సోమవారం, నవంబర్ 30, 2020

నదులకీ పుష్కరుడికీ మధ్య ఉన్న బంధం ఏమిటి?

పోషయతీతి పుష్కరం.. పుష్కరం అనగా పోషించేది అని అర్ధం. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటూ, మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది. 

మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేస్తే, తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయి. 

మార్జన అంటే నీటిని చల్లుకోవడం.. అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. 

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి, భారతదేశములోని 12 ముఖ్యమైన నదులకు 'పుష్కరాలు' వస్తాయి. బృహస్పతి (గురు గ్రహం) సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతుంది. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట.

గంగా నది ------ మేష రాశి

రేవా నది (నర్మద) ------- వృషభ రాశి

సరస్వతీ నది ----- మిథున రాశి

యమునా నది ------ కర్కాటక రాశి

గోదావరి నది  ------ సింహ రాశి

కృష్ణా నది ------- కన్యా రాశి

కావేరీ నది ------ తులా రాశి

భీమా నది ------ వృశ్చిక రాశి

పుష్కరవాహిని/రాధ్యసాగ నది ------ ధనుర్ రాశి

తుంగభద్ర నది ------ మకర రాశి

సింధు నది ------ కుంభ రాశి

ప్రాణహిత నది ------ మీన రాశి

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కర కాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత శక్తివంతమైనవి.

అసలు ఎవరు ఈ పుష్కరుడు? 

పూర్వం తుందిలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపచేసుకోగా, ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందిలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందిల మహర్షి మూడున్నర కోట్ల తీర్ధాలకూ ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు.

సృష్టి మనుగడకు నీరే ఆధారం. కానీ జల సంపత్తి అంతా తుందిల మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టి కర్త అయిన బ్రహ్మ శివుడిని ప్రార్ధించి, పుష్కరుడిని తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇదిలా ఉండగా బృహస్పతి (గురు గ్రహం) లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు. అందుకోసం  జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. 

మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదటి మరియు చివరి పన్నెండు రోజులూ పూర్తిగాను, మిగిలిన సంవత్సరం అంతా మధ్యాహ్న కాలంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు ఆ నదీ జలాల్లో ఉండేలాగా ఒప్పదం.

పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీజలంలో ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

పుష్కర స్నానం ఎలా చెయ్యాలి?

పుష్కర స్నానానికి నదిలో దిగేముందు చెప్పవలసిన శ్లోకం:

పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ 

మృత్తికాం తే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా  

(స్త్రీలయితే 'మృత్తికాం' అని ఉన్న చోట 'హరిద్రాం' అని చదువుకోవాలి) 

ముందుగా, ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని (స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ) కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట. దీని వెనుక ఒక పురాణ గాధ ఉన్నది...  

పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒక రోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ, అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి, చలించి పోయిన నారద మహర్షి  'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి, ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. 

ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా, శాంతించి, శనిదేవుడిని తిరిగి గ్రహ మండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వారికి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు.  

తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా, ఆ యజ్ఞ కుండం లోంచి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని, మునులని తినబోగా, వెంటనే పరమ శివుడు కల్పించుకుని, నిన్ను తలచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆఙ్ఞాపించాడట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. 

ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. సభక్తికంగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చెయ్యకూడదు.

పుష్కరాల సమయంలో...  

సూర్యోదయానికి పూర్వం చేసే 

స్నానం వలన.. వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం

పిండ ప్రదానం వలన... అశ్వమేధ యాగ ఫలము 

మధ్యాహ్న సమయంలో చేసే 

స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితము 

లభిస్తుందని శాస్త్ర వచనం. 

దానాలు: 

పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదిపుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దానానికి ప్రసిద్ధి. 

మొదటి రోజు: భూ దానం, ధాన్య దానం, సువర్ణ దానం, రజత దానం, అన్న దానం

రెండవ రోజు: రత్న దానం, గో దానం, లవణ దానం, వస్త్ర దానం

మూడవ రోజు: గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం (పండ్లు)

నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె

ఐదవ రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు 

ఆరవ రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం 

ఏడవ రోజు: గృహ దానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు 

ఎనిమిదవ రోజు: చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు 

తొమ్మిదవ రోజు: కంబళ్ళు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం 

పదవ రోజు: శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం 

పదకొండవ రోజు: గజ దానం 

పన్నెండవ రోజు: నువ్వుల దానం 

పిండ ప్రదానాది కార్యక్రమాలు:

పుష్కర తీర్ధంలో పిండ ప్రదానం చేస్తే, సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే.. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని శాస్త్ర వచనం. సూర్యాస్తమయ వేళలో మాత్రం పుష్కర తీర్ధంలో ఎలాంటి క్రతువులు నిర్వహించరాదు. 

 ముగింపు:

తీర్ధ స్నానం ఉత్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం, బ్రహ్మము నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు ఉద్భవించాయి. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇలాంటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత. 

బుధవారం, నవంబర్ 25, 2020

పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి?

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి? ప్రేత దేవతగా ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? వీటికి సమాధానం కావాలంటే పిండోపనిషత్తును చదవాల్సిందే. ఇది అథర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మ యోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో వివరించారు. 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

ఒకసారి బ్రహ్మదేవుడిని దేవతలు, మహర్షులు ''మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?'' అని ప్రశ్నించగా, దానికి బ్రహ్మ "దేహం, దేహి" గురించి వివరాలు చెప్పారు

మరణించిన తరువాత ఈ పాంచభౌతికమైన శరీరం నుండి పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే దేహి శరీరం నుండి వెళ్లి పోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళి పోతాయి. 

ముందుగా గాలి వెళ్లి పోతుంది (ఊపిరి ఆగిపోతుంది). దాని వలన పంచప్రాణాలు పోతాయి. 

గాలి తరువాత అగ్ని వెళ్లి పోతుంది. శరీరం చల్లబడుతుంది. తరువాత వైశ్వానరాగ్ని వెళ్లి పోతుంది. 

తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుండి కారిపోతుంది. 

ఎప్పుడైతే గాలి, నిప్పు, నీరు శరీరం నుండి తప్పుకున్నాయో అప్పుడు భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మాత్రమే మిగులుతాయి. కొన్ని రోజులకు ఇవి కూడా భూమిలో కలిసిపోతాయి. 

ఈ శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. 

ఇదే పంచభూతాలు వెళ్లిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని మరో రెండు శరీరాలు ఉంటాయి. 

కారణ శరీరం: మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. ఇది తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లి పోతుంది. ఇదే నూతన శరీరం పొందుతుంది. 

యాతనా శరీరం: ఇది స్వర్గానికో లేక నరకానికో  వెళ్తుంది. 

ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పదిరోజుల పాటు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదవ రోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పది రోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్తుంది. 

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి?

ప్రేతకు కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి, కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి, ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు. 

మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీనినే కలనం అంటారు. 

రెండో పిండం వలన చర్మం, మాంసం ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. 

ఏడో పిండం వలన ఆయుః ప్రమాణం  కలుగుతుంది. 

ఎనిమిదో పిండం వలన మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 

తొమ్మిదో పిండం వలన అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. 

మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుండి సంపూర్తి శరీరం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి మనకు శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి, వారి ఋణం తీర్చుకోవాలి. 

మొత్తంగా ఒక సంవత్సర కాలంలో 16 పిండాలు ఇస్తారు. వీటిలో మొదటి 10 పిండాల నుండి మృతుడు క్రొత్త శరీరాలు పొందుతాడని పిండోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

మృతుని శరీరం నుండి పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని పిండోపనిషత్తు చెబుతోంది. 

మాసికాలు ఇవ్వకపోతే ఏమవుతుంది?

మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏదైనా పిండాన్ని ఇవ్వకపోతే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మాసికాలు మానేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. 

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం వలన చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేదే. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. 

ప్రేత పితృదేవతా స్థానం ఎలా పొందుతుంది?

పూర్వక్రియలు (దహన సంస్కారాది 12 రోజుల క్రియలు), మధ్యమ క్రియలు (మాసికాలు), సపిండీకరణం జరిగే వరకూ దేహాన్ని విడిచిన ఆత్మ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందుకు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని జరిపి, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. ఈ విధంగా పితృదేవతా స్థానం పొందుతుంది.

పుణ్య క్షేత్రాల్లో, పుణ్య తీర్ధాల్లో పిండ ప్రదానం చేస్తే ఏమవుతుంది?

కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయ వంటి పుణ్య క్షేత్రాల్లో పిండప్రదానం చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలుగుతాయి. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు. 

ఇలా పుణ్య క్షేత్రాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా పిండ ప్రదానం చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? 

దీనికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసిన అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు.  

పితృ పూజకు దివ్యమైన కాలం ఏది?

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. మాఘపౌర్ణమి/మహామాఘి రోజున పితరులకు ప్రయాగలో పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమ పెద్దలకు నమస్కరించుకొని, స్వధా నామ పారాయణం చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒక రోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుండే పొందవచ్చు. ఇవే మాసికాల, పిండప్రదానాల రహస్యాలు. 

మంగళవారం, నవంబర్ 17, 2020

ఆత్మపిండం అంటే ఏమిటి?

ఆత్మ పిండం... అంటే తమ పిండాన్ని తామే పెట్టుకోవడం.. 

పూర్వం తాను చనిపోయిన తరువాత శ్రార్ధ కర్మ చేసి, ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు ఈ ఆత్మ పిండాన్ని పెట్టుకునేవారు

ఆత్మ పిండం పెట్టుకోదలచినవారు ముందుగా బ్రహ్మకపాలాన్ని దర్శించి, అక్కడ తనకు తానుగా మరణానంతర కర్మలు (దీనినే ఘటా శ్రార్ధం అంటారు) చేసుకోవాలి. తరువాత  కాశీ వెళ్ళి, విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేసి, గయ వెళ్లి, అక్కడ మూడు చోట్ల పిండాలు పెట్టుకోవడం ఆచారం. 

గయలో మొదటగా నదీ తీరంలోను, తరువాత విష్ణు పాదాల వద్ద, చివరగా అశ్వథ్థ వృక్ష మూలంలోనూ పిండాలు పెట్టడం ఆచారం.

ఆత్మ పిండం పెట్టుకున్నవారు తిరిగి ఇంటికిగానీ, మనుషుల్లోకిగానీ రాకూడదు. ఎటువంటి మంగళ కార్యాలకు హాజరు కాకూడదు. ఆశీర్వచనాలు ఇవ్వరాదు, తీసుకోరాదు. 

ఆత్మ పిండం పెట్టుకున్నవారు అన్ని రకాల ధార్మిక నియమాలను (జప, తప, దానాలు) పాటించాలి. మహాప్రస్ధానం వెళ్ళాలి. అంటే అడవుల్లోకీ, పర్వతాల్లోకీ వెళ్తూ సాధన చేసుకుంటూ గడపాలి.


నైమిశారణ్యం

నైమిశారణ్యం

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.

మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సూత, శౌనకాది మహా మహర్షులు నివశించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది.

అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని
తీర్థానాముత్తమం తీర్థం
క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని పిలుస్తారు.

సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశంతంగా ఆధ్యాత్మకానుభూతులను ప్రోది చేసే దివ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్ గా, నీమ్ చార్ వ్యవహరిస్తుంటారు.

స్థల పురాణం :

ఒక సారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలి ప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా వుంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటికుండం  ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. ఈ పవిత్ర తీర్థాన్ని చక్ర తీర్థంగా పిలుచుకుంటున్నాం. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన రోజున సోమవతీ అమావాస్య అని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు, జపాలు అఖండమైన పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి. నైమిశారణ్యం దివ్యక్షేత్రం. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన అన్ని సంప్రదాయాలతో పాటూ హిందూ ధార్మిక విధానాలూ భక్తులకు అందుబాటులో ఉంటాయి. అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యధామం ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది.

అలాగే దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది. వృత్తాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం కావల్సి వచ్చింది. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకోగా దధీచి మహముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక దివ్యాస్త్రంగా రూపొందుతుందని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారట. దేవతల అభీష్టం తెలుసుకున్న దధీచి మహాముని ప్రాణత్యాగం చేసి పూజ్యనీయుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దధీచి మహర్షి లోకకల్యాణార్థం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దివ్యస్థలం నైమిశారణ్యమేనని పురాణాల ద్వారా తెలుస్తుంది.


ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పారట. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.


దేవాలయాలు :

నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రముతో, త్రిశూల చిహ్నాముతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజుల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.

సూత, శౌనుకాది మహా మునులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా విరాజిల్లుతున్న నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్ నాథ్ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్ ) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి నొందినది. దీనితో పాటూ రాధాకృష్ణ, గోపాల్ , కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.

నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో లలితామాత దర్శనమిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది.

అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి ,సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానన సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది.

నైమిశారణ్యం సందర్శనం బహు జన్మల పుణ్యఫలం. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.

నాకు నచ్చిన పద్యం

నాకు ఈ పద్యం అంటే చాలా ఇష్టం. ఇది ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోనిది. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. ఈయన  16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని అంచనా. ఈయన ఆనాటి "పొత్తపి సీమ" (ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి) పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మతః వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడయ్యాడని భావన. ధూర్జటి రచనలుగా మనకు లభించేవి రెండు మాత్రమే. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము

ధూర్జటి తాను ఈ  శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు 'కస్తూరి రంగ' కవి తన "యానంద రంగరాట్ఛందము" లో ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ "ఇది ధూర్జటి వారి శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి స్వీకరించబడినది" అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవియే రచించెననుట నిర్వివాదాంశం. 

వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, చే
గిన్నే బ్రహ్మకపాల, ముగ్రమగు భోగే కంఠాహారంబు మే
ల్నిన్నీ లాగున నుంటయుం దెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వరా!


ఈశ్వరా! నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము. తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె బ్రహ్మ కపాలము. కంఠాభరణాలు భయంకర సర్పాలు. మరి ఇవన్నీ తెలిసి కూడా లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి నిన్ను ఎలా పూజిస్తున్నాడు స్వామీ! ఆయన సంపన్నుడైయుండియు ఆదిభిక్షువవైన నిన్ను ధ్యానించుట చిత్రమని భావము.