న మరో ఉపాలయం రామ్ జానకీ మందిరం. ఈ మందిరంలోని సీతారాముల పాలరాతి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

భరద్వాజ ఆశ్రమం :
రామాయణం ప్రకారం, వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ భరద్వాజ మహాముని ఆశ్రమానికే వచ్చాడు. ఇక్కడే మూడు రాత్రులు ఉండి, భరద్వాజ మహర్షి సూచనతో సుమారు 131 కి.మీ.ల దూరంలో ఉన్న చిత్రకూట్ కి వెళ్ళారు. ఈ భరద్వాజుని ఆశ్రమంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్తూ భరద్వాజుడు అర్చించిన శివలింగం ఉంది. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు శ్రీరాముడు కూడా ఈ లింగాన్ని అర్చించాడట. ఈ ఆశ్రమ సందర్శన ఎంతో మానసిక సంతృప్తిని ఇస్తుంది. పూర్వం గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలోనే ప్రవహిస్తూ ఉండేదట. అక్బరు కాలంలో నిర్మిచిన బక్షి, బేని ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారిందట. 

ఆనంద్ భవన్ :
ఈ భవనం లోనే మన దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. ఇందిరా గాంధీ జన్మించింది కూడా ఇక్కడే. మన జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ఈ భవనం ఒక సాక్షిభూతం. గాంధీగారు అలహాబాద్ వస్తే ఈ భవనంలోనే ఉండేవారట. ఇందిరాగాంధీ వివాహం కూడా ఈ భవనంలోనే జరిగిందట. ప్రస్తుతం ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ ఉంది. కొంత భాగం ఆల్ ఇండియా కాంగ్రెస్ వినియోగిస్తుంది. కొంత భాగంలో మ్యూజియం నిర్వహిస్తున్నారు. ఉదయం 9-30 నుండి సాయంత్రం 5-30 వరకు మ్యూజియం తెరిచి ఉంటుంది. ప్రతీ సోమవారం మరియు జాతీయ సెలవు దినాలలో మ్యూజియం ఉండదు. 

నాగ వాసుకీ దేవాలయం :
ఈ నాగ వాసుకీ దేవాలయం అతి పురాతనమైన ఆలయం. వాసుకిని కశ్యప మహాముని పుత్రుడుగా చెప్తారు. మానసాదేవిని వాసుకికి సోదరిగా చెప్తారు. నాగులకి రాజు ఈ వాసుకి. ఈ వాసుకీ నాగ రాజే క్షీర సాగర మధనంలో మంధర పర్వతానికి తాడులాగా చుట్టబడ్డాడు. వాసుకీ నాగరాజుని అర్చిస్తే సమస్త నాగదోషాలు తొలగిపోతాయట.

మన్ కామేశ్వర్ మహా దేవ్ :
ప్రయాగలోని ప్రాచీన ఆలయాలలో మన్ కామేశ్వర్ ఆలయం ఒకటి. సాక్షాత్తూ శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్టించి పుజించిన లింగం ఈ మన్ కామేశ్వరుడు. ఇక్కడ స్వామిని మనం కోరికలు కొరవలసిన అవసరం లేదట. మన మనస్సులోని ఆంతర్యం గ్రహించి నెరవేర్చగలడు కాబట్టే మన్ కామేశ్వరుడయ్యాడు. ఇక్కడ శివునికిచ్చే హారతి చాలా బాగుంటుంది. 

వేణీ మాధవుడు :
పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి ఈ వేణీ మాధవుడు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఈ వేణీ మాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నానఫలం పొందరని తన రామచరితమానసంలో తులసీదాసు చెప్పాడు. ఈ ఆలయం ప్రయాగలోని దారాగంజ్ ప్రాంతంలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘాట్ కు దగ్గరగా ఉంది. అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించక ముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం. త్రివేణీ  సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ ఆలయంలో మనకు లక్ష్మీదేవి, నారాయణుని విగ్రహాలు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మ పురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి ఈ వేణీమాధవుడే అధిదేవత. ఈ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు. 

సీతా మడి :
అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశమే సీతామడి. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది. ఇక్కడ సీతాదేవి ఆలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది.

వింధ్యాచలేశ్వరి :
సీతామడి నుండి రెండుగంటలు ప్రయాణం చేస్తే, వింధ్యాచలం అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ వింధ్యాచలేశ్వరి అమ్మవారు కొలువు తీరి ఉంది. పురాణం ప్రకారం, శుంభ నిశుంభులనే  రాక్షసులను సంహరించిన తర్వాత కాళీమాత ఇక్కడ వింధ్యాచలేశ్వరిగా వెలిసిందట. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని తాకొచ్చు.

ముగింపు:
ప్రయాగని తీర్థరాజం అంటారు. అనగా అన్ని తీర్ధాలకు రాజు అని అర్ధం. ప్రయాగ పౌరాణికంగానే కాదు.. ప్రకృతి అందాలలోనూ విశిష్ఠమైనదే. అందుకే ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బర్ తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇ-ఇలాహీ పేరు కలసి వచ్చేటట్లుగా అలహాబాద్ అని మార్చాడు. అప్పటి నుండి ప్రయాగ అలహాబాద్ గా కూడా పిలవబడుతుంది.

మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరితే, తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో కాశీ చేరుకున్నాం.

మంగళవారం, జనవరి 02, 2018

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు... ఈ కథ ఎంత మంది విన్నారు?

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు... ఈ కథ ఎంత మంది విన్నారు? ఎంత మందికి గుర్తుంది? అసలు ఈ కథ (పరమా)అర్ధం తెలుసా మీకు..???

కథ:
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.

చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేటు అడ్డమొచ్చింది.

గడ్డిమేటా... ఎందుకు అడ్డమొచ్చావ్...? ఆవు మెయ్యలేదు.

ఆవా ఎందుకు మెయ్యలేదు...?  గొల్లవాడు మేపలేదు.

గొల్లవాడా... ఎందుకు మేపలేదు...? అమ్మ అన్నం పెట్టలేదు.

అమ్మా...ఎందుకు అన్నం పెట్టలేదు...? పిల్లవాడు ఏడిచాడు.

పిల్లవాడా... ఎందుకు ఏడిచావు...?  చీమ కుట్టింది.

చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా... అన్నది.

రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త ధాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. 7 చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (ధనమును దుబారాగా ఖర్చుచేయుట).

ఎండగట్టటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది. ఎండపెట్టాము అంటే వ్యసనాల్ని జయించామని అర్ధం. సాధన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

ఒక చేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలిన వాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది. కామాన్ని జయించడము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది. అయిననూ అది కూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తొలగుటయే కదా మోక్షము.

చేప ఎండక పోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే..  గడ్డి మేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పట్టి పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.

"కృష్ణం వందే జగద్గురుం" అనగా జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞ లేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను.

ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.

అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు.

 జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత.

అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి బాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.

చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట.

చివరకు అనురక్తి తొలగి సంసార బాధల నుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును.

కథ సారాంశము:
సప్తధాతువులతో కూడిన మనిషి సాధన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామమును జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాధపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును.

కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.

ఆదివారం, నవంబర్ 19, 2017

కాశీలోని ద్వాదశ ఆదిత్యులు - Kashi Dwadasa Adityas

దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 

1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.

2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 

సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.

4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 

5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 


6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

 
7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 

8) ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.

9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.

10) విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు. 

11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 
 

12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. 

శుక్రవారం, అక్టోబర్ 27, 2017

కాశీలోని జ్యోతిర్లింగాలు - Kashi Jyotirlingas

మన భారతదేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలున్నాయి. వాటిలో కాశీలోని విశ్వనాథలింగం కూడా ఒకటి. కానీ పరమపవిత్రం అయిన కాశీ నగరంలో విశ్వనాధ లింగం కాకుండా మిగిలిన 11 జ్యోతిర్లింగాలకు ప్రతిగా 11 లింగాలు ఉన్నాయి. కాశీలోని ఈ 12 లింగాలను దర్శిస్తే, 12 జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం కలుగుతుందట. ఈ లింగాల ప్రాశస్త్యం కాశీఖండంలో వివరించి ఉంది. మరి ఆ లింగాల గురించి తెలుసుకుందామా?

1) సోమనాథ్ జ్యోతిర్లింగం : 
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో సోమేశ్వర్ లింగం ఉంది. మన్ మందిర్ ఘాట్ దగ్గర గల వారాహి ఆలయ సమీపంలో సోమనాధుడు కొలువై ఉన్నాడు. వారాహి ఆలయం నుండి దారి కనుక్కుంటూ వెళ్ళండి. 

2) రామేశ్వరం : 
ఈ లింగానికి ప్రతిగా కాశీలో గణేశ్వర్ కొలువై ఉన్నాడు. వారాహి దేవి ఆలయానికి సమీపంలోనే గణేశ్వర్ (రామేశ్వర్ అని కూడా అంటారు) కొలువై ఉన్నాడు. కనుక్కుంటూ వెళ్ళండి. సోమనాథ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. 

3) శ్రీశైల మల్లికార్జునుడు : 
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో త్రిపురాంతకేశ్వర లింగం ఉంది. కొన్ని లాండ్ మార్క్స్ ఇస్తున్నా గమనించండి. Mehmoorgunj Union Bank దాటిన తర్వాత సిద్దార్థ్ అనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. తర్వాత శీతలాదేవి ఆలయం. శీతలా దేవి ఆలయం నుండి ఎడమ పక్క సందులోకి తిరిగి కొంచెం దూరం వెళ్తే Sigra Tila (Mount Of Mud) అని వస్తుంది. అక్కడే ఈ త్రిపురాంతకేశ్వరుడు కొలువై ఉన్నాడు. దారి కనుక్కుంటూ వెళ్లాల్సిందే. 

ఈ ఆలయంలోనే త్రిముఖ వినాయకుడు కొలువై ఉన్నాడు. తప్పక దర్శించండి. త్రిముఖ వినాయకుడు కాశీలోని 56 వినాయక స్వరూపాలలో ఒకటి. కాశీఖండం ప్రకారం వినాయకుని 3 ముఖాలలో కోతి, సింహం, ఏనుగు ఉంటాయి. కానీ మనకు విగ్రహంలో 3 ఏనుగు తొండాలు కనిపిస్తాయి. 

4) వైద్యనాథ్ : 
త్రిపురాంతకేశ్వర్ ఆలయానికి దగ్గరలోనే Kamaccha అనే ప్రదేశం వద్ద, కామాఖ్య ఆలయ సమీపంలో వైద్యనాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. 

5) ఘృశ్నేశ్వర్ :
ఈ జ్యోతిర్లింగం కామాఖ్యాదేవి ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉంది. 


6) మహాకాళేశ్వర్ : 
మృత్యుంజయ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న మహాకాళేశ్వర లింగం ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా ఉంది. ఈ లింగార్చన వలన సమస్త విశ్వాన్ని అర్చించిన ఫలము లభిస్తుందట. 

7) ఓంకారేశ్వర్ : 
సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు అగ్ని స్తంభంగా వెలిసినప్పుడు అకార, ఉకార, మకారాలతో కలిసిన ఓంకారలింగం బ్రహ్మదేవుని ప్రార్ధన మేరకు కాశీలో ఓంకారేశ్వరుడిగా వెలిసాడు. ఓంకారేశ్వరుడిని కపిలేశ్వర్, నాగేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఓంకార జ్యోతిర్లింగానికి ప్రతిగా ఈ ఓంకారేశ్వరుడిని చెప్తారు. 

కాశీ పట్టణంలోని ఓంకారేశ్వరుడి ముందు నిలబడి ఎవరైతే బ్రహ్మగారు చేసినటువంటి ఓంకారేశ్వర స్తోత్రం చేసి అభిషేకం చేస్తారో వారు సశాస్త్రీయంగా నమక చమకాలతో రుద్రాభిషేకం చేసిన ఫలితం పొందుతారు. ఈ లింగార్చన వలన లక్ష మార్లు రుద్రజపం చేసిన ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 

ఓంకారేశ్వరుడి లింగంతో పాటూ అకారేశ్వర లింగం, మకారేశ్వర లింగం కూడా ఉంటాయి. వాటిని కూడా తప్పకుండా దర్శించండి. (పూర్వం బిందు లింగం, నాద లింగం కూడా ఉండేవట). ఈ ఐదు లింగాలను (అకార, మకార, ఓంకార, బిందు, నాద లింగాలు) పంచ అక్షర లింగాలు అని పిలుస్తారట. మత్స్యోదరీ తీర్ధంలో స్నానం చేసి ఓంకారేశ్వరుడిని అర్చిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మచ్చోదరి ప్రాంతంలో పథాని టోలా మార్గంలో ఈ ఆలయం ఉంది.


8) నాగేశ్వర జ్యోతిర్లింగం : 
ఈ లింగానికి ప్రతిగా కాశీలో కూడా నాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. పథాని టోలా మార్గంలో సంకటా దేవి ఆలయ సమీపంలో నాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన మనం జీవితంలో తెలిసిగాని, తెలియకగానీ చేసిన సమస్త పాపాలూ నశిస్తాయట. 

మృత్యుంజయ్ మహాదేవ్ ఆలయంలో కూడా నాగేశ్వర్ లింగం ఉంది. ఆ లింగాన్ని కూడా నాగేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా చెప్తారు. 

9) త్రయంబకేశ్వర్ నాశిక్ : 
నాశిక్ త్రయంబకేశ్వరునికి ప్రతిగా కాశీలో త్రయంబకేశ్వరుడు వెలిసాడు. త్రిలోకనాధ్ అనే పేరుతో కూడా ఈ లింగాన్ని పిలుస్తారు. Hauj Katora అనే ప్రదేశంలో పురుషోత్తం ఆలయంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో అనేక విష్ణు ప్రతిమలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని పురుషోత్తం ఆలయం అని పిలుస్తారు. కనుక్కుంటూ వెళ్లాల్సిందే. 

10) భీమేశ్వర్ జ్యోతిర్లింగం :
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో భీమాశంకరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన మనం చేసిన అన్ని రకాల కర్మలూ నశించి మోక్షం లభిస్తుందట. 

విశ్వనాధుని ఆలయం నుండి ఉత్తర దిశగా నడిస్తే సరస్వతీ పాఠక్ అని వస్తుంది. అక్కడి నుండి కాశీ కార్వత్ ఆలయం కనుక్కుంటూ వెళ్ళండి. ఈ ఆలయంలోనే భీమాశంకరుడు కొలువై ఉన్నాడు. 

11)  కేదారేశ్వర్ : 
కాశీలో తప్పక దర్శించాల్సిన మందిరం. విశ్వనాధ లింగం ఎంత గొప్పదో.. అలాగే స్మరణ మాత్రం చేత మోక్షాన్నే ఇవ్వగలిగిన లింగం కేదారేశ్వర లింగం. ప్రతీరోజూ ఉభయ సంధ్యలయందు కేదారేశ్వరుడిని స్మరిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. 

తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో గంగాస్నానం చేసి, కేదారేశ్వరుడిని దర్శించాలి. ఈ కేదారేశ్వర లింగం కూడా స్వయంభూ లింగమే. హిమాలయ కేదారేశ్వరుడి కన్నా కాశీలోని కేదారేశ్వరుడు ఉదారుడు అంటారు.

పూర్వం వశిష్ఠుడనే బ్రాహ్మణ పిల్లవాడు ప్రతీ సంవత్సరం తన గురువు గారితో కలిసి హిమాలయాల్లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేవారు. ఒకసారి కేదార దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో తన గురువుగారు చనిపోతూ కేదారేశ్వరుడుని దర్శించుకునే మార్గంలో ప్రాణాలు పోయినా కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి ప్రాణాలు విడిచారు. తరువాత ఆ పిల్లవాడు కాశీ క్షేత్రంలో బ్రహ్మచారియై సదా పరమేశ్వర ధ్యానంలో గడిపేవాడు. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం చైత్ర మాసం లోని పౌర్ణమి తిధిలో హిమాలయ కేదారేశ్వరుడిని దర్శించుకుని వచ్చేవాడు. వశిష్ఠుడు వార్ధక్యం చేత ఇంక కేదారేశ్వరుని దర్శనానికి వెళ్లలేక, కాశీలో పరమేశ్వరుడిని ప్రార్ధించగా వశిష్ఠుని కోరిక మేరకు పరమేశ్వరుడు కేదారేశ్వరుడిగా కాశీలోనే వెలిసాడు. హిమాలయ కేదారేశ్వరుడి పూజ కన్నా, కాశీలోని కేదారేశ్వరుడి పూజ 7 రెట్లు అధిక పుణ్యఫలం ఇస్తుందని ప్రతీతి.


12) విశ్వేశ్వర్ : 
కాశీ విశ్వనాధ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయం. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని 'బంగారు మందిరం' అని కూడా అంటారు. విశ్వనాధుని దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం.


బుధవారం, సెప్టెంబర్ 06, 2017

మాతా వైష్ణోదేవి - జమ్ము కాశ్మీర్‌ - Maa Vaishnodevi

పుణ్యప్రదమైన తీర్థయాత్రగా చెప్పబడే జమ్ము-కాశ్మీర్‌లో వెలసిన వైష్ణవీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం...

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం. అందుకే ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.

అమ్మవారి పేరు త్రిపుట. త్రిపుట కొండపై వెలసింది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయాలనుకున్నారు. వారి సంకల్ప మాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

స్థలపురాణం:
రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. ఎక్కువ భాగం ధ్యానంలో గడిపేది. ఓసారి తన తండ్రిని సముద్ర తీరానికి తీసుకువెళ్లమంది. అక్కడ ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు తన భార్య సీతకోసం హనుమంత, సుగ్రీవ సైన్యంతో అక్కడకు వచ్చాడు. అప్పుడు ఈమె ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆమెకు రాముని విషయం తెలిసింది. తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అయితే అది సాధ్యపడదని రాముడు చెప్పాడట.

అయితే ఆ తర్వాత ఆమెకు ఓ అవకాశం ఇచ్చాడు. తిరిగి తను మళ్లీ వస్తాననీ, అలా వచ్చినప్పుడు తనను గుర్తుపడితే చేసుకుంటానని చెప్పాడట. అప్పటివరకూ ఉత్తరాదిలోని త్రిపుట కొండల్లో ధ్యానంలో ఉండమని శ్రీరామచంద్రులవారు సూచించారట. అలా కాత్రా వైపు ఉన్న కొండల్లో మాత ధ్యానం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు ముని వేషధారణలో త్రిపుటను కలిశాడు. కానీ ఆమె గుర్తించలేదు. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.  త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని  తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని,  ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది.  అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి  అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.  భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు.  తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు  వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. 

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్‌ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించ టానికి. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణ పాదుక అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ ఈ పవిత్ర గుహ అర్ధకువారి (గర్భచూర్) దగ్గరకు వస్తుంది వైష్ణవి. ఈ గుహలోనే అమ్మవారు 9 నెలలు తపస్సు చేసింది. 9నెలల తర్వాత అమ్మవారి ఉనికిని భైరవుడు కనుక్కుని అక్కడకు వచ్చాడు. అయినా భైరవుడికి తన తప్పు దిద్దుకునే ఆఖరి అవకాశం ఇచ్చి, త్రిశూలంతో ఆ గుహ గోడను చీల్చుకుంటూ రెండవ వైపుకు వెళ్లిపోయింది. అమ్మవారి సన్నిధికి చేరిన భైరవుడు అన్ని హద్దులూ అతిక్రమించాడు. చివరికి అమ్మవారు విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో మరో పర్వత శిఖరం మీద పడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. 
వైష్ణోదేవి గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు ('పిండీ' లంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు. ఆ రూపాన్ని ధ్యానిస్తే అనుకున్నవి నెరవేరతాయని విశ్వాసం. దర్శనం అనంతరం దేవాలయం వెనక్కి వెళితే ఆలయం వెనుక గంగాజలం పడుతుంటుంది. వాటిని శిరసుపై చల్లుకుని తాగితే కొండపైకి ఎక్కిన శ్రమంతా మాయమైపోతుందని నమ్మకం. ఆ తర్వాత అక్కడ అమ్మవారి ప్రసాదాలు తీసుకుని కిందికి దిగుతూ ఈశ్వరాలయాన్ని దర్శించుకోవాలి. దీంతో అమ్మవారి దర్శనం పూర్తవుతుంది.

పంచపాండవులు కట్టిన గుడి:
పాండవులు తమ అరణ్యవాసంలో బాల త్రిపుట గురించి తెలుసుకుని వచ్చారట. ఆమె ధ్యానం, భక్తికి, ధర్మానికి మెచ్చి అనంతరం దేవాలయాన్ని కట్టించారని ప్రతీతి. జమ్మూ నుంచి కాత్రాకు వెళుతుండగా నరోలి అనే గ్రామంలో ఆమె చిన్నతనంలో ధ్యానం చేసుకున్న ప్రాంతం గుడిగా మలిచారని అక్కడి గోడలపై రాతలు చెబుతాయి.
జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. దేశంలోనే తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులు చాలా ఉత్తమం.

కాత్రా ప్రయాణం:
మాతను ముందుగా హంసలి గ్రామంలోని కోల్కండోలీలో దర్శనం చేసుకుంటాము. ఈ కోల్కండోలీలోనే అమ్మవారు తొలిసారిగా బాలిక రూపంలో శ్రీధరుడికి దర్శనం ఇచ్చింది. 

ఈ చోటనే నాలుగు దిశలా వైష్ణవీ మాత చిహ్నాలు కనిపిస్తాయి. ఒక చోట అమ్మ ఉయ్యాల ఊగిన దృశ్యం ఉంటే, ఇంకో చోట అమ్మవారు తన పాత్రలో బావి నీళ్ళు నింపుకునే దృశ్యం ఉంటుంది. ఈ స్థానంలోనే తన భక్తుడయిన శ్రీధరుణ్ణి సంతానం కోసం వైష్ణవ విందు ఏర్పాటు చేయవలసినదిగా అదేశించింది. అప్పుడు అమ్మవారే స్వయంగా బాలిక రూపం ధరించి అందరికీ వడ్డించింది. అప్పుడు అమ్మవారిని పరిక్షించగోరి భైరవనాధుడు మద్యం కావాలని అడిగాడట. అప్పుడు అమ్మవారు మద్య మాంసాలు ఇవ్వడం పాపం అని ఇవ్వడం కుదరదని చెప్పిందట. అయినా భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి మాయం అయిపోయింది. 

అలా మాయం అయిన అమ్మవారు కొన్ని క్షణాలు నిలిచి దేవుడిని ప్రార్ధించారు. ఆ స్థలమునే మలి దర్శనంగా పేర్కొంటారు. అదే దేవమాత ఆలయం. ఇక్కడ మహా లక్ష్మి, మహా కాళి, మహా సరస్వతి లను దర్శించుకోవచ్చు. 



బాణ గంగ :
భైరవనాధుడుకి అమ్మవారి శక్తి తెలియదు. అందుకే అహంకారపూరితుడై అమ్మవారిని వెంబడించాడు. అప్పుడు అమ్మవారు ఒక బాలకుడితో పాటు భైరవనాధుడుకి అందకుండా పర్వతాల వైపు ప్రయాణం సాగించింది. దారిలో బాలకుడికి దాహం వేయగా అమ్మవారు తన బాణంతో నేలను చీల్చి గంగా నీటిని పుట్టించింది. ఈ ప్రదేశాన్ని బాణ గంగ అంటారు. 

చరణ పాదుక:
అక్కడి నుండి అమ్మవారు త్రికూట పర్వతానికి బయలుదేరిందట. మార్గ మధ్యంలో ఇక్కడే విశ్రమించిందట. ఆ ప్రదేశమే చరణ పాదుక అని అంటారు. నేటికీ ఇక్కడ అమ్మవారి పాదాలను మనం చూడవచ్చు. ఇక్కడ నుండే అమ్మవారు భైరవుడు తనని వెంటాడుతున్నాడా లేదా అని వెనుకకు తిరిగి చూసిందట. ఇక్కడి నుండి నేరుగా వైష్ణవీ మాత ఆలయం దిశగా ముందుకు సాగుతారు. 

గర్భచూర్:
భైరవుడు అజ్ఞానాన్ని మన్నించిన అమ్మవారు ఈ త్రికూట పర్వతం లోని ఒక గుహలో 9నెలలు ఈశ్వరుడిని ప్రార్ధించిందట. అక్కడికి కూడా భైరవుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చేసాడట. అయినా భైరవుడికి తన తప్పు దిద్దుకునే ఆఖరి అవకాశం ఇచ్చిందట. ఆమె త్రిశూలంతో ఆ గుహ గోడను చీల్చుకుంటూ రెండవ వైపుకు వెళ్లిపోయిందట. ఈ గుహని గర్భచూర్ అని పిలుస్తారు. ఇక్కడి నుండి బయటకు రావడం అంటే తల్లి గర్భం నుండి బయటకు రావడం గానే చెప్తారు. ఇక్కడి నుండి వెలుపలికి రాగానే సకల పాపాలు నశిస్తాయట. చివరికి అమ్మవారి సన్నిధికి చేరిన భైరవుడు అన్ని హద్దులూ అతిక్రమించాడు. అందుకే అమ్మవారు భైరవుడిని వధించిందట. 







గురువారం, జూన్ 22, 2017

శాంతి మంత్రములు - Shanti Mantra

ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో బ్రాహ్మణులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం: 
సర్వ జీవులు రక్షింప బడు గాక... సర్వ జీవులు పోషింప బడు గాక... అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి (సమాజ ఉద్ధరణ కోసం)... మన మేధస్సు వృద్ది చెందు గాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక... 

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు.. 
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం భవతు.. 

తాత్పర్యం: 
సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక.. 
సర్వులకు శాంతి కలుగు గాక.. 
సర్వులకు పూర్ణ స్థితి (completeness) కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక.. 

3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:
సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక.. 
సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక.. 
అందరికీ ఉన్నతి కలుగు గాక.. 
ఎవరికీ బాధలు లేకుండు గాక.. 

4. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం: 
మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశము లో ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక.  

5. ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ.. 
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము (మిధ్య) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. (అజ్ఞానం అనే) అంధకారము నుండి (జ్ఞానస్వరూపమైన) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

6. స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు...

తాత్పర్యం: 
ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గం లో పాలింతురు గాక. గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.

7. ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణో, నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక.. బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను. సత్యము, బ్రహ్మము నన్ను రక్షించు గాక, నా గురువును, సంరక్షకులను రక్షించు గాక.

8. ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి:
పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి:
వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి:
బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి:
సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకము లందలి దేవతల యందు, బ్రహ్మ యందు, సర్వ జనుల యందు, శాంతి నెలకొను గాక. ( పంచభూతముల వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక ) శాంతి యందె శాంతి నెలకొను గాక. నాయందు శాంతి నెలకొను గాక.

పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్ధించడం మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం.

* * * సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు * * *

శుక్రవారం, జూన్ 02, 2017

కేదార్ నాథ్ యాత్రా విశేషాలు - Kedarnath Yatra

కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగజిల్లాలో ఉన్నది. చార్ ధామ్ అనబడే నాలుగు క్షేత్రాలలోకి కేదార్ నాథ్ ఒకటి. ఈ కేదార్ నాథ్ యాత్ర ఎంతో ఆనందంగా ఉంటుంది. కేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉన్నది. మందాకినీ నది పై భాగంలో మంచు కప్పిన కొండల మధ్య నెలకొని ఉన్నది.

కేదార్ నాథ్ వెళ్ళే దారిలో మోటారు వాహనాలు వెళ్ళ గల చివరి ప్రదేశం గౌరీకుండ్. ఇక్కడి నుండి నడిచిగాని, గుర్రాల మీదగాని కేదార్ నాథ్ చేరుకోవాలి. హిందువులు పవిత్రంగా భావించే కేదార్ నాథ్ శివాలయం ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం. గుర్రాల మీద వెళ్ళేవారు గౌరీకుండ్ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి, కేదార్ నాథ్ వెళ్ళి స్వామిని దర్శించి, సాయంత్రం చీకటి పడేలోపుగా గౌరీకుండ్ కు తిరిగి రావచ్చు.

గౌరికుండ్ నుంచి కేదార్ నాథ్ కు 14 కి.మీ. దూరం. గుర్రం మీద వెళితే సుమారు నాలుగు గంటలు పడుతుంది. పల్లకీలో వెళితే దాదాపు 5 గంటలు పడతుంది. పిట్టూలో వెళితే సుమారు ఆరు గంటలు పడుతుంది. అందువల్ల నడిచిగాని, పిట్టూలో గాని, వెళ్లేవారికి కేదార్లో రాత్రి బస తప్పనిసరి. ఎందుకంటే కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి, తిరిగి సాయంత్రం నాలుగు, అయిదు గంటల మధ్య తెరుస్తారు.

ఈ కేదారేశ్వర ఆలయం, మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాసంలో, అనగా ఏప్రిల్ నెల ఆఖరి వారంలోగాని, మే నెల మొదటివారంలో గాని వస్తుంది. తిరిగి వృశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వృశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసివేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలోగాని, నవంబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామివారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.

ఆలయం మూసివేయగానే స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్ కు 52 కి.మీ. దూరంలో ఉన్న ఉఖీమఠ్ లో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఆ ఆలయంలో ఒక ప్రత్యేక మందిరము, అందులో ఒక సింహాసనమూ ఉన్నాయి. చలికాలం ఆరునెలలూ, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆ సింహాసనం మీద ప్రతిష్టించి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ఆలయ ప్రాగణంలో ఒక బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉన్నది. ఈ నంది సజీవ ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ దేవాలయం గోడలనిండా దేవతల శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి.

పురాణ ప్రాశస్త్యం:
కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.
మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః 
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! 
(ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే!

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు. అపుడు ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి "మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగి పోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోండి" అని అడిగారు. అపుడు వారు "స్వామీ.. ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు" అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు. 

తమ బంధు జనులను సంహరించిన పాపాన్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవులు కాశీ క్షేత్రానికి వెళ్లారట. పరమేశ్వరుడు వారికి దొరక కూడదని కేదార క్షేత్రానికి వెళ్ళిపోయాడట. ఈ విషయం తెలుసుకున్న పాండవులు శివ స్పర్శకై కేదారం వెళ్లారట. అప్పటికి కేదార ఆలయంలో చిన్న శివలింగం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయిపొయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు. కాబట్టి అప్పటికి చిన్న లింగం మాత్రమే మిగిలి ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట కలిగి, చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడట. పాండవులు దానిని గమనించారు. వారు అది ఖచ్చితంగా శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిష రూపంలో వెళుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పావన మయిన క్షేత్రం కేదార క్షేత్రం. పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. మహిషంలో కూడా శివుడిని చూసారు. అందుకే దాని కాళ్ళు పట్టుకోవాలని వారు మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి మహిషం కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చి వేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. పాండవులు మహిష రూపంలో ఉన్న శంకరుని తోక భాగం పట్టి లాగడంతో స్వామి పృచ్ఛ భాగం ఎర్రగా కమిలిపోయిందట. అందుకే ఆవునేతితో స్వామి అభిషేకం చేస్తారు అక్కడ. ఆ అభిషేకం చేసిన నేతిని మనం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాంటి నొప్పులు అయినా ఆ నేతితో మర్దనా చేస్తే తగ్గిపోతాయట.

కేదారనాథ్ ఆలయం:
అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతుంది. కేదార్ నాథ్ ఆలయము ఆది శంకరులచే 8వ శతాబ్ధంలో పునర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు ఈ పుణ్యక్షేత్రంకు వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు ఎన్నో ఉన్నాయి. 

గౌరీకుండ్ చేరగానే మొదటనే, చిన్న విశాలమైన ప్రదేశం ఉంది. బస్సులు, మిగిలిన వాహనాలు ఈ ప్రదేశంలో నిలిపి ఉంచుతారు. ఈ చిన్న మైదాన ప్రదేశానికి ఆ చివర, అంటే మెట్లదారి ప్రారంభమయ్యేచోట ఒక చిన్న పార్వతి దేవి ఆలయం ఉన్నది తప్పకుండా దర్శించుకోండి. 

షాపులు, హోటళ్ళ మధ్య నుంచి సాగుతూ వెళ్ళే మెట్ల మార్గం సుమారు అర కి.మీ. దూరం తరువాత అంతం అవుతుంది. ఆ చివర, ఇళ్ళ మధ్య కొంచెం విశాలంగా ఉన్నచోట రెండు ఉష్ణకుండాలు ఉన్నాయి. అందులో ఒకటి స్త్రీలకు రెండవది పురుషులకు. కుమార స్వామికి జన్మనిచ్చిన తరువాత గౌరీదేవి ఈ కుండంలో స్నానం చేసిందని స్థలపురాణం. 

గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకూ ప్రయాణం మందాకిని నది ఒడ్డు వెంబడే సాగుతుంది. గౌరీకుండ్ నుండి బయలుదేరిన రెండు గంటల తరువాత 'రాంబాడ' అనే చోటుకు చేరతాం. గౌరీకుండ్ నుంచి రాంబాడ సరిగ్గా 7కి.మీ. దూరం. గౌరీకుండ్ సముద్రమట్టం నుంచి 1982 మీటర్ల ఎత్తులో ఉంది. రాంబాడా ఎత్తు 2591 మీటర్లు. రాంబాడ నుండి మరొక 4 కి.మీ. దూరం వెళితే 'గరుడచట్టి' అనే ప్రదేశం వస్తుంది. ఈ గరుడచట్టి సముద్రమట్టానికి 3262 మీటర్ల ఎత్తులో ఉంది. గరుడచట్టి దాటగానే ఆ ఊరి బయటనుంచే కేదార్ నాథ్ కనిపిస్తూ ఉంటుంది.

గరుడచట్టి నుంచి కేదార్ నాథ్ 3 కి.మీ. దూరంలో ఉన్నది. కేదార్ నాథ్ చుట్టూ గుర్రపునాడా ఆకారంలో కొండలు పరచుకుని ఉన్నాయి. మధ్యలో ఉన్న లోయ వంటి ప్రదేశంలో కేదార్ నాథ్ ఆలయమూ, దాని చుట్టూ చిన్న ఊరు ఉన్నాయి. ఊరుకు చిట్ట చివర ఒక ఆలయం ఉంది. ఆలయమూ, దాని చుట్టు ఉన్న ప్రాంగణమూ మొత్తము వీధికంటే సుమారు 10 అడుగుల ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.

ఆలయం ముందు సుమారు 30 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న ప్రాంగణం ఉన్నది. ఆలయానికి మిగిలిన మూడు వైపులా సుమారు 15 అడుగుల వెడల్పు ఉన్న ప్రదక్షిణ మార్గం ఉన్నది. ఆలయం పైన, ముందుభాగం మొత్తమూ రేకుల షెడ్డు.. రెండు ప్రక్కలకూ క్రిందకు వాలి ఉంటుంది. వెనుకవైపు గర్భాలయంపైన పది అడుగుల చదరంగా ఉన్న విమానమూ, చిన్న శిఖరము ఉన్నాయి. ఆలయం ముందు భాగం 30 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉన్నది. మధ్యలో 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే, ముందుభాగంలో ఒక చిన్న ముఖమంటపమూ, ముఖమంటపదాటి లోపలకు వెళితే, గర్భాలయం వస్తుంది. ఈ గర్భాలయం సుమారు 25 అడుగుల చదరంగా విశాలంగా ఉన్నది.

ఎడమవైపు గోడలో బదరీనారాయణుని యొక్క మూర్తి ఉన్నది. స్థలపురాణం ప్రకారం ఈ కేదార్ నాథ్ ఉన్న ప్రదేశానికే కాక, బదరీ నాథ్ ఉన్న ప్రదేశానికి కూడా ఈ కేదార్ నాథుడే అధిపతి. నరనారయణులు ఈ ప్రదేశానికి వచ్చి, ప్రస్తుతం బదరీనాథ్ ఉన్న ప్రాంతం తాము తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉందని భావించి, దానికి ఈ కేదార్ నాథుని అనుమతి పొంది తపస్సు ఆచరించారట. ఆ కారణం చేతనే ఈ ఆలయం లోపల బదరీనాథుని మూర్తి ఉన్నదని కొంతమంది అభిప్రాయం.

గర్భలయానికి మధ్యలో సుమారు 8 అడుగుల చదరంగా ఉన్న పానవట్టంలో, కేదారేశ్వరుని లింగ మూర్తి ఉన్నది. స్వామి త్రిగుణాకారంలో స్వయంభువుగా లింగరూపంలో కేదారేశ్వరుడిగా కొలువై పూజింపబడుతున్నారు.
ఈ విగ్రహమూర్తి ఆకారం కొంచెం మార్పుగా ఉంటుంది. మాములుగా మనం చూసే శివాలయాలలో లింగాకారంలా ఉండదు. 3 అడుగుల ఎత్తు ఉండి, ఉపరితలం నున్నగా కాకుండా, గరుకుగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత కుడి ప్రక్క గణేషుడు, ఎడమప్రక్క పార్వతిదేవి, వెనుకవైపు శ్రీకేదారేశ్వరస్వామి వారు ఉన్నారు. త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలు మరచిపోతారు.

ఆలయం ముందుభాగంలో కుంతిదేవి, పంచపాండవులు, శ్రీకష్ణుని మూర్తులు గోడలపై వరుసగా కుడ్య విగ్రహాలుగా దర్శనమిస్తాయి. పాండవులు కుంతిదేవితో కలిసి ఇక్కడ ఉన్న కేదారేశ్వరుని తరచుగా పూజించేవారు. అందువలన వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరి అభిప్రాయం. పాండవులచే నిర్మించబడిన ఈ ఆలయం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులవారిచే పునర్నిర్మించబడినది అని చెబుతారు.

ఆలయం లోపల ముందు హాలులోని గోడలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి, పురణాల ఇతిహాసాల ఘట్టాలను తెలియజేస్తున్నాయి. గ్రే కలరు రంగు రాళ్ళతో అతి పెద్దగా, బలంగా, ఎంతో అద్భుతంగా ఈ ఆలయం నిర్మించబడింది. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఎటువంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఏవిధంగా నిర్మింపబడిందో అనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.


పూజా కార్యక్రమాలు:
కేదారేశ్వరస్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు. ఉదయం పూట బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నోచేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు.

కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి, తిరిగి సాయంత్రం నాలుగు, అయిదు గంటల మధ్య తెరుస్తారు.

సాయంకాలం జరిగే పూజను శృంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామివారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తరువాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6 గంటల నుండి 7 గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయమున స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభ్యమవుతుంది.

కేదార్ నాథ్ లో చూడవలసిన ఇతర ఆలయాలు:
ఈశానేశ్వర్ మహాదేవ్: 
కేదారేశ్వర్ ఆలయము బయట ఆవరణలోనే ఈశానేశ్వర్ మహాదేవ్ స్వామివారి చిన్న ఆలయం ఉన్నది. భక్తులు కేదారేశ్వరుడిని దర్శించిన తరువాత ఈశానేశ్వర్ ఆలయాన్ని దర్శిస్తారు.

భైరవ ఆలయం:
కేదార్ నాధ్ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో భైరవుని ఆలయం ఉంది. 6 నెలల పాటు కేదారేశ్వరుని ఆలయం మూసివేసిన సమయంలో ఈ భైరవుడే కేదారనాధుని ఆలయాన్ని సంరక్షిస్తాడట. ఈ ప్రదేశం నుండి మొత్తం కేదార్ నాథ్ వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. 


ఆదిశంకరాచార్యుని సమాధి: 
శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి వెనుకవైపున సుమారు 100మీటర్ల దూరంలో ఒక రేకుల షెడ్డు ఉన్నది. దీనినే శంకరాచార్య సమాధి అంటారు. షెడ్డు చెక్క స్తంభాలతో నిర్మించబడింది. పైన ఇనుపరేకులు, లోపల ఆదిశంకరాచార్యుల వారి విగ్రహమూర్తి ఉన్నది. అయితే శంకరాచార్యుల వారు కేదార్ నాథ్ లోని ఒక గుహ లోపలికి వెళ్ళి కనిపించకుండా అదృశ్యమైనారని కొందరంటారు. ఆయన కంచిలో సమాధి చెందారనేది మరొక వాదన.

శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశం నలువైపులా ప్రచారం చేసిన జ్ఞాని. పురాణాల ప్రకారం అతడు బదరీనాథ్ యొక్క జ్యోతిమఠ్ ఆశ్రమం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, చివరగా కేదార్ నాథ్ పర్వతాలకు వెళ్ళారు. శంకరాచార్యులవారి నలుగురు ప్రియశిష్యులు అతనిని అనుసరించారు. కానీ వారిపై శంకరాచార్యులు ఒత్తిడి తెచ్చి వారిని పంపి వేసి తను ఒంటరిగానే బయలుదేరారు. శంకరాచార్యులవారు తన 32వ ఏటనే సమాధి సిద్ధి పొందారు. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. 2013 లో వచ్చిన వరదలలో ఆదిశంకరాచార్యుల సమాధి కట్టడం కొట్టుకుపోయింది. 

ద్వాపరయుగంలో పాండవులు తమ పాపములను తొలగించిన స్వామిపై భక్తితో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత కొన్నివేల సంవత్సరాల అనంతరం ఆదిశంకరాచార్యుల వారు తన శేషజీవితాన్ని ఇక్కడే తపస్సులో గడిపి సమాధి అయినారని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో వేడినీటి బుగ్గను చూడవచ్చు.

పంచ పర్వతాలు: 
కేదార్ నాథ్ ఆలయానికి వెనుకగా సుమారు 2 కి.మీ దూరంలో, అడ్డంగా పరుచుకుని ఉన్న ఒక కొండల వరుస కనిపిస్తూ ఉంటుంది. వంతెన ప్రక్క నుంచి మందాకిని నది ఒడ్డునే, ఆ కొండల వరకూ ఉన్న మార్గం కూడా చూడవచ్చు. మందాకిని నది ఆ కొండలలో నుండి రెండు ధారలుగా వచ్చి, ఆ కొండల క్రింద ప్రాంతములో కలిసిపోయి, ఒకే ప్రవాహంగా ముందుకుసాగుతూ వస్తుంది. 

ఆ కొండల వరుసను రుద్ర హిమాలయాలు అని అంటారు. వాటినే సుమేరు పర్వతాలనీ, పంచ పర్వతాలు అని కూడా అంటారు. ఇవి వరుసగా రుద్ర హిమాలయం, విష్ణు పురి, బ్రహ్మపురి, ఉద్గరికాంత, స్వర్గారోహణ అనే పేర్లు కలిగి ఉండటం వలన వీటికి పంచపర్వతాలు అని పేరు వచ్చినది. పాండవులు స్వర్గానికి బయలుదేరి వెళుతూ ఉండగా, ధర్మరాజు తప్ప, మిగిలిన సోదరులు, ద్రౌపది స్వర్గారోహణ అనే ఈ పర్వతం మీదనే ఒక్కొక్కరుగా నేలకు ఒరిగారు. ఈ స్వర్గారోహణ అనే పర్వతానికి చేరే దారిలోనే 'మహాపధ్' (మహాపంత్) అనే చిన్న శిఖరం ఉన్నది. ఇది దాటితే స్వర్గారోహణ పర్వతం కన్పిస్తుంది.

బుగ్గ ఆలయం: 
శ్రీ కేదారేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత ఆలయానికి ఎదురుగా కుడివైపుగా తిరిగి 2 కి.మీ. దూరం ముందుకువెళితే ఈ బుగ్గ ఆలయంను దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఓం నమశ్శివాయ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో స్వామి మూర్తి ఎదురుగా నాలుగు పలకల నీటి కుండం ఉన్నది. ఆ కుండం వైపు వంగి ఓం నమశ్శివాయ అంటే నీటి బుడగలు వస్తాయి. ఓం నమశ్శివాయ అనే శంకరుని నామం నిత్యం వినబడే ఆ ప్రదేశంలో బుడగలు నిరంతరం వస్తూనే ఉంటాయి.

అగస్త్యేశ్వర మందిరం: 
అగస్త్యేశ్వర ముని నివాసం అనే ఆలయం కేదార్ నాథ్ లోని మందాకిని నది ఒడ్డున 1000మీ. ఎత్తులో ఉన్నది. ఈ ప్రదేశాన్ని అగస్త్యముని నిత్యం ధ్యానం చేసుకున్న ప్రదేశంగా చెబుతారు. ఇచ్చట ఉన్న ఆలయాన్ని స్థానికులు అగస్త్యేశ్వర్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో గోడలపైన ప్రసిద్ధ హిందూ దేవతామూర్తులు ఉన్నారు. ఇచ్చట “బైశాఖి” పండుగను చాలా ఆనందంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు.

రేతకుండము: 
కేదార్ నాథ్ చుట్టుప్రక్కల ప్రదేశాలలో చాలా కుండాలు ఉన్నాయి. ఆ కుండాలు అన్నింటిలోకి రేతకుండము చాలా ప్రసిద్ధి చెందిన కుండము.

ఇంకా శివకుండము, భృగు కుండము, రుధిర కుండము, వహ్ని తీర్థము, హంసతీర్థము అనేవి కూడా ఇచ్చట ఉన్నాయి. ఇవన్నీ కేదారేశ్వరుని ఆలయానికి దక్షిణంగా, మందాకిని నది ఒడ్డునే ఉన్నాయి.

గాంధీ కుండం:
 ఈ కుండం వద్దనే పాండవాగ్రజుడు అయిన ధర్మరాజు స్వర్గానికి ఇంద్రుని విమానం ఎక్కాడట. గాంధీ గారి అస్థికలు ఈ కుండంలోనే కలిపారట. అందుకే దీన్ని గాంధీ కుండం అని వ్యవహరిస్తున్నారు. 

దూద్ గంగ:
ఆలయానికి ముందు, అనగా ఊరు మొదటనే ఉన్న వంతెనకు ఎడమవైపు ఉన్న ఒక కొండమీద నుండి, ఒక జలపాత ధార తెల్లని పాలలాగా మెరుస్తూ క్రిందకు దిగివచ్చి, మందాకిని నదిలో కలసిపోవడం మనం చూడవచ్చు. దీనిని దూద్ గంగ అని అంటారు.

ముగింపు:
హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పడుకోవాలి.

అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచు హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. 

యాత్రలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంది. లోపలికి వెళితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం చెప్తుంది. కేదారం వెళ్ళినపుడు చనిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది.

అక్కడే మనం కొండ ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. 

కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు.

స్మరణ మాత్రం చేతనే మోక్షం ఇవ్వగలిగినవాడు కేదారేశ్వరుడు. ప్రతీ రోజూ ఉభయ సంధ్యల యందు "ఓం కేదారేశ్వరాయ నమః" అని మూడు సార్లు పలికితే చాలు... స్వామి పొంగిపోతారట. 


***సర్వం శ్రీపరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు***