మంగళవారం, జనవరి 12, 2016

రుక్మిణీ కల్యాణం

సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.

 ప్రార్ధన:
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్
భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని భార్య యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం. ఈ పద్యంలో బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు.

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
భావము:
అనంత లీలాతాండవలోలుడైన పరమ శివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మనస్సులనే సరోవరాలలో విరిసిన పద్మాలపై తుమ్మెదలా విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పూర్వకంగా ప్రణామం చేస్తున్నాను.

ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఝేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
భావము:
చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను ఛేధించే వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నాను.

ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
భావము:
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలు పోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్ళు కడపునిండా ఆరగించి మూషికరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
భావము:
అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ!

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భావము:
దుర్గాదేవి తల్లులందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచినయమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

బమ్మెర పోతన గారిచే రచించబడిన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము నుండి... 

రుక్మిణీకల్యాణ కథారంభము:

సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులకు నైమిశారణ్యంలో భాగవతమును చెప్తున్నాడు... 

శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా పలికాడు... 

ఆ వనజగర్భు పంపున
రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్
రేవతి యనియెడు కన్యను
భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్.
భావము:
“పరీక్షిన్మహారాజా! పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకొచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం?!!''

రేవతీ బలరాముల వివాహం:

(ఈ వృత్తాంతం నవమ స్కందము లోనిది)

ఆనర్తునకు రైవతాహ్వయుం డుదయించె; 
నతఁడు కుశస్థలి యను పురంబు
నీరధిలోపల నిర్మించెఁ; బెంపుతో; 
నానర్తముఖ విషయంబులేలె; 
గనియెఁ గకుద్మి ముఖ్యంబైన నందన; 
శతము; రైవతుఁడు విశాలయశుడు
దన కూఁతు రేవతి ధాత ముందటఁ బెట్టి; 
తగు వరు నడిగెడి తలఁపుతోడఁ
గన్యఁ దోడ్కొని బ్రహ్మలోకమున కేగి
యచట గంధర్వ కిన్నరు లజుని మ్రోల
నాటపాటలు సలుపఁగ నవసరంబు
గాక నిలుచుండె నతఁ డొక్క క్షణము తడవు.
భావము:
ఆనర్తుడు అనే రాజుకు రైవతుడు జన్మించాడు. అతడు సముద్రం లోపల కుశస్థలి యను పట్టణాన్ని నిర్మించాడు. రైవతుడికి కాకుద్మి మొదలైన నూరు మంది కొడుకులు మరియు రేవతి అను కూతురు జన్మించారు. రేవతికి తగిన వరుడిని తెలుసుకొనగోరి రేవతితో పాటు రైవతుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. అచట బ్రహ్మ గంధర్వ కిన్నెర ఆట పాటల సందడిలో ఉండగా కాసేపు వేచిఉన్నాడు. 

అంత నవసరంబయిన నజునికి నమస్కరించి రైవతుండు రేవతిం జూపి యిట్లనియె.
భావము:
అంతట అవకాశము చిక్కినంతనే రైవతుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, రేవతిని చూపి ఇట్లు అన్నాడు. 

చాల ముద్దరాలు జవరాలుఁ గొమరాలు
నీ శుభాత్మురాలి కెవ్వఁ డొక్కొ
మగఁడు? చెప్పు మనిన యది చూచి పకపక
నవ్వి భూమిపతికి నలువ పలికె.
భావము:
ఈ ముగ్ద యౌవ్వనవతి, సౌందర్యవతి, శుభాత్మురాలికి యోగ్యుడైన భర్తను తెలుపమని కోరగా, బ్రహ్మదేవుడు నవ్వి రైవతునితో ఇలా పలికాడు. 

 మనుజేశ! దీనికై మదిలోనఁ దలఁచిన; 
వార లెల్లను గాలవశతఁ జనిరి; 
వారల బిడ్డల వారల మనుమల; 
వారల గోత్రంబు వారినైన
వినము మేదిని మీఁద; వినుము నీ వచ్చిన; 
యీలోన నిరువదియేడు మాఱు
లొండొండ నాలుగు యుగములుఁ జనియె; నీ; 
వటు గాన ధరణికి నరుగు మిపుడు
దేవదేవుండు హరి బలదేవుఁ డనఁగ
భూమి భారంబు మాన్పంగఁ బుట్టినాఁడు; 
సకలభూతాత్మకుఁడు నిజాంశంబుతోడ
యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ!
భావము:
ఓ రైవతా! ఈమెకు తగిన వరుడు అని నువ్వు భావించినవారు అందరూ కాలవశమున చనిపొయారు. కనీసం వారి బిడ్డలు, వారి మనుమలు, వారి గోత్రము కలిగిన వారు కూడా ఈ భూమి మీద నీకు కనిపించరు. నీవు యిచటికి వచ్చి వేచి ఉన్న సమయంలో భూమిపైన 27 సార్లు నాలుగు యుగాలూ గడిచిపోయాయి. నీవు ఇప్పుడు భూమికి తిరిగి వెళ్ళు. దేవదేవుడైన హరి బలరాముడుగా భూమి భారము తగ్గించుటకు పుట్టినాడు. ఆ సకల భూతాత్ముడికి ఈ కన్యామణిని ఇచ్చి వివాహం జరిపించు. 

అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోమునకుఁ జనుదెంచి సోదర స్వజన హీనంబగు తన నగరంబున కా రాజు వచ్చి బలభద్రుం గాంచి రేవతీకన్య నతని కిచ్చి నారాయణాశ్రమంబగు బదరికావనంబునకు నియమంబునఁ దపంబు జేయం జనియె.
భావము:
అని చెప్పిన బ్రహ్మకు నమస్కరించి, భూలోకానికి వచ్చి సోదరులు, స్వజనము లేని తన రాజ్యానికి వచ్చి, బలభద్రుడిని వెతికి, రేవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత రైవతుడు నారాయణాశ్రమం అయిన బరికావనమునకు నిష్ఠగా తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు. 

అలా రేవతీ బలరాముల వివాహం జరిగిన తరువాత... 

ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
భావము:
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజులందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.

అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; అదియునుం గాక.
భావము:
అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. .

కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై
కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
కల్యం బేర్పఢ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.
భావము:
శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా అవి. రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.

భూషణములు చెవులకు బుధ
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్.
భావము:
గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.

అని రా జడిగిన శుకుం డిట్లనియె.
భావము:
ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.

రుక్మిణీ జననం:


వినుము; విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
భావము:
విను... విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.

బాలేందురేఖ దోఁచిన
లాలిత యగు నపరదిక్కులాగున ధరణీ
పాలుని గేహము మెఱసెను
బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.
భావము:
ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. 

మఱియును దినదినప్రవర్ధమాన యై.
భావము:
అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు; 
నబలలతోడ వియ్యంబు లందు; 
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి; 
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి; 
రమణీయ మందిరారామ దేశంబులఁ; 
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; 
సదమల మణిమయ సౌధభాగంబుల; 
లీలతో భర్మడోలికల నూఁగు
భావము:
బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆట్లాడుతోంది. గుజ్జన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది

బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు
శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు
బర్హి సంఘములకు మురిపములు గఱపు
మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
భావము:
చెలులతో బంతులాటలాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది. 

అంత.
భావము:
అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు... 

దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ; 
వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ; 
గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ; 
గాంతి నింతికి ముఖకమల మొప్పె; 
మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ; 
బొలఁతికి జనుదోయి పొడవు జూపె; 
శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ; 
జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె;
భావము:
కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది.

హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ గేశ
బంధ మధిక మగుచు బాలకమరెఁ; 
బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండి యుండె.
భావము:
కృష్ణుడికి ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిసలాడుతోంది.

ఇట్లు రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున.
భావము:
ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.

తన తండ్రి గేహమునకుం
జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ
ష్ణుని రూప బల గుణాదులు
విని కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁడని తలఁచెన్.
భావము:
తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.

ఆ లలన రూపు బుద్ధియు
శీలము లక్షణము గుణముఁ జింతించి తగన్
బాలారత్నముఁ దన కి
ల్లాలుగఁ జేకొందు ననుచు హరియుం దలఁచెన్.
భావము:
ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ది, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందామనుకొన్నాడు.

అంత.
భావము:
అలా రుక్మిణి యౌవనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో... 

బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి మత్త పు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁడై.
భావము:
రుక్మిణిని బంధువులంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడికిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.


రుక్మిణి సందేశము పంపుట:


అన్న తలంపు తా నెఱిఁగి య న్నవనీరజగంధి లోన నా
పన్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం
ఛన్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ
డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే.
భావము:
పరీక్షిన్మహారాజా! తన అన్న ఆలోచన తెలిసిన రుక్మిణి, తన మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తానంటున్నాడు. ఏ విధంగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియజెప్పుము.

అయ్యా! కొడుకు విచారము
లయ్యయు వారింపఁ జాలఁ డటు గాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము
చయ్యన నిజసేవకానుసారిన్ శౌరిన్.
భావము:
ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలువు. 

అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్న నగరు ప్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవు గ” మ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి, సరసపదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె.
భావము:
ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.

జగతీసురేశ్వర! సంతోషచిత్తుండ; 
వై యున్న నీ ధర్మ మతిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ; 
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
తన ధర్మమున నుండుఁ దరలఁ డా ధర్మంబు; 
గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁ డేని శక్రుఁడైన నశించు; 
నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు
సంతసించెనేని, సర్వభూతసుహృత్త
ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.
భావము:
ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ యెంతో సుఖంగా ఉంటాడు. సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నేను నమస్కరిస్తాను.

ఎవ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ
కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం
డివ్వనరాశి దుర్గమున కెట్లరుదెంచితి రయ్య! మీరు? లే
నవ్వులుగావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!
భావము:
"బుద్దిశాలీ! మీరే దేశంలో ఉంటారు? ఎవని రాజ్యంలోనైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సులువైనపని కాదు. మీరెలా వచ్చేరు? మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొచ్చిన విప్రుని పలకరించాడు.

అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె “దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి; గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము.
భావము:
ఇలా ఆ లీలామానవదేహధారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అడుగగా, రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక; 
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; 
కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన; 
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; 
దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు, 
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! 
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
భావము:
శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.

ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
భావము:
ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించేవాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా? అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి?

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్
భావము:
ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహంనికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి యైన శశిపాలుడు నీ పదభక్తురాలనైన నన్ను(రుక్మిణి) తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.

వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
భావము:
రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోక కల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శిశుపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో! 
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
భావము:
ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు, జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.

లోపలి సౌధంబులోన వర్తింపంగఁ; 
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి; 
కాని తేరా" దని కమలనయన! 
భావించెదేని యుపాయంబు చెప్పెద; 
నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ; 
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
భావము:
ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పుడక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!

ఘను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబ, ప్రాణేశ్వరా!
భావము:
జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరునివలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడవైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా! 
(రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా! ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ)

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; 
కర్ణరంధ్రంబుల కలిమి యేల? 
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; 
తనులతవలని సౌందర్య మేల? 
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; 
చక్షురింద్రియముల సత్వ మేల? 
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; 
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల? 
ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు
భావము:
శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు దండగ; నాకు వద్దయ్యా!

అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె.
భావము:
ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, తగ్గిన స్వరంతో సౌమ్యంగా ఇంకా ఇలా చెప్పాడు... 

పల్లవ వైభవాస్పదములు పదములు; 
కనకరంభాతిరస్కారు లూరు; 
లరుణప్రభామనోహరములు గరములు; 
కంబు సౌందర్య మంగళము గళము; 
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు; 
చక్షురుత్సవదాయి చన్నుదోయి; 
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు; 
జితమత్త మధుకరశ్రేణి వేణి;
భావజాశుగముల ప్రాపులు చూపులు; 
కుసుమశరుని వింటికొమలు బొమలు; 
చిత్తతోషణములు చెలువ భాషణములు; 
జలజనయన ముఖము చంద్రసఖము.
భావము:
“ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎర్రటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.

ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యములేల? నీవు నీ
తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్.
భావము:
ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ వాళ్ళతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.

వాసుదేవాగమన నిర్ణయము:


అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె
భావము:
ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

కన్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.
భావము:
“సచ్చీలుడా! రుక్మిణీకన్య మీద నాకు గాఢమైన మనసుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. మా పెళ్ళికి ఇష్టపడక రుక్మి పెట్టే అడ్డంకులు నాకు ముందే తెలుసు. కట్టెలను అగ్ని దహించినట్లు, శత్రువులను మర్ధించి కన్యను తీసుకొస్తాను.

వచ్చెద విదర్భభూమికిఁ; 
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి 
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
భావము:
విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకొస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్దంచేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు.

అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథసారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు జేసి యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలంచి, శోభనోద్యోగంబులు చేయించె; నప్పుడు.
భావము:
ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసుకొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథియైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథమెక్కేడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశుడు  అయిన భీష్మకుడు కూతుర్ని శిశుపాలునికి ఇద్దామనుకుంటూ పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు.

రచ్చలు గ్రంతలు రాజమార్గంబులు; 
విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు; 
గలయంగఁ జల్లిరి; కలువడములు
రమణీయ వివిధతోరణములుఁ గట్టిరి; 
సకల గృహంబులు చక్కఁ జేసి; 
కర్పూర కుంకు మాగరుధూపములు పెట్టి; 
రతివలుఁ బురుషులు నన్ని యెడల
వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల నమరి యుండి
రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.
భావము:
ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్రపరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.

అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి రత్నభూషణంబు లిడంజేసి, ఋగ్యజుస్సామధర్వణ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున.
భావము:
భీష్మకుడు పద్దతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. పుణ్యాహవచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణాలతో అలంకరించాడు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. నవ దంపతుల శుభం కోసం భీష్మకుడు విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది ధానాలు చేసాడు. అప్పుడు... 

భటసంఘంబులతో రథావళులతో భద్రేభయూధంబుతోఁ
బటువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ
గటుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం
కటవృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్.
భావము:
విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులతో, రథాల వరుసలతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.

బంధులఁ గూడి కృష్ణబలభద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంథర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద" మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.
భావము:
జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువులందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశుపాలుడికి బాలికను తెచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్టబెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.

మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని.
భావము:
ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి... 

హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై
నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం
గరమగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి" నంచు వేగఁ దా
నరిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.
భావము:
బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్దం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం” అంటూ బలరాముడు కృష్ణుని వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.

ఆలోపల నేకతమున
నాలోలవిశాలనయన యగు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ డని శంకితయై.
భావము:
ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .

లగ్నం బెల్లి; వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో? 
భగ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిన్ బ్రవర్తించునో?
భావము:
“నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహుర్తం దగ్గర కొచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? (అంటూ రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో? 
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
భావము:
ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది.

అని వితర్కించుచు.
భావము:
రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది... 

పోఁ"డను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
రాఁ" డను; "నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్
లేఁ" డను; "రుక్మికిం దగవు లేదిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" డను; "గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.
భావము:
“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్నయ్య రుక్మికి ఇంక అడ్డే లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మధనపడుతోంది.

చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికల్
గప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.
భావము:
రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసులోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు.

తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము చేయదు; డాయ దన్యులన్.
భావము:
తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోవటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చట్లు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోవటం లేదు. రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకోమని సందేశం పంపించింది.
(అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం)

మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ; 
జలకము లాడదు జలజగంధి; 
ముకురంబు చూడదు ముకురసన్నిభముఖి; 
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి; 
వనకేళిఁ గోరదు వనజాతలోచన; 
హంసంబుఁ బెంపదు హంసగమన; 
లతలఁ బోషింపదు లతికా లలిత దేహ; 
తొడవులు తొడువదు తొడవు తొడవు
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
గమలగృహముఁ జొరదు కమలహస్త
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
భావము:
కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోవడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.

మఱియును.
భావము:
ఇంతేకాకుండా... 

మలఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం
దలఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం
గలఁగున్; వెన్నెలఁవేడిమిం నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.
భావము:
మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.

వాసుదేవాగమనం:


ఇట్లు హరిరాక కెదురుచూచుచు సకల ప్రయోజనంబులందును విరక్త యయి మనోజానలంబునం బొగులు మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరు లోచన భుజంబు లదరె; నంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు చనుదెంచిన నతని ముఖలక్షణం బుపలక్షించి యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై మొగంబునం జిఱునగవు నిగుడ నెదురు జని నిలువంబడిన బ్రాహ్మణుం డిట్లనియె.
భావము:
ఇలా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు. . .

"మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా
వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై
వచ్చిననైన రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించెఁ గన్యకా!"
భావము:
“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగా వచ్చేడు. దేవదానవులడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచితనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.

అనిన వైదర్భి యిట్లనియె.
భావము:
అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది.

"జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్
నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్
గలరే; దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం
జలిఁ గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!"
భావము:
“ఓ సద్భ్రాహ్మణ శ్రేష్ఠుడా! ప్రియబాంధవోత్తముడా! నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్య. నమస్కారం మాత్రం పెడతాను.”

అని నమస్కరించె; నంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్తప్రకారంబునం బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజనసేనా సమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడియించె; నిట్లు కూడిన రాజుల కెల్లను వయోవీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి పూజించె, నంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని వచ్చి చూచి నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబుఁ జేయుచు.
భావము:
ఇలా రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు...

"తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై
మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
భావము:
“ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.”

అని పలికి రా సమయంబున.
భావము:
రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు అలా అనుకున్నారు...!

సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై; 
బలిసి చుట్టును వీరభటులు గొలువ
ముందట నుపహారములు కానుకలు గొంచు; 
వర్గంబులై వారవనిత లేఁగఁ
బుష్ప గంధాంబర భూషణ కలితలై; 
పాడుచు భూసురభార్య లరుగఁ
బణవ మర్దళ శంఖ పటహ కాహళ వేణు; 
భేరీధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ
దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ
సతులు దోడ రాఁగ సవినయముగ
నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క
బాల చికుర పిహిత ఫాల యగుచు.
భావము:
రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టూ కొలుస్తున్నారు; వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; సర్వాలంకార శోభితలైన విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి; చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;

మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుఁ జనుదేర మందగమనంబున, ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలంచుచు నిందుధరసుందరీ మందిరంబు చేరి సలిల ధారా ధౌత చరణ కరారవింద యై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె నంత ముత్తైదువలగు భూసురోత్తముల భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షత లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి ధూపదీపంబు లొసంగి నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి; రప్పుడు.
భావము:
అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళికూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాదేవి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూలమాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు...

"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"
భావము:
“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మా. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మా. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటూ గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.

అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును, తాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలం బూజించిన.
భావము:
రుక్మిణిదేవి గౌరమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.

వార లుత్సహించి వలనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు; 
సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.
భావము:
వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయటకొచ్చింది. 

ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవ నర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడచూపిన మోహినీదేవత కైవడి, దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మథ్యమాన ఘూర్ణిత ఘుమఘుమాయిత మహార్ణవమధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమానయై యిందుధరసుందరీ మందిరంబు వెడలి మానసకాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి మందగమనంబునఁ గనకకలశ యుగళ సంకాశ కర్కశ పయోధరభార పరికంప్యమాన మధ్యయై, రత్నముద్రికాలంకృతంబైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండఁ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప నధర బింబఫలారుణ మరీచిమాలికలు రదనకుంద కుట్మంబుల కనురాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభంబైన పయ్యెదకొంగు దూఁగ; సువర్ణమేఖలాఘటిత మణి కిరణపటలంబు లకాల శక్రచాప జనకంబులై మెఱయఁ జెఱుకువిలుతుం డొరబెఱికి వాఁడి యిడి జళిపించిన ధగద్ధగాయానంబులగు బాణంబుల పగిది, సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు చేయఁ, బాద సంచారంబున హరిరాక కెదురుచూచుచు వీరమోహినియై చనుదెంచుచున్న సమయంబున.
భావము:
ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడినుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె వర్షాకాలంలో మేఘాల్లోంచి బయట కొచ్చి మెరసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకొచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగునుంచి బయటకొచ్చి వేషం ధరించిన మోహినీదేవతలా ఉంది. సముద్రమధన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మంధర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రం లోంచి వెలువడ్డ లక్మీదేవి లాంటి వైభవంతో, మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళపై పరచు కుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదుల్తున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నలు దిక్కులా లేత వెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎర్రబారాయి. మన్మథుని జండాలా పైటకొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణం లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి మన్మధుడి ఒరలోంచి దూసిన కత్తుల మెరపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు... 

అళినీలాలకఁ బూర్ణచంద్రముఖి, నేణాక్షిం, బ్రవాళాధరిం, 
గలకంఠిన్, నవపల్లవాంఘ్రియుగళన్, గంధేభకుంభస్తనిం, 
బులినశ్రోణి నిభేంద్రయాన, నరుణాంభోజాతహస్తన్, మహో
త్ఫల గంధిన్, మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్.
భావము:
తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణ చంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంగ్రొత్త చిగురుల వంటి చేతులు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, ఎర్రకలువ లాంటి అరచేతులు, గొప్ప పద్మాల వంటి సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరు విభ్రాంతి చెందారు.

మఱియు న య్యింతి దరహాస లజ్జావనోకంబులం జిత్తంబు లేమఱి ధైర్యంబులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని, యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు చేయనేరక, రాజులెల్ల నేలకు వ్రాలి; రా యేణీలోచన తన వామకర నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకించుచు.
భావము:
అంతేకాదు. అలా గౌరీపూజ పూజచేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి, ధైర్యాలు వదలారు; గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు; చేష్టలుదక్కి మైమరచారు; ఆయుధాలు జారవిడిచారు; ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కలేక నేలకు వాలారు; ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది; పైట సర్దుకుంటోంది; కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్, 
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
భావము:
రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది; అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు; పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు; విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు;

రుక్మిణీ గ్రహణం:


కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ, యాదవవాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి చనియె; నంత జరాసంధవశు లైన రాజు లందఱు హరిపరాక్రమంబు విని సహింప నోపక.
భావము:
అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారక కెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.

"ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
మన కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
చనుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ శస్త్రాస్తముల్ గాల్పనే? 
తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్."
భావము:
"గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించలేకపోతే మన పరాక్రమాలెందుకు. మన అస్త్రశస్త్రాలెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.

అని యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదువీరుల వెంటనంటఁ దాఁకి, "నిలునిలు"మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిలధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడి; రప్పుడు.
భావము:
అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, శిశుపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు.

అరిబల భట సాయకముల
హరిబలములు గప్పఁబడిన నడరెడు భీతిన్
హరిమధ్య సిగ్గుతోడను
హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణయై.
భావము:
ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని (కృష్ణుని) ముఖంకేసి చూసింది. 

ఇట్లు చూచిన.
భావము:
ఇలా చకితహరిణేక్షణయై ఆమె కృష్ణుని చూడగా, కృష్ణుడు ఇలా చెప్పసాగాడు...

"వచ్చెద రదె యదువీరులు 
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ!"
భావము:
ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదురౌతారు, చచ్చిపోతారు చూస్తుండు” అని ఊరడించసాగాడు.

అని రుక్మిణీదేవిని హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథిరాజచక్రంబు మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ, నారాచ, భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.
భావము:
ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదురయ్యాయి. రథాలు ముక్కలయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగు గుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత భేతాళాల కలకల ద్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు కదలాడాయి. మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.

రాజలోక పలాయనం:


మగిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో
వగచుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చనూర్చుచున్
మొగమునఁ దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచునున్న చైద్యుతోఁ
"బగతుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే."
భావము:
కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళాం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశుపాలుడిని చూచారు. “పోన్లే; శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా” అని ఓదార్చేరు.  

అని మఱియును.
భావము:
కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ... 

"బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ; 
బ్రతుకు గలిగెనేని భార్య గలదు; 
బ్రతికితీవు; భార్యపట్టు దైవమెఱుంగు; 
వగవ వలదు చైద్య! వలదు వలదు."
భావము:
ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శిశుపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణాలుంటే ఎలాగైనా బ్రతకొచ్చు. బ్రతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బ్రతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించొద్దు.

వినుము, దేహధారి స్వతంత్రుండు గాఁడు, జంత్రగానిచేతి జంత్రపుబొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపుఁ; దొల్లి యేను మథురాపురంబుపైఁ బదియేడు మాఱులు పరాక్రమంబున విడిసి, సప్తదశవారంబులు చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలుచేతం బట్టుబడి కృష్ణుండు గరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి; క్రమ్మఱ నిరువదిమూ డక్షౌహిణులం గూడుకొని పదునెనిమిదవ మాఱు దాడిచేసి శత్రువులం దోలి విజయంబు చేకొంటి; నిట్టి జయాపజయంబులందు హర్షశోకంబులం జెంద నే నెన్నండు; నేటి దినంబున నీ కృష్ణు నెదిరి పోర మన రాజలోకం బెల్ల నుగ్రాక్షుం గూడికొని పోరిన నోడుదు; మింతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి లోకంబులు పరిభ్రమించుచుండు; నదియునుం గాక.
భావము:
ఇంకా విను. పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడిచేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కి కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక... 

తమకుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్య విఖ్యాతి వి
క్రములన్ గెల్చిరి యాదవుల్ హరి భుజాగర్వంబునన్ నేడు; కా
లము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్
సమరక్షోణి జయింత; మింతపనికై శంకింప నీ కేటికిన్.
భావము:
ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్దికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసొస్తే మనం కూడ పగవారిని యుద్దం లో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు?

రుక్మి యనువాని భంగం:


అని యిట్లు జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె.
భావము:
ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు, కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించక, యుద్దానికి సిద్దమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు.

"బల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా
చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ
గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస
ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్."
భావము:
“బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”

అని యిట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి రథంబుఁ గూడం దోలించి "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు” మని ధిక్కరించి, బలువింట నారి యెక్కించి మూడు వాఁడి తూపుల హరి నొప్పించి యిట్లనియె.
భావము:
ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో(బాణాలతో) చక్రిని కొట్టాడు.

"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;
నేపాటి గలవాడ? వేది వంశ? 
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ;
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు? 
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు; 
మాయఁ గైకొని కాని మలయ రావు; 
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు; 

వసుధీశుఁడవు గావు వావి లేదు;
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు."
భావము:
నువ్వు మాతో సమానుడవా ఏమిటి (భగవంతుడు కదా మాకన్న అధికుడవు). ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు). వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు). ఎక్కడ పెరిగావు (వికార రహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు). ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు). వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు). అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు). అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్దంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”

అని పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి, యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెండమ్ముల సారథింజంపి, మూడువాఁడి తూపులం గేతనంబుఁ ద్రుంచి మఱియు నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబునఁ బరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం దునుకలు చేసి క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె; నంతటం దనివిజనక వాఁడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైఁ బడు మిడుత చందంబునం గదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు పెఱికి జళిపించి వాని శిరంబు తెగవ్రేయుదు నని గమకించి, నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె.
భావము:
ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే, గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని చంపాడు. మూడు బాణాలతో జండాకర్ర విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.

నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో
సన్నుతామలకీర్తిశోభిత! సర్వలోకశరణ్య! మా
యన్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్
నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ!
భావము:
"ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు" అంటు రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది.

కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదు రీశ్వరా!
భావము:
ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో మునిగిపోతారు నాథా!

అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతోఁ
గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ
క్కిన రుక్మిం దెగ వ్రేయఁబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై.
భావము:
ఇలా రుక్మిణి గద్గదస్వరంతో మిక్కలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిసాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.

ఇట్లు చంపక "బావా! ర" మ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడి యున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె.
భావము:
ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని “బావా! రా” అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు. ఓ కత్తిలాంటి పదునైన బాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.

తల మనక భీష్మనందనుఁ
దలయును మూతియును గొఱుగఁ దగవే? బంధుం
దలయును మూతియు గొఱుగుట
తల తఱుఁగుటకంటెఁ దుచ్ఛతరము మహాత్మా!
భావము:
"కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపటంకంటె తుచ్చమైన పని." అనిబలరాముడు చెప్పసాగాడు. 

కొందఱు రిపు లని కీడును; 
గొందఱు హితు లనుచు మేలు గూర్పవు; నిజ మీ
వందఱి యందును సముఁడవు; 
పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!
భావము:
శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ది? (రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు అన్నాడు)

అని వితర్కించి పలికి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె.
భావము:
ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు

"తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలును జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్."
భావము:
“అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.

చంపెడి దోషము గలిగినఁ
జంపఁ జనదు బంధుజనులఁ జను విడువంగాఁ
జంపిన దోషము సిద్ధము
చంపఁగ మఱి యేల మున్న చచ్చిన వానిన్.
భావము:
చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి.

బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు
గల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర చరితుఁ డగుచు.
భావము:
రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం.

భూమికి ధన ధాన్యములకు
భామలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు 
శ్రీ మదమున మానధనులు చెనఁకుదు రొరులన్.
భావము:
మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అర్రులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు.

వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధం బయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదులందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుంబోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబు లందు ననుభవము నొందుచుండుఁ; గావున.
భావము:
రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ది కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారులందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణాలైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత... 

అజ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
యజ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!
భావము:
పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.


ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుండై, విడువంబడి తన విరూపభావంబునకు నెరియుచు "హరిం గెలిచికాని కుండినపురంబుఁ జొర" నని ప్రతిజ్ఞ చేసి, తత్సమీపంబున నుండె; నివ్విధంబున.
భావము:
ఇలా బలరామునిచేత ప్రభోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.


రుక్మిణీ కల్యాణం:


రాజీవలోచనుఁడు హరి
రాజసమూహముల గెల్చి రాజస మొప్పన్
రాజిత యగు తన పురికిని
రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.
భావము:
పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకొచ్చేడు. బంధువులంతా పొగిడారు.

అంత నయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ద వివాహకృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; న య్యవసరంబున.
భావము:
అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలతో తోరణాలు కట్టారు. జెండాలు ఎగరేసారు. అప్పుడు... 

ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
భావము:
రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడుతుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మిణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.

సతులుం దారును బౌరులు
హితమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్నత వర్ధిష్ణులకును మా
నిత రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్.
భావము:
అపార కృపా వర్ధిష్ణులు, అఖండ తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్పూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.

హరి పెండ్లికిఁ గైకేయక
కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్
పరమానందముఁ బొందిరి
ధరణీశులలోన గాఢ తాత్పర్యములన్.
భావము:
శ్రీకృష్ణమూర్తి కల్యాణానికి, రాజు లందరి లోను కేకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు అధికమైన పరమానందం పొందారు.

హరి యీ తెఱఁగున రుక్మిణి
నరుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కరకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.
భావము:
"ముకుందుడు శ్రీకృష్ణుడు  రుక్మిణీదేవిని అపూర్వంగా తీసుకొచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్య మైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు" అంటూ పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.

అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ 
గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి
పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు.
భావము:
పుణ్యాత్ముడైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణితో క్రీడిస్తున్న శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకానగరం లోని పౌరులు భయాలు విడనాడి మిక్కిలి సంతోషంతో విలసిల్లారు.

అని చెప్పి.
భావము:
శుకమహర్షి ఇలా పరీక్షిత్తునకు భాగవతమును చెప్పసాగాడు.. 

కువలయరక్షాతత్పర! 
కువలయదళ నీలవర్ణ కోమలదేహా! 
కువలయనాథ శిరోమణి! 
కువలయజన వినుత విమలగుణ సంఘాతా!
భావము:
భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతులందరికి శిరోభూషణ మైనవాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! నీకు వందనం!

సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా! 
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ! 
పరహృదయ విదారీ! భక్తలోకోపకారీ! 
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!
భావము:
పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! నీకు వందనములు!

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు రుక్మిణీ జననంబును; రుక్మిణీ సందేశంబును; వాసుదే వాగమనంబును; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనంబును; రుక్మి యనువాని భంగంబును; రుక్మిణీ కల్యాణంబును యను కథలుఁ గల దశమస్కంధంబు నందుఁ బూర్వభాగము సమాప్తము.
భావము:
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్యులచే రచించబడిన శ్రీమహాభాగవతంలోని రుక్మిణీ జననం; రుక్మిణీ సందేశం; వాసుదేవాగమనం; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనం; రుక్మి అనువాని భంగం; రుక్మిణీ కల్యాణం అను కథలు గల దశమస్కంధం నందు పూర్వభాగము సమాప్తము.