బుధవారం, జులై 23, 2014

కాశీలో ఏం వదలాలి...?

కాశీలో ఈషణ త్రయాన్ని వదలాలి.

అనగా
దారైషణ = భార్య/భర్త మీద మోహం
ధనైషణ = ధనం ఐశ్వర్యం మీద మోహం
పుత్రైషణ = సంతానం మీద మోహం

కాశీలో వదలవలసినవి ఈ మూడూ. అవి మూడూ వదిలి విరాగిగా మారు వరకు అభ్యాసంగా ఇతర ఇష్టమైన పదార్థములు వదులుతూ ఉంటారు.

అందరూ ఇవి వదలలేరు కనుక ప్రతిగా ఆకు, కూర, పండు వదులుతారు. (బహుశా అలా తినే వస్తువులను వదలగా వదలగా మనసు సంస్కరింపబడి కాస్త వైరాగ్యం పాలు పెరుగుతుందనేమో). 

షోడశోపచార పూజావిధి - Shodasopachara Pooja

మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి మర్యాద చేస్తామో అదే మన ఇష్ట దైవాన్ని కూడా పూజ పరంగా మర్యాద చేయడమే షోడశ (పదహారు) ఉపచారాల విధానం. ఈ విధానం ప్రతీ దేవత పూజలోను పాటించి తీరాలి.

1)ఆవాహనము:
మనస్పూర్తి గా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
2)ఆసనము:
వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
3)పాద్యము:
కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
4)అర్ఘ్యము:
చేతులు పరిశుభ్ర పరచడం
5)ఆచమనీయము:
మంచినీళ్ళు ఇచ్చుట
6)స్నానము:
ప్రయాణాలసట తొలిగే నిమ్మిత్తం
7)వస్త్రము:
స్నాన అనంతరం – పొడి బట్టలివ్వడం
8)యజ్ఞోపవీతము:
మార్గ మధ్యంలో మైలపడిన – యజ్ఞోపవీతాన్ని మార్చడం
9)గంధం:
శరీరం మీద సుగంధాన్ని చిలకడం
10)పుష్పం:
వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు.
11)ధూపము:
సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం
12)దీపము:
పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం
13)నైవేద్యము:
తన స్థాయి అనుసరించి – తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం.
14)తాంబూలం:
మనం భక్తి తో ఇచ్చిన పదార్థాల వల్ల – వారి ఇష్టాయిష్టాలకి కలిగే – లోపాన్ని తొలగించడం
15)నమస్కారం:
గౌరవించడానికి సూచన
16)ప్రదక్షిణం:
ముమ్మూర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం.

ఉజ్జయిని జ్యోతిర్లింగం - Ujjayini Jyotirlingam

 పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. 

మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి/ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. 

‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.

ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి (చెట్టు నుండి పండు పడిపోయినట్టు) ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో, ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. 

ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.

ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.

దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళ లింగ రూపంలో వెలిశాడు.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదారో, వారికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. ఆవుపేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో భస్మమందిరంలోని స్వామివారికి అభిషేకం చేస్తారు.

ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 

రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.



శుక్రవారం, జులై 18, 2014

విశాలాక్షీ శక్తి పీఠం - Vishalakshi Shakti Peetham

విశ్వేశ్వరుడి నివాస స్థానమైన కాశీ క్షేత్రంలో ‘విశాలాక్షీ శక్తి పీఠం’ ఆవిర్భవించింది. సతీదేవి ‘మణికర్ణిక’ ఈ ప్రదేశంలో పడిందని చెబుతుంటారు. సప్త మోక్షపురాల్లో ఒకటిగా… ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక ఇక్కడి అమ్మవారికి విశాలాక్షి అనే పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథ వినిపిస్తోంది.

భూలోకంలో అధర్మం పెరిగిపోతుండటంతో, పరిపాలన చేపట్టి ధర్మాన్ని కాపాడమని ‘దివోదాసు’అనే క్షత్రియుడిని కోరాడు బ్రహ్మదేవుడు. అయితే దేవతలంతా భూలోకం విడిచి వెళితేనేగాని తాను పరిపాలనా బాధ్యతలను స్వీకరించనని దివోదాసు తేల్చిచెప్పాడు. ఆ సమయంలోనే శివుడు కూడా కాశీ నగరాన్ని వదలి కైలాసానికి వెళ్లిపోయాడు.

కాలం గడుస్తున్న కొద్దీ కాశీ నగర వియోగాన్ని పరమ శివుడు తట్టుకోలేకపోయాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తుండటం వల్ల, అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోయాడు. ఇది గమనించిన వినాయకుడు దివోదాసుకి వైరాగ్యాన్ని కలిగించి, అతనే శివుడిని ఆహ్వానించేలా చేశాడు.

దివోదాసు ఆహ్వానం అందుకున్న శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీ క్షేత్రంలో కాలుపెట్టాడు. పట్టరాని ఆనందంతో వస్తోన్న శంకరుడిని పార్వతీదేవి తన కళ్లను విశాలం చేసుకుని చూస్తూ మురిసిపోయిందట. ఈ కారణంగానే అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తూ వుంటారు.

శుక్రవారం, జులై 04, 2014

ఇక్కడ శివుడు తలక్రిందులుగా దర్శనమిస్తాడు...!!! యనమదుర్రు శివాలయం

సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోను శివుడు లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటిది ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే... అందునా తలక్రిందులుగా దర్శనమిస్తే... ఆశ్చర్యపోని భక్తులంటూ ఉండరు. ఇక అమ్మవారి విషయానికే వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో... అదీ ఒకే పీఠంపై... అమ్మవారు కొలువై ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

ఇక ఇక్కడ అమ్మవారు బాలింతరాలుగా ఒడిలో పసివాడైన కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తూ ఉండటం మరో పత్యేకత. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా 'యనమదుర్రు' కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడుని గురించి తపస్సు చేసిన కారణంగా, ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది.

లోక కంటకుడైన 'శంభరుడు' ని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంభరుడు మహా శివభక్తుడు కావడంతో, ఆయనని అంతమొందించదానికి పరమశివుడి అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలోని కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.

అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికి వస్తుంది. లోక కల్యాణం కోసం తాను తపస్సు చేస్తోన్న ప్రదేశంలో ఉన్నపళంగా ఆవిర్భవించవలసిందిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడు నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించడంతో, వాళ్లు కైలాసంలో ఎలా ఉన్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. అశేష భక్త జనకోటికి ఆదిదంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ ఉంటారు. 

యనమదుర్రు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టాణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్లుండి వార్తల్లోకి ఎక్కింది.ఇక్కడ త్రేతయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాలక్రిందట తవ్వకాలలో బయటపడింది. ఈ త్రవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు, మూడు నెలల పసికండు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతిమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయి.



సోమవారం, ఏప్రిల్ 07, 2014

మహాశివరాత్రి ప్రత్యేకత - Maha Shiva Ratri Pratyekata

శివరాత్రినాడు చేయవలసిన విధులు:

1. ఉపవాసం: 
భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.

2. జాగరణం: 
బాహ్యంగా పరమశివుడు మహావిషాన్ని సేవించిన రోజు శివరాత్రి. విషం మ్రింగి నిదురపోతే శరీరమంతా త్వరగా వ్యాపించి, సమస్త భువన మండలాలకు వ్యాపించి, ప్రళయం సంభవిస్తుంది. అందువలన భక్తులందరు శివస్తుతులతో ఆ పరమశివుణ్ణి మేలుకొనేటట్లుగా చేసిన, సమస్త లోకాలకు మేలు చేకూరుతుంది. అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనో-బుద్ధి-అహంకార-చిత్తములనే అంతఃకరణల్ని శివభావాత్మకాలుగా జాగృతం చేసి, జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో ఐక్యం చెయ్యాలి. అంటే, కామ-క్రోధాది అరిషడ్వర్గ బంధనాలనుంచి 'జీవాహంత'ను విడిపించి, 'విశ్వ అహంత' అయిన శివతత్వంలోనికి ఐక్యం చెయ్యటమే జాగరణ.

3. అభిషేకం: 
పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో సంభవించిందని పురాణాలు చెబుతున్నవి. అందుచేతనే అర్ధరాత్రి సమయంలో అభిషేకవిధిని నిర్వహిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. 

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. 

యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాలు కలిగిన నమకం + చమకం ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకానికి 'రుద్రం' అని పేరు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. 

ఈ 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. 

రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 

11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 11 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. 

ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. 

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' 
హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. 

ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

భగవ౦తునికి పుట్టినరోజు అనేది ఉ౦డదు. ఎ౦దుక౦టే పుట్టుకే లేదు కనుక. శివునికి స్వయ౦భూ, ఆత్మభూ అని రె౦డు పేర్లు ఉన్నాయి. తన౦త తాను కలిగినవాడు, ఉన్నవాడు అని. భగవ౦తుడు ఎప్పుడూ ఉన్నవాడే. కాకపోతే జగతిని అనుగ్రహి౦చడ౦ కోస౦ తనను తాను వ్యక్త౦ చేసుకు౦టాడు. అవ్యక్తం వ్యక్తమవుతుంది. వ్యక్తమవడాన్ని కలగడం అంటారు. అ౦దుకే శివునికి భవుడు(కలిగిన వాడు) అని ఒక పేరు ఉ౦ది. 

చతుర్దశి తిధికి పరమేశ్వరుడు అధిదేవతగా చెప్పబడుతున్నాడు. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్దశి మాసశివరాత్రి అని చెప్పబడుతో౦ది. మాఘ బహుళ చతుర్దశికి మహాశివరాత్రి అని పేరు.

మహాశివరాత్రి ప్రత్యేకత:
సృష్టి ఆర౦భమున౦దు పరమాత్మ తనని తాను ఒక దివ్యమైన అగ్నిస్త౦భాకృతిగా ప్రకటి౦చుకున్నాడు. అలా వ్యక్తమైన రోజు మహాశివరాత్రిగా చెప్పబడుతో౦ది. 

దీనికి పురాణ కథ ఏమిట౦టే బ్రహ్మ విష్ణువుల నడుమ పరమేశ్వరుడు ఒక మహాలి౦గ౦గా ఆవిర్భవి౦చి తనయొక్క ఆదిమధ్యా౦త రహిత తత్త్వాన్ని ప్రకటి౦చాడు. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయ౦లో పరమేశ్వరుడు లి౦గ౦గా ఆవిర్భవి౦చాడు అని కొన్ని పురాణాలలో కనపడుతు౦ది. శివపురాణ౦లో ఒక ప్రత్యేకమైన అ౦శ౦ ఏమిట౦టే మార్గశీర్ష మాస౦ ఆర్ద్రా నక్షత్ర౦ నాడు పరమేశ్వరుడు లి౦గ౦గా ఆవిర్భవి౦చాడు. 

దాని తుది మొదలు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించారు. అ౦దులో బ్రహ్మ హంస రూప౦తో పైకి వెళ్తే, విష్ణువు వరాహ రూప౦తో క్రి౦దికి వెళ్ళాడు. ఉభయులూ తుదిమొదలు తెలుసుకోలేక పోయారు. అటు తర్వాత పరమేశ్వరుని శరణు వేడగా పరమేశ్వరుడు వారికి వ్యక్తమై తన తత్త్వాన్ని తెలియజేశాడు. అప్పుడు వారిరువురూ శివారాధన చేశారు. వారు శివుని ఆరాధి౦చిన రోజు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయ౦. అప్పటిను౦చి శివలి౦గారాధన వ్యాప్తి చె౦ది౦ది. 

బ్రహ్మ విష్ణువులను౦చి దేవతలు, దేవతల ను౦చి ఋషులు, వారిద్వారా సమస్త ప్రప౦చమూ తెలుసుకున్నది. ఈ మొత్త౦ చెప్తూ మనకు ప్రసిద్ధమైన లి౦గాష్టక శ్లోకమున్నది-"బ్రహ్మమురారి సురార్చితలి౦గ౦ నిర్మల భాసిత శోభిత లి౦గ౦" అని. ఈ విధ౦గా పరమేశ్వరుడు తనని తాను వ్యక్త౦ చేసుకొని, తన ఆరాధనని బ్రహ్మ విష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు ఏదైతే ఉ౦దో అది ఈ మాఘ బహుళ చతుర్దశి. స౦వత్సర కాల౦ ఆరాధన చేసిన ఫలిత౦ ఈ ఒక్కరోజు చేసిన ఆరాధన వల్ల కలుగుతుంది అని మనకు శాస్త్ర౦ చెబుతో౦ది.

లి౦గోద్భవ కాల౦లో (అర్ధరాత్రి పన్నె౦డు గ౦టలకి) అర్చన చేయడ౦ విశేష౦. సాధారణ౦గా అ౦దరికీ మూడు స౦ధ్యలు తెలుసు. ప్రాతః స౦ధ్య, మధ్యాహ్న స౦ధ్య, సాయ౦ స౦ధ్య. ఇది కాకు౦డా నాలుగో స౦ధ్య తురీయ స౦ధ్య అని ఉ౦ది. ఇది అర్ధరాత్రి పన్నె౦డు గ౦టలకు వస్తుంది. దీన్ని అ౦తర్ముఖ స్ఠితి అ౦టారు. అ౦టే బాహ్య ప్రప౦చపు వాసనలను వదిలిపెట్టి అ౦తర్ముఖులై మనస్సుని పరమాత్మయ౦దు లయ౦ చేయడ౦. ఈ ధ్యాన స్థితి ఏ రాత్రి ఉ౦దో అదే యోగపరమైన రాత్రి. ఆరాత్రిని మన౦ ఈనాడు దర్శి౦చాలి. అ౦దుకే మహాశివరాత్రికి అ౦త ప్రాధాన్య౦ ఇచ్చారు.

"ప్రదోషో రజనీ ముఖ౦" - రజని అ౦టే రాత్రి. రజనీ ముఖ౦ అ౦టే రాత్రికి ప్రార౦భసమయ౦ అని. స౦ధ్యాసమయ౦ పూర్తి అవుతూ రాత్రి వస్తూన్న సమయ౦ ఏదైతే ఉ౦దో దానిని ప్రదోష౦ అ౦టారు. దోష౦ అ౦టే రాత్రి, ప్ర అ౦టే ప్రార౦భదశ. రాత్రికి ప్రార౦భము. 

ప్రభాతము అనగా ఉదయ కాలము. ప్రదోషము అనగా సాయ౦కాల౦. ఈ ప్రదోషకాల౦లో పరమేశ్వరుని ఆరాధి౦చాలి అని శాస్త్ర౦ మనకి చెప్తో౦ది. ఆ సమయ౦లో ఈశ్వరారాధన విశేష౦. రాత్రి అనేది అ౦తర్ముఖత్వానికి, పగలు బహిర్ముఖత్వానికి స౦కేత౦. కర్మకు స౦బ౦ధి౦చినది పగలును తెలియచేస్తు౦ది. జ్ఞానానికి స౦బ౦ధి౦చినది రాత్రికి తెలియచేస్తు౦ది. 

యా నిశా సర్వభూతానామ్ తస్యా౦ జాగర్తి స౦యమీ | 
యస్యా౦ జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||  

మన౦దర౦ దేన్లో నిద్ర పోతామో యోగి దానిలో మేల్కొ౦టాడు. దీని అ౦తరార్ధ౦ ఏమిట౦టే మన౦ భగవద్విషయ౦లో నిద్రపోతాము. ప్రప౦చ౦ విషయ౦లో మేల్కొ౦టా౦. యోగి ప్రప౦చ౦ విషయ౦లో నిద్రపోతాడు. భగవద్విషయ౦లో మేల్కొ౦టాడు. ఈస్థితికి ప్రదోష౦ అని పేరు. 

ఈ సమయ౦లో శివుని తప్ప ఇ౦కో దేవతను ఆరాధి౦చరాదు అని కూడా శాస్త్ర౦ చెబుతో౦ది. ఎ౦దుక౦టే ఆ సమయ౦లో వార౦దరూ శివతా౦డవ౦ చూస్తూ ఆన౦దమయులై ఆయనలో లీనమవుతారట. ఆ సమయ౦లో శివుని ఆరాధిస్తే సర్వ దేవతలను ఆరాధి౦చిన ఫలిత౦ లభిస్తు౦ది. జాతక౦లో ఎటువ౦టి దోషాలున్నా కూడా ప్రదోషవ్రత౦ చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు. 

ఏడురోజులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహదేవతను చెప్తున్నారు. ఒక్కో జాతక౦లో ఏగ్రహ౦ బాగోలేదో ఆగ్రహానికి స౦బ౦ధి౦చిన రోజున ప్రదోష వ్రత౦ చేసినట్లైతే ఆగ్రహ దోష౦ పోతు౦ది. ఉదాహరణకు శని గ్రహ౦ బాగోలేకపోతే శనివార౦ ఉపవసి౦చి స౦ధ్యాసమయ౦లో శివార్చన చేస్తే శనిదోష౦ పోతు౦ది. 

ప్రతిరోజూ ఒక ప్రదోష౦ వస్తు౦ది. దీనిని నిత్య ప్రదోష౦ అనీ, 
పూర్ణిమ ము౦దు త్రయోదశి నాటి సాయ౦త్రాన్ని పక్ష ప్రదోష౦ అనీ,
అమావాస్య ము౦దు త్రయోదశి నాటి సాయ౦త్రాన్ని మాసప్రదోష౦ అనీ,
మహా శివరాత్రిని మహాప్రదోష౦ అనీ అ౦టారు.

Courtesy: Shri Chaganti Koteswara Rao Garu

మంగళవారం, మార్చి 25, 2014

కలిదోష నివారణ మంత్రం - Kali Dosha Nivarana Mantram

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ॥

భావం:
కర్కోటకుడు అనే పామును, దమయంతిని, నలుడిని మరియు రాజర్షి అయిన ఋతుపర్ణుడిని స్మరిస్తే కలి దోషాలు (కష్టాలు, పాపాలు) నశిస్తాయి.

దమయంతీ నలాభ్యాం చ నమస్కారం కరోమ్యహమ్ ।
అవివాదో భవేదత్ర కలిదోషః ప్రశామ్యతు ॥

భావం:
నల-దమయంతులకు నేను నమస్కరిస్తున్నాను. దీనివల్ల మా మధ్య వివాదాలు తొలగి, కలి వల్ల కలిగే దోషాలు శాంతించుగాక.

ఐకమత్యం భవేత్తేషాం బ్రాహ్మణానాం పృథగ్ధియామ్ ।
నిర్వైరతా చ జాయేత సంవాదోఽయం ప్రసీదతు ॥

భావం:
భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారి మధ్య ఐకమత్యం కలగాలి. వారి మధ్య వైరం నశించి, చేసే సంవాదం (చర్చ) ప్రశాంతంగా ముగియాలి.

ఎప్పుడు పఠించాలి?
  • ఇంట్లో అనవసరమైన వాదనలు జరుగుతున్నప్పుడు.
  • ముఖ్యమైన చర్చలకు వెళ్లేముందు.
  • కలి ప్రభావం వల్ల మనస్సు చికాకుగా ఉన్నప్పుడు.
ఈ శ్లోకాలు చదివేటప్పుడు నల-దమయంతుల కథను ఒక్కసారి తలచుకుంటే ఇంకా మంచిది.

|| శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ||