ఆదివారం, అక్టోబర్ 18, 2015

దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్య సహితం

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 
తాత్పర్యము: ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్
తాత్పర్యము: ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి
తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. 

కాలభైరవాష్టకం - తాత్పర్య సహితం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు,  బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,  అంతటాయున్న వాడు, రెండవసాటి లేని వాడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, తన దంతముల ద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, గరిమ మొదలగునవి),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము: భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.
           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్
తాత్పర్యము: అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును. 


ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

కాలభైరవుడు:
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే. తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే 'భైరవుడు' ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.

మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో, అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.

భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు.

భైరవుని రూపాలు ఎనిమిది.
1) కాలభైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. వారణాసి లో కాలభైరవాలయాన్ని దర్శిస్తే తప్ప కాశి యాత్ర పూర్తికాదు. 

 ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు 
''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌'' 
అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.


 
కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.

కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేప్పుడు కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.

కాల భైరవాష్టమి:
ఇది పరమ పవిత్రమైన రోజు. ఆరోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు. భక్తిగా కొలుస్తారు. దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||

శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని, చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది. రాహువుకు అధిపతి. రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే వాటినుండి వెంటనే విముక్తులౌతారు.

మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.

ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు. ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం? అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు. ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.

భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=19XbKPB2F0o

దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము - తాత్పర్య సహితం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట్టే వాడు, ఉగ్రుడు, సంసారమనే సాగరాన్ని దాటించే వాడు,  జ్యోతిర్మయుడు, గుణ నామ కీర్తనకు నృత్యం చేసే వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: పులిచర్మమును ధరించే వాడు, శ్మశానములో కాలే శవముల భస్మమును శరీరమునకు పూసుకొనిన వాడు, నుదుట కన్ను కలవాడు, రత్నములు పొదిగిన కుండలములు చెవులకు ధరించిన వాడు, మంచి ధ్వని కలిగించే ఆభరణములు కాళ్ళకు ధరించిన వాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: పంచముఖములు కలిగిన, ఫణి రాజు ఆభరణముగా కలిగిన వాడు, బంగారు వస్త్రములు ధరించిన వాడు, త్రిలోక వంద్యుడు, వర ప్రదాత, ఆనంద సాగరుడు, అంధకారము నిండినవాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: సూర్యునికి ప్రియమైన వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యముని సంహరించేవాడు, బ్రహ్మచే పూజించబడిన వాడు, మూడు కన్నులు కలిగిన వాడు, అన్ని శుభలక్షణములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: రామునికి ప్రియమైన వాడు, రామునికి వరములు ప్రసాదించిన వాడు, నాగ జాతికి ప్రియమైన వాడు, నరకమనే సాగరాన్ని దాటించేవాడు, పుణ్యాల్లో పుణ్యము కలిగిన వాడు, దేవతలచే కొలువబడిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
తాత్పర్యము: ముక్తిని ప్రసాదించు వాడు, వృషభ వాహనాన్ని కలిగిన వాడు, ఏనుగు చర్మాన్ని ధరించిన వాడు, మహేశ్వరుడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు

          వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం
          సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం
          త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్
తాత్పర్యము: వశిష్ఠ మహాముని రచించిన ఈ స్తోత్రము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠించిన వారికి అన్ని సంపదలు కలిగి చివరకు స్వర్గ ప్రాప్తి కలుగును. 

మహాశివరాత్రి రోజున దారిద్ర్య దహన శివస్తోత్రం పఠిస్తే..? అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. దారిద్ర్యం, ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగి సంపదలు లభిస్తాయని పండితుల  ఉవాచ. 

మహాన్యాసము

నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

"ఓం నమో భగవతే రుద్రాయ" అని పలికి నమస్కరించి, "ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః" అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము "ఓం  అం విభూరసి  ప్రవాహణో...." అనే మంత్రముతో మొదలు పెట్టి "ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర "రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః" అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.


తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.


 తత్పురుష ముఖ ధ్యానమ్


సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోరుణం
గంభీర ధ్వని సామవేద జనకం - తామ్రాధరం సుందరం
అర్ధేందుద్యుతిలోలపింగళజటా  - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

అఘోర ముఖ ధ్యానమ్


కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణతాశేఖరం
వందే దక్షిణమీశ్వరస్య వదనం - చాతర్వనాదోదయం

తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్


ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యంగమనంగ దేహదహన - జ్వాలావళీలోచనం
విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత  పదం - ఋగ్వేద నాదోదయం 
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం
భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే యాజుష వేద ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము: గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం - శస్త్రింశతత్వాధికం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
ఓంకారాది సమస్త మంత్ర జనకం  - సూక్ష్మాతి సూక్ష్మంపరం
వందే పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

గురువారం, అక్టోబర్ 15, 2015

శ్రీరామ కల్యాణోత్సవం

శ్రీరాముడు పుట్టిన రోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. అసలు శ్రీరామ నామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామ నామం త్రిమూర్తులకు ప్రతీక. 

అందుకే పార్వతీ వల్లభుడు కూడా 
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు.

విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామ నామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది.

మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

అ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. 
అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు
రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. 

అందులో ఓ ఉదంతం:
రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నిండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక ధార్మిక విషయం పై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖచ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని ఆదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.
మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠిన పరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చాపూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు.

కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.
'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయ జయ రామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.

సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది.

రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి.

భజగోవిందం - తాత్పర్య సహితం

ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||

1) భజగోవిందం భజగోవిందం 
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||
తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

2) మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||
తాత్పర్యం: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

3) నారీస్తనభర నాభీదేశం 
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||
తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

4) నలినీదళగత జలమతి తరళం 
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||
తాత్పర్యం: తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము

5) యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ||
తాత్పర్యం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు. 

6) యావత్పవనో నివసతి దేహే 
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||
తాత్పర్యం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

7) బాలస్తావత్క్రీడాసక్తః 
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||
తాత్పర్యం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

8) కా తే కాంతా కస్తే పుత్రః 
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
తాత్పర్యం: ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.

9) సత్సంగత్వే నిః సఙ్గత్వం 
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
తాత్పర్యం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.

10) వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
తాత్పర్యం: వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?

11) మా కురు ధన జన యౌవన గర్వం 
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||
తాత్పర్యం: ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

12) దినయామిన్యౌ సాయం ప్రాతః 
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||
తాత్పర్యం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

13) కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా ||
తాత్పర్యం: ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

14) జటిలో ముండీ లుంఛితకేశః 
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః ||
తాత్పర్యం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.


15) అంగం గలితం పలితం ముండం 
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||
తాత్పర్యం: శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు. 

16) అగ్రే వహ్నిః పృష్ఠే భానూ 
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||
తాత్పర్యం: తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు. 

17) కురుతే గంగాసాగరగమనం 
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||
తాత్పర్యం: గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.

18) సుర మందిర తరు మూల నివాసః 
శయ్యా భూతల మజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||
తాత్పర్యం: దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు? 

19) యోగరతో వా భోగరతోవా 
సఙ్గరతో వా సఙ్గవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||
తాత్పర్యం: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.

20) భగవద్గీతా కించిదధీతా 
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన  చర్చా ||
తాత్పర్యం: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.


21) పునరపి జననం పునరపి మరణం 
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ||
తాత్పర్యం: మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము. 

22) రథ్యా చర్పట విరచిత కంథః 
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||
తాత్పర్యం: వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.

23) కస్త్వం కోఅహం కుత ఆయాతః 
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||
తాత్పర్యం: సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.

24) త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః 
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్ ||
తాత్పర్యం: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము. 

25) శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్ ||
తాత్పర్యం: శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు? 

26) కామం క్రోధం లోభం మోహం 
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ||
తాత్పర్యం: కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు.

27) గేయం గీతా నామ సహస్రం 
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||
తాత్పర్యం: భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను. 

28) సుఖతః క్రియతే రామాభోగః 
పశ్చాద్దంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||
తాత్పర్యం: ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు. 

29) అర్థమనర్థం భావయ నిత్యం 
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ||
తాత్పర్యం: ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది. 

30) ప్రాణాయామం ప్రత్యాహారం 
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం ||
తాత్పర్యం: సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

31) గురుచరణాంబుజ నిర్భర భక్తః 
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం 
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||
తాత్పర్యం: అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.


ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||

** భజగోవిందం భజగోవిందం | గోవిందం భజమూఢమతే || **