గురువారం, ఏప్రిల్ 06, 2017

నా కాశీ యాత్రా విశేషాలు

दर्शनात् अभ्रशदसि | जननात् कमलालये ||
स्मरणात् अरुणाचले | काश्यान्तु मरणान् मुक्तिः ||

దర్శనాత్ అభ్రశదసి | జననాత్ కమలాలయే ||
స్మరణాత్ అరుణాచలే | కాశ్యాంతు మరణాన్ ముక్తిః ||

తాత్పర్యం: చిదంబరం వెళ్లి దర్శనం చేసుకున్నా.. తిరువారూరులో జన్మించినా..
అరుణాచలేశ్వరుడిని స్మరించుకున్నా.. కాశీలో మరణించినా ముక్తి లభిస్తుంది.  

జీవుడు తన జీవితంలో ఖచ్చితంగా దర్శించి తీరవలసిన క్షేత్రాలు ఇవి. తిరువారూరు లో జన్మించడం మన చేతుల్లో లేకపోవచ్చు గానీ మిగిలిన క్షేత్రాలైన చిదంబరం, అరుణాచలం, కాశీ లాంటి క్షేత్రాలను ప్రయత్నపూర్వకంగా దర్శించాలి. మన ఆధ్యాత్మిక జీవన గమనంలో పై క్షేత్రాలను దర్శించిన తరువాత కలిగే మార్పులని మనం ఖచ్చితంగా గుర్తించగలం... ఆ క్షేత్రాల పాశస్త్యం అటువంటిది.

పురాణ ప్రాశస్త్యం:
కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం పొందటానికి, తపస్సు చేసుకోవటానికి ప్రకృతి మొత్తం జలరాశితో నిండి ఉన్న సమయంలో పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూఖండమే కాశీ. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడంటారు. తరువాత దేవతలు, ఋషులు విన్నపం మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే భూమిమీదకు దించి నిలబెట్టాడు. అదే కాశీ పట్టణమని వ్యాసుల వారు శివపురాణంలో వివరించారు. కాశీలో బ్రహ్మదేవుడు, యమునితో సహా దేవతలెవ్వరికీ ఇక్కడ ఎటువంటి అధికారం లేదని, కేవలం ఈశ్వరునికి ఆయన పరివార దేవతలకు మాత్రమే ఇక్కడ అధికారం ఉంటుందని.. బ్రహ్మదేవుని సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీనగరం మాత్రం చెక్కు చెదరదని పురాణవచనం...
========@========

కాశీలో వసతి సదుపాయాలు:
వారణాసిలో వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32° - 46°C మధ్య, చలికాలంలో 5° - 15°C మధ్య ఉంటాయి. తట్టుకోలేనంత ఎండలు.. తట్టుకోలేనంత చలి.. కాబట్టి మీరు వెళ్లే సమయాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం మంచిది.

కాశీలో వసతికి ఇబ్బంది లేదు. అనేక సత్రాలు, హోటల్స్ ఉన్నాయి. సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఏసీ రూమ్స్ ఉంటాయి. తెలుగు వారైతే బెంగాలీ టోలా గల్లీకి వెళ్ళటం మంచిది. కేదార్ ఘాట్ నుండి రాజాఘాట్ (రాజ్ ఘాట్ వేరు.. రాజా ఘాట్ వేరు గమనించగలరు) వరకు ఎక్కువగా తెలుగు వారుంటారు. గంగాస్నానానికి ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. పూజలకు, పితృకార్యాలకు స్ధానిక పురోహితులు అందుబాటులో ఉంటారు.

కాశీలో ఏదైనా క్రతువు చేయించడానికి కొందరు పండాలు (పూజారులని అక్కడ పండాలు అంటారు) చాలా డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు విని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అంత ఎక్కువ అడుగుతారు. ఎంత అంటే అంత ఇచ్చేయకండి. వాళ్ళు అడిగిన దానిలో సగానికి పైగా దిగి వస్తారు. అంత ఎక్కువ డబ్బులు ఎందుకు అడుగుతారో (అందరూ కాదు, కొందరే) నాకయితే అర్ధం కాదు. ఆ దేవుడికే ఎరుక. 

ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫలహారం ఏర్పాట్లు ఉంటాయి. ఇవి ఉచితమే. కాకపోతే ఉదయం 9 గంటల లోపు మన పేరు రాయించుకోవాలి.

గంగా స్నానం:
కాశీ లాంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడైనా తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో (4 - 5 గం. ల మధ్య) లేచి గంగా స్నానానికి వెళ్ళండి. తెల్లవారుఝామున వెలుతురు ఉండకపోవచ్చు కాబట్టి టార్చిలైట్ వంటిది తీసుకెళ్లండి. గంగానదికి చెప్పులతో వెళ్ళకండి. గంగానదిలో స్నానం చేసేటప్పుడు సబ్బులు షాంపూలు ఉపయోగించకండి. సబ్బులతో బట్టలు ఉతకరాదు. యాత్రికులు ఎవరూ లేని చోట గంగా స్నాన ఘట్టాలలో స్నానం చేయకండి. కాశీలో ఉన్నన్ని రోజులు ప్రతిరోజూ గంగా స్నానం చేయండి. మొదటి సారి కాశీకి వచ్చిన వారు ప్రాయశ్చిత్త గంగా స్నానం తప్పకుండా చేయండి. 

గంగా స్నానం అయిందిగా.. ఇప్పుడు విశ్వనాధుని దర్శనం చేసుకుందాం రండి... 

సాక్షి గణపతి మందిరం:
విశ్వనాధుని ఆలయానికి వెళ్లే దారిలోనే విశ్వనాధ్ గల్లీ లో ఉంటుంది సాక్షి గణపతి ఆలయం. అక్కడ ఆగి గణపతికి మన పేరు గోత్రం చెప్పుకోవాలి. కాశీకి వచ్చిన భక్తుల వివరాలను ఆయన రాసుకుంటాడు. అందుకే పెద్ద కలం పట్టుకుని ఉన్న గణపతి మూర్తి మనకు దర్శనం ఇస్తుంది.



విశ్వనాధుని ఆలయానికి వెళ్ళేటప్పుడు కనీసం రెండు చోట్ల సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు తీసుకెళ్తే తప్పనిసరిగా బయట షాపులో లాకర్ లో పెట్టి వెళ్ళాలి. లాకర్ లో వస్తువులు పెట్టుకోవడానికి డబ్బులు అడగరు, కానీ లాకర్ ఉపయోగించుకున్నందుకు వారి వద్ద పూజా ద్రవ్యాలు ఏదో ఒకటి కనీసం 100/- తక్కువ కాకుండా కొనాలి. 100/- తో సరిపెట్టారంటే మీరు అదృష్టవంతులనే చెప్పచ్చు. అలా ఉంటుంది అక్కడ షాపు వాళ్ళతో వ్యవహారం. 150/-... 200/-... వరకూ కూడా కొనేవరకు ఊరుకోరు కొందరు. పైగా ఖరీదైన వస్తువులకు గారంటీ కూడా ఉండదు. మీరు లాకర్ లో పెట్టిన మొబైల్ ఫోన్ లాంటివి పోయినా ఎవ్వరూ మీ గోడు పట్టించుకోరు. ఒక్కోసారి ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్లనివ్వరు. మహా తలనొప్పి అనుభవించాల్సి వస్తుంది అప్పుడు. అందుకే మీ వస్తువులు అన్నీ మీ వసతి వద్ద వదిలేసి వెళ్లడం మంచిది. కాశీ గురించి గానీ, కాశీలో దేని గురించి గానీ విమర్శించరాదు. అలా విమర్శిస్తే శివునికి కోపమొస్తుందట. నేను చూసింది చూసినట్లు వివరిస్తే ఇది చదివి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశ్యంతో వివరిస్తున్నాను.

డుంఠి గణపతి ఆలయం:
విశ్వనాధుని ఆలయానికి వెళ్లే మార్గంలో మొదటి సెక్యూరిటీ చెకింగ్ దగ్గరనే డుంఠి గణపతి కొలువుతీరి ఉన్నాడు. గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. డుంఠి గణపతికి కంఠం వద్ద చంద్రరేఖ ఉంటుందట. మనకు స్పష్టంగా కనిపించదు విగ్రహంలో. కాశీ క్షేత్రంలో డుంఠి గణపతి 56 స్వరూపాలతో పంచ క్రోసుల కాశీ పట్టణాన్ని కాపాడుతుంటాడు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి కాబట్టి తప్పకుండా దర్శించి విశ్వనాధుని ఆలయంవైపు వెళ్ళండి.

విశ్వనాధుని ఆలయం:
కాశీ విశ్వనాధ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయం. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని 'బంగారు మందిరం' అని కూడా అంటారు. విశ్వనాధుని దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం.

నా ఖ్యాతే విశ్వవిఖ్యాతి చెందిందిగానీ, నేను ఉండే స్ధలం మాత్రం ఇంతే అనే భోళా శంకరుడి గుడి చాలా చిన్నది. అందులో గర్భగుడి ఇంకా చిన్నది. నాలుగు ద్వారాలు ఉంటాయి. రెండు ద్వారాలు లోపలకి వెళ్ళడానికి, రెండు ద్వారాలు బయటకి రావడానికి. గర్భగుడిలో ఒక మూలకి ఉన్నట్టు ఉంటుంది విశ్వేశ్వరుని లింగం. గుమ్మం వరకూ క్యూ ఉంటుందిగానీ గుమ్మం దగ్గర నుండి బలవంతులదే రాజ్యం. మనం తీసుకెళ్లిన పూజాద్రవ్యాలతో మనమే అభిషేకం చేసుకోవాలి. తీరిగ్గా అభిషేకించుకుందాం అంటే కుదరదు. వీలయినంత తక్కువ పూజాద్రవ్యాలు అంటే పాలు, గంగాజలం, మారేడుపత్రితో సరిపెట్టుకుంటే మంచిది. మనకున్న సమయంలో వాటినే దేవుడికి సమర్పించి మనస్ఫూర్తిగా కన్నులారా విశ్వనాధుడిని చూసి బయటకు వచ్చేయడమే. ఆ తోపులాటలో మనం మనసులో అనుకున్నదే మంత్రం. ఇంతకుమించి పూజాద్రవ్యాలు తీసుకెళ్లినా అన్నింటినీ సమర్పించేటంత తెరిపి ఆ తోపులాటలో ఉండదు.

మనం రుద్రాభిషేకం చేయించుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న పూజారులతో మాట్లాడుకోవాలి. అవసరమైన పూజాద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు. ఆలయం ఆవరణలో బయటే సంకల్పం చెప్పించి, రుద్రం అంతా చదువుతారు. తర్వాత లోపలకి తీసుకెళ్లి రెండు నిముషాలలో అభిషేకం కానిచ్చేస్తారు. మనకు తెలుగులో మాట్లాడే పూజారులు అక్కడ దొరుకుతారు. లేకపోతే వారు చదివే మంత్రాలు మనకి అర్ధం కాక సంకల్పం చెప్పించుకునేటప్పుడే నిరాశ చెందాల్సి వస్తుంది. కాబట్టి వీలయినంత మటుకు తెలుగు పూజారులతోనే అభిషేకం చేయించుకోండి. అప్పటికి అప్పుడు అభిషేకం చేయించుకుందాం అంటే కుదరదు. ముందురోజు పూజారిని కలిసి మాట్లాడుకోవాలి.

ప్రధాన ఆలయంలో గర్భగుడిలోపల ఉన్న నాలుగు గోడల మీదా పాలరాతి ఫలకాలలో.. 
ఉత్తర గోడపై సీతారామ లక్ష్మణులు.. 
పడమర గోడపై దశ భుజ వినాయకుడు, శక్తి, కాలభైరవుడు.. 
దక్షిణ గోడపై పార్వతీ పరమేశ్వరులు, యోగాసనంలో కూర్చుని ఉన్న పురుష స్వరూపం.. 
తూర్పు గోడపై వృషభారూఢయై డమరుకం, త్రిశూలం ధరించిన స్త్రీమూర్తి (మహాశ్వేత).. 
పూజారి కూర్చునే గూటిపై లక్ష్మీ నారాయణులు..  ఉంటారు వారిని కూడా దర్శించండి. 

సాధన చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఈ ఆలయంలో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనుభవిస్తారు. 

విశ్వనాధుడిని దర్శించుకుని బయటకు వచ్చాక ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు పార్వతీ దేవి, అన్నపూర్ణాదేవి, కుబేరుడు, పక్కనే గుంటలో కుబేరేశ్వరలింగం, అవముక్తేశ్వర లింగం, ఏకాదశేశ్వర లింగం, తారకేశ్వర లింగం, నందీశ్వరుడు, గణపతి, విష్ణు, మహాలక్ష్మిలను దర్శించుకోండి.

అవముక్తేశ్వర లింగం: విశ్వనాధుని ఆలయంలో ఉన్న ప్రధాన ఉపాలయం. ఈ లింగం వల్లనే కాశీ అవిముక్త క్షేత్రంగా మారిందట. ఈ లింగ దర్శనం వలన అనేక జన్మల నుండి వస్తున్న జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయట. ప్రతీరోజూ సాక్షాత్తూ ఆ కాశీ విశ్వనాథుడు కూడా ఈ అవముక్తేశ్వర లింగాన్ని స్వయంగా అర్చిస్తాడట. అందుకే ఈ లింగ దర్శనం మోక్ష దాయకం.

తారకేశ్వర లింగం: విశ్వనాధుని ఆలయంలో ఉన్న మరో ఉపాలయం. ఇక్కడి నుండే పంచ క్రోశ కాశీలో మరణించబోయే జీవులకు స్వామి తారక మంత్రోపదేశంచేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి విశ్వనాధుని మందిరం దండయాత్రకు గురవబోతుంటే ఆలయ అర్చకులు లింగాన్ని దాచిపెట్టాలన్న ఉద్దేశంతో కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో ఆ అర్చకులు "స్వామీ నీవు కదలకపోతే మేమే నిన్ను హత్తుకుంటాము. మేము మరణించిన తరువాతనే నిన్ను ధ్వంసం చెయ్యగలరు" అని హత్తుకోగా.. ఆ జ్యోతిర్లింగము పైకి లేచిందట. అప్పుడు ఆ లింగాన్ని బావి నందు దాచిపెట్టారు. దాడి తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి బావిలో కనపడలేదు. అప్పుడు రాణి అహల్యాబాయి కలలో స్వామి కనబడి "లింగము ఆ నీటిలో లుప్తం అయిపోయింది.. మరో లింగాన్ని ప్రతిష్ట చెయ్యమని" పలుకగా.. ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి లింగాన్ని తెచ్చి ఓ ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతా అయ్యాక లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట.. ఆ స్థలమే తనకి ఇష్టమైనదని.. అక్కడే అలాగే ఉంచి అర్చించమని స్వామి పలికాడట. అదే ఇప్పుడు మనం దర్శించుకునే విశ్వనాధ లింగం. ఆ కారణంగా గర్భగుడిలో ఓ ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు. ముందుగా ప్రతిష్టించబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు. ఆలయసమీపంలో ఉన్న "జ్ఞానవాపీ మసీదు" (Gyanvapi Mosque) ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. ఆలయ ప్రాంగణంలో గల "జ్ఞానవాపీ బావి" లోనే అప్పటి లింగం లుప్తం అయిపోయింది. కాబట్టి ఆలయ ప్రాంగణం లోని బావిని కూడా తప్పక దర్శించుకోండి. బావి పక్కనే ఒక పెద్ద నంది మసీదు వైపు చూస్తూ ఉంటుంది.. ఆనాటి విశ్వనాధుని దర్శనానికి గుర్తుగా... 

కాశీ విశ్వనాధుని ఆలయం తెరచు వేళలు :
తెల్లవారు ఝామున 2 గంటలకే ఆలయం తెరుస్తారు. రాత్రి దాదాపు 12 - 1 గంటల మధ్య ఆలయం మూసివేస్తారు. 
ఆలయ దర్శన వేళలు:
4 AM నుండి 11 PM వరకూ దర్శనం ఉంటుంది. మధ్యలో హారతి సమయాలలో దర్శనం ఆపుతారు.  
హారతి సమయాలు:
> 3 AM నుండి 4 AM వరకూ మంగళ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (300/-)
> 11:15 AM నుండి 12.20 PM వరకూ భోగ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (125/-)
> 7 PM నుండి 8.15 PM వరకూ సంధ్యా హారతి. దీనినే సప్తర్షి హారతి అంటారు. దీనికి టికెట్ ఉంటుంది. (150/-)
> 9 PM నుండి 10.15 PM వరకూ శృంగార్ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (150/-)
> 10.30 PM నుండి 11 PM వరకూ సాయం హారతి. ఇది ఉచితం. 

మంగళ హారతి:
3 AM నుండి 4 AM వరకూ మంగళ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (300/-)
తెల్లవారుఝామున స్వామిని మేలుకొలిపి, ముందురోజు చేసిన అలంకరణలు అన్నీ తొలగించి, స్వామికి తొలి అభిషేకం జరిపిస్తారు. ఈ హారతిలో శవ భస్మంతో అభిషేకం చేస్తారని ఒక అపోహ ఉంది. కానీ అలాంటిది ఏమీ జరగదు. 

భోగ హారతి:
11:15 AM నుండి 12.20 PM వరకూ భోగ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (125/-)
ఉదయం 11 గంటల నుండి ఈ హారతి కోసం దర్శనాన్ని ఆపుతారు. ఈ హారతిలో విశ్వనాధుడికి అనేక పిండి వంటలతో నైవేద్యం జరుగుతుంది. హారతి అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంచుతారు. 

సప్తర్షి హారతి:
7 PM నుండి 8.15 PM వరకూ సంధ్యా హారతి. దీనినే సప్తర్షి హారతి అంటారు. దీనికి టికెట్ ఉంటుంది. (150/-)
ఏడుగురు పూజారులు సప్తర్షులకు ప్రతీకగా  విశ్వనాధునికి హారతి ఇస్తారు. కాశీ వెళ్లిన వారు తప్పకుండా ఈ హారతిని చూడండి. సామవేదం చదువుతూ ఇచ్చే ఈ హారతి చూడడానికి కన్నుల పండుగలా ఉంటుంది. ఒక రకమైన తన్మయత్వానికి లోనవుతాము.

శృంగార్ హారతి:
9 PM నుండి 10.15 PM వరకూ శృంగార్ హారతి. దీనికి టికెట్ ఉంటుంది. (150/-)
సప్తర్షి హారతికి, శృంగార్ హారతికి మద్య సమయం తక్కువ. ఈ హారతిలో స్వామికి అలంకరణ చేసి, నైవేద్యం పెడతారు. ఈ హారతి అనంతరం గర్భ గుడిలోకి ప్రవేశం ఆపేస్తారు. 

సాయం హారతి:
10.30 PM నుండి 11 PM వరకూ సాయం హారతి. ఇది ఉచితం. 
ఈ హారతిలో విశ్వనాధునికి చేసే అలంకరణ బాగుంటుంది. మరునాడు ఉదయం అభిషేక సమయం వరకూ ఈ అలంకరణ లోనే స్వామివారు ఉంటారు. ఈ హారతికి ఎక్కువ సాధు సన్యాసులు వస్తారట.
========@========

విశ్వేశ్వర ఆలయం నుండి బయటకురాగానే ఎడమ వైపు శనీశ్వరాలయం (చాలా చిన్నది) కనిపిస్తుంది. అక్కడ దీపం వెలిగించుకోండి. దీపాలు అక్కడే అమ్ముతారు. కొంచెం ముందుకు రాగానే కాశీ అన్నపూర్ణాదేవి మందిరం వస్తుంది.

కాశీ అన్నపూర్ణాదేవి మందిరం:
విశ్వనాధుని దేవేరి అన్నపూర్ణా మాత. ఈ తల్లి చలువ వలన కాశీలో అన్నానికి లోటు ఉండదు. ఆలయంలో అన్నపూర్ణాదేవి నిలువెత్తు బంగారు విగ్రహం కన్నుల పండుగలా కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే ప్రాధాన్యతను చాటి చెప్పే అవతారం. ఆకలితో ఉన్న వారికి అన్నంపెట్టి ఆదరించమనే సందేశం అమ్మవారు మనకి ఇస్తుంది. సమస్త ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది. సమస్త కోరికలను తీర్చుతుంది. కాశీ పట్టణమునకు రాణి. సకల ప్రాణకోటికి చోదకశక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతే అందిస్తుంది కనుకే అన్నపూర్ణ మాతగా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తి అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిసింది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆదిశంకరాచార్యుల విరచిత అన్నపూర్ణా స్తోత్రం తప్పక పఠించాలి. ఈ ఆలయంలో ప్రసాదంగా కొన్ని బియ్యాన్ని ఇస్తారు.

ఒకసారి శివుడు పార్వతీ దేవితో ఈలోకంలో అంతా మాయే అని చెప్పగా పార్వతీదేవి అన్నం మాయకాదు అంటుందట. దానికి శివుడు అన్నం కూడా మాయే అని వాదించగా కోపగించిన పార్వతీదేవి లోకంలో తిండి దొరకకుండా మాయం చేసిందట. లోకాలన్నీ ఆకలితో అలమటించగా అప్పుడు శివుడు అన్నం మాత్రం మాయకాదు అని ఒప్పుకుని ఆది భిక్షువై భిక్షాపాత్రతో అమ్మవారిని భిక్ష అడిగాడట. కరుణించిన అమ్మవారు మళ్ళీ లోకంలో అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణయై వెలిసిందట. అందుకే చేతిలో బంగారు పాయసపాత్రతో, పెద్ద గరిటతో వడ్డించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ అమ్మవారు. 

ఇంకో కధ కూడా చెప్తారు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి మూడు కన్నులూ (సూర్యుడు, చంద్రుడు, అగ్ని) మూసిందట. అప్పుడు మొత్తం విశ్వం అంతా చిమ్మచీకట్లు అలుముకోగా పార్వతీదేవి కూడా తన గౌర వర్ణాన్ని కోల్పోయి కాళికగా నల్లగా మారిపోయిందట. అప్పుడు పార్వతీదేవి బాధపడి శివుడిని మరలా తనకి గౌరవర్ణం ప్రసాదించమని అడుగగా శివుడు కాశీలో అన్నదానం చేస్తే తిరిగి గౌరవర్ణం లభిస్తుందని చెప్పగా అమ్మవారు అన్నపూర్ణాదేవియై వెలిసి కాశీలో అన్నదానం చేసి తిరిగి తన గౌరవర్ణాన్ని పొందిందట. కాశీలో అన్నదాన మహత్య ఫలం ఈ కధ మనకు తెలుపుతుంది.

అన్నపూర్ణాదేవి మందిరంలో కూడా అనేక ఉపాలయాలు ఉన్నాయి. అన్నింటినీ తప్పక దర్శించుకోండి. కొన్ని ఉపాలయాల గురించి సంక్షిప్తంగా.. 

కుబేరేశ్వర లింగం: ఈ లింగారాధన వలన సకల సిద్దులు ప్రాప్తిస్తాయట.

శ్రీచక్రేశ్వరలింగం: అన్నపూర్ణాదేవి ఆలయంలోకి ప్రవేశించగానే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. అమ్మవారు తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు శ్రీచక్రంతో కూడిన శివలింగమును ప్రతిష్ఠ చేశారు.

ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం అన్నపూర్ణా ట్రస్ట్ (I) వారిచే నిర్వహించబడుచున్నది. ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. అన్నపూర్ణా ట్రస్ట్ (II) లో కూడా ఉచిత భోజన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. రాత్రి కూడా ఫలహారం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ రెండు చోట్లా ఎంత మంది వస్తే అంతమందికి భోజనం పెడతారు. పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం ఎంతో మంది సిద్దులు, యోగులు, సన్యాసులు, యాత్రికులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. కాశీ వెళ్లిన ప్రతీ ఒక్కరూ తప్పకుండా అన్నపూర్ణమ్మ పెట్టే భోజనం చేసి రావాలి.

కాశీ విశాలాక్షి మందిరం:
విశ్వనాథ మందిరానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. కాశీ విశాలాక్షిని కంచి కామాక్షి తోనూ, మధుర మీనాక్షి తోనూ పోలుస్తారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలో ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. అందుకే అమ్మ వారిని "మణి కర్ణిక' అని కూడా పిలుచుకుంటారు. ఈ శక్తిపీఠంలోని గర్భాలయంలో విశాలాక్షి రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. అర్చా విగ్రహానికి వెనుక స్వయంభూ విగ్రహం ఉంటుంది. ఆలయంలో ఆదిశంకరాచార్యులవారు శ్రీచక్రంని ప్రతిష్ఠించారు. ఈ శ్రీచక్రానికి కుంకుమ పూజ మనమే స్వయంగా చేసుకోవచ్చు.




విశాలాక్షేశ్వరుడు:
ఈ లింగార్చన వలన అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయట. 



ఇంకా విశాలాక్షి ఆలయ సమీపంలో గల మరికొన్ని ఆలయ వివరాలు.. 
ధర్మేశ్వర్:
ఈ ఆలయ ఆవరణలో ఉన్న  ధర్మ కూపంలో స్నానం చేసి ఈ లింగాన్ని అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయి. విశాలాక్షి గౌరీ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం. కనుక్కుంటూ వెళ్ళండి.



వట సావిత్రి మందిరం:
పరమ సాధ్వి సావిత్రీ దేవి తన భర్త ప్రాణాలను తీసుకుపోతున్న యముడిని అనుసరిస్తూ వచ్చి, ఈ ప్రదేశంలోనే తన భర్త ప్రాణాలను తిరిగి సంపాదించుకోగలిగిందట. 

విశ్వ బాహుకా దేవి / విశ్వభుజ గౌరీ: 
ఈ అమ్మవారి దర్శనం వలన ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఏమన్నా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయట. 
దివోదాసేశ్వరుడు:
ఈ లింగార్చన వలన ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. సుఖసంతోషాలు కలుగుతాయి. సకల పాపాలు నశిస్తాయట. ఈ లింగం విశ్వభుజ గౌరీ ఆలయంలో ఉంది. కాశీ క్షేత్రాన్ని దివోదాసు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. ఆ రాజు ప్రతిష్టించి, పూజించి, మోక్షం పొందిన లింగమే ఈ దివోదాసేశ్వరుడు. 


వృద్దాదిత్యుడు:
హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 



శ్వేత మాధవుడు:
శ్వేత మాధవుని దర్శనం వలన దైవత్వం సిద్ధిస్తుందట. హనుమాన్ ఆలయంలోనే కొలువై ఉన్నాడు.

జరాసంధేశ్వరుడు:
ఈ లింగ దర్శనం వలన ఆరోగ్యం కలుగుతుందట. హనుమాన్ ఆలయంలోనే కొలువై ఉన్నాడు.


ఆశా వినాయకుడు:
కాశీ క్షేత్రంలోని 56 వినాయక స్వరూపాలలో ఒకరు ఆశా వినాయకుడు. ఈ వినాయకార్చన వలన సమస్త కోరికలు నెరవేరతాయట. 

వారాహీ దేవి మందిరం:
విశాలాక్షి ఆలయానికి వెళ్ళే దారిలోనే వారాహీ దేవి ఆలయం ఉంది. ఈమె కాశీ గ్రామదేవత. క్షేత్ర పాలకురాలు. ఈమె లలితా పరాభట్టారిక అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. వారాహీ దేవి విగ్రహం భూగృహం (సెల్లార్) లో ఉంటుంది. నేలపై ఉన్న గ్రిల్స్ లోనుండి చూడాలి. రెండు గ్రిల్స్ ఉంటాయి. ఒక గ్రిల్ నుండి చూస్తే అమ్మవారి ముఖము, మరో గ్రిల్ నుండి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. వారాహీ దేవి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా (ఇంకా చీకటి ఉండగానే) మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. అమ్మవారు పగటిపూట పడుకుంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. కారణం వారాహీ ఉగ్ర దేవత. చాలా వేడిగా ఉంటుంది. అందుకే ఈ తల్లిని దర్శించాలంటే ఉదయం 7 గంటలలోపే వెళ్ళాలి.

సోమనాథ్ జ్యోతిర్లింగం : 
గుజరాత్ లోని సోమనాధ్ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో సోమేశ్వర్ లింగం ఉంది. మన్ మందిర్ ఘాట్ దగ్గర గల వారాహీ ఆలయ సమీపంలో సోమనాధుడు కొలువై ఉన్నాడు. వారాహి ఆలయం నుండి దారి కనుక్కుంటూ వెళ్ళండి. 


రామేశ్వరం : 
రామేశ్వరంలోని రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో గణేశ్వర్ కొలువై ఉన్నాడు. వారాహి దేవి ఆలయానికి సమీపంలోనే గణేశ్వర్ (రామేశ్వర్ అని కూడా అంటారు) కొలువై ఉన్నాడు. కనుక్కుంటూ వెళ్ళండి. సోమనాథ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. 



కేదారేశ్వర మందిరం:
కాశీలో తప్పక దర్శించాల్సిన మందిరం. విశ్వనాధ లింగం ఎంత గొప్పదో.. అలాగే స్మరణ మాత్రం చేత మోక్షాన్నే ఇవ్వగలిగిన లింగం కేదారేశ్వర లింగం. ప్రతీరోజూ ఉభయ సంధ్యలయందు కేదారేశ్వరుడిని స్మరిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో గంగాస్నానం చేసి, కేదారేశ్వరుడిని దర్శించాలి. ఈ కేదారేశ్వర లింగం కూడా స్వయంభూ లింగమే. హిమాలయ కేదారేశ్వరుడి కన్నా కాశీలోని కేదారేశ్వరుడు ఉదారుడు అంటారు.

పూర్వం వశిష్ఠుడనే బ్రాహ్మణ పిల్లవాడు ప్రతీ సంవత్సరం తన గురువు గారితో కలిసి హిమాలయాల్లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేవారు. ఒకసారి కేదార దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో తన గురువుగారు చనిపోతూ కేదారేశ్వరుడుని దర్శించుకునే మార్గంలో ప్రాణాలు పోయినా కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి ప్రాణాలు విడిచారు. తరువాత ఆ పిల్లవాడు కాశీ క్షేత్రంలో బ్రహ్మచారియై సదా పరమేశ్వర ధ్యానంలో గడిపేవాడు. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం చైత్ర మాసం లోని పౌర్ణమి తిధిలో హిమాలయ కేదారేశ్వరుడిని దర్శించుకుని వచ్చేవాడు. వశిష్ఠుడు వార్ధక్యం చేత ఇంక కేదారేశ్వరుని దర్శనానికి వెళ్లలేక, కాశీలో పరమేశ్వరుడిని ప్రార్ధించగా వశిష్ఠుని కోరిక మేరకు పరమేశ్వరుడు కేదారేశ్వరుడిగా కాశీలోనే వెలిసాడు. హిమాలయ కేదారేశ్వరుడి పూజ కన్నా, కాశీలోని కేదారేశ్వరుడి పూజ 7 రెట్లు అధిక పుణ్యఫలం ఇస్తుందని ప్రతీతి.

పురాణం ప్రకారం కాశీ భూఖండాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. 
1) విశ్వేశ్వర ఖండం 
2) కేదార ఖండం 
3) ఓంకార ఖండం
ఈ మూడు భూ ఖండాలలోనూ కేదార ఖండం విశిష్టమైనదిగా చెప్తారు. 



తిల్ భాండేశ్వర మందిరం:
ఈ తిలభాండేశ్వరుడు ఒక సజీవ లింగం. ప్రతిరోజూ ఒక తిల (నువ్వు గింజ) పరిమాణం పెరుగుతూ ఉంటాడట. అందుకే ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది. మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునేవారికి తగినంత ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శివకోటి స్తంభం తప్పక దర్శించుకోండి. ఈ ఆలయంలో ఉన్న ఆదిశంకరాచార్యుని విగ్రహం చాలా బాగుంటుంది. సాక్షాత్తూ ఆది శంకరులు కైలాస పర్వతం నుండి తీసుకు వచ్చి ప్రతిష్టించిన శివ లింగమే ఈ తిల్ భాండేశ్వరుడు.



పైన చెప్పిన ఆలయాలు అన్నీ కాలినడకన చూసి రావాల్సినవే. ఇప్పుడు చెప్పబోయే ఆలయాలు దర్శించాలంటే వాహనాలను ఆశ్రయించాల్సిందే... (కాశీ లోకల్ సైట్ సీయింగ్ లో భాగంగానే సారనాధ్ కూడా చూపిస్తారు. కాబట్టి మీ వాహనం మాట్లాడుకునేటప్పుడే సారనాధ్ కూడా చూపించాలని చెప్పండి)

కాలభైరవ మందిరం:
కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఆయన వారణాసి పట్టణమునకంతటికీ కాపలాదారై ఉంటాడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని, ఆయన అనుమతి తీసుకుని, విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము.

కాలభైరవుని ఆవిర్భావం..  ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి అబద్దమాడాడు. వెంటనే శంకరుడు హుంకరించగా ఆ హుంకారం నుండి కాలభైరవుడు ఆవిర్భవించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. బ్రహ్మగారి తల త్రుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది. పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. లోకాలన్నీ తిరిగినా పోని పాపం, ఆయన కాశీకి రాగానే పోయింది. చేతికి అతుక్కున్న తల ఊడి కిందపడింది. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి. 

అప్పుడు శంకరుడు భైరవుడిని కాశీ క్షేత్రపాలకునిగా నియమించాడు. కాశీకి వచ్చిన, అక్కడ నివసిస్తున్నవారి పాప పుణ్యాల చిట్టాలు కాలభైరవుడే చూస్తాడట. వీళ్ళందరి పాపాలనూ కాలభైరవుడు కాలుడై భక్షిస్తాడట. యమ ధర్మరాజుకి గానీ, చిత్ర గుప్తుడికి గానీ కాశీలో నివసిస్తున్న, అక్కడ మరణించిన వారిపై ఎటువంటి అధికారం ఉండదట. కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. 

మరి సాక్షాత్తూ ఆ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత ఉండాలి కదా! కాశీలో మరణించటమే ఆ అర్హత. వారి పాపపుణ్యాలను పటాపంచలు చేసి, తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చేస్తాడు. మరి మనం చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాలికదా. దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు. దానినే భైరవ దండన అంటారు. అందుకే తెలిసీ తెలియక చేసిన తప్పులని మన్నించు స్వామీ అని వేడుకుని భైరవ రక్ష (కాశీతాడు) కాలభైరవ మందిరంలో కట్టించుకోవాలి. 



దండపాణి మందిరం:
కాలభైరవుని ఆలయానికి దగ్గరలోనే దండపాణి మందిరం ఉంది. సంభ్రమ, విభ్రమములనే సేవకులతో కూడిన మరో ప్రాచీన దండపాణి మందిరం విశ్వనాధ మందిరానికి దగ్గరలో గల డుంఠి రాజ గల్లీలో ఉంది. కాశీ క్షేత్రానికి వచ్చిన యాత్రికులు దండపాణి మందిరాన్ని కూడా తప్పక దర్శించుకోవాలి. జీవితంలోని కష్టాలు అన్ని తొలగి ముక్తికి చేరువ అయ్యేలాగా దండపాణి అనుగ్రహిస్తాడు. 

కాలభైరవ ఆలయం దగ్గరున్న దండపాణి:

డుంఠి రాజ గల్లీలోఉన్న దండపాణి: 

మృత్యుంజయ మందిరం:
కాలభైరవ ఆలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ మందిరం ఉంది. ఈ లింగ దర్శనం వలన అపమృత్యుదోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో ఉన్న 'కాలోదక బావి' కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వాసం.
వృద్ధ కాళేశ్వరుడు:
మృత్యుంజయ మహాదేవ మందిరంలోనే కొలువై ఉన్న వృద్ధ కాళేశ్వరుని దర్శనం వలన పేదరికం తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయట. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట. సమస్త కోరికలు తీరతాయట. 
మహాకాళేశ్వర్: 
మృత్యుంజయ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న మహాకాళేశ్వర లింగం ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా ఉంది. ఈ లింగార్చన వలన సమస్త విశ్వాన్ని అర్చించిన ఫలము లభిస్తుందట. 


అసితంగ భైరవుడు:
కాశీ క్షేత్రంలోని అష్ట భైరవులలో ఒకరు అసితంగ భైరవుడు. మృత్యుంజయ మందిరంలోనే కొలువై ఉన్నాడు.

భీష్మ కేశవుడు:
మృత్యుంజయ మహాదేవ మందిరంలోనే భీష్మ కేశవుడు కొలువై ఉన్నాడు. ఈయన అర్చన వలన జీవితంలో ఎలాంటి అడ్డంకులు అయినా తొలగిపోయి కార్య సిద్ధి కలుగుతుందట. 
 

కృత్తివాసేశ్వర మందిరం:
కృత్తివాసేశ్వర లింగం కూడా స్వయంభూ లింగమే. పూర్వం గజాసురుడనే రాక్షసుడు కాశీ క్షేత్రంలో మితిమీరి ప్రజలను కష్టాలకు గురి చేయగా ఆ పరమేశ్వరుడు గజాసురుడిని తన త్రిశూలాగ్రానికి గుచ్చి సంహరిస్తాడు. ఆ గజాసురుని కోరిక మేరకు గజ చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాడు. ఆ గజ చర్మం ఎప్పుడూ రక్తమోడుతూ ఉంటుంది. అది ఎప్పటికి పాడవదు, చిరగదు. ఈ విధంగా గజాసురుడిని అనుగ్రహించిన పరమేశ్వరుడు కృత్తివాసేశ్వర లింగంగా స్వయంభువై వెలిసాడు. ఈ లింగం చాలా చల్లగా ఉంటుంది. కావాలంటే తాకి చూడండి. చల్లగా ఉండే శివలింగాలు చాలా ప్రశస్తమైనవి అని శాస్త్ర వచనం. కాబట్టి తప్పకుండా దర్శించండి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న హంస తీర్థం (హర తీర్ధం అని కూడా అంటారు) లో స్నానం చేసి, కృత్తివాసేశ్వర లింగంని ఆరాధిస్తారు.

ప్రస్తుతం ఉన్న ఆలయం స్దానభ్రంశం చెందిన ఆలయం. మృత్యుంజయమహదేవ్ రోడ్ లో ఈ ఆలయం ఉంది. ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయం కూడా ధ్వంసం చేయబడి మసీదు కట్టబడింది. ఈ మసీదులోని ఫౌంటెన్ ఉన్న ప్రదేశంలోనే ఒకప్పటి కృత్తివాసేశ్వర లింగం ఉండేదట. ఇదే కాశీలో అతిపెద్ద శివలింగం అని స్కాంద పురాణం వివరిస్తుంది. ఇప్పుడు లేదు.ఈ మధ్యనే ఈ ప్రాంతంలో మరోపెద్ద శివలింగాన్ని ప్రతిష్ట చేశారట. 



ఓంకారేశ్వర మందిరం:
సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు అగ్ని స్తంభంగా వెలిసినప్పుడు అకార, ఉకార, మకారాలతో కలిసిన ఓంకారలింగం బ్రహ్మదేవుని ప్రార్ధన మేరకు కాశీలో ఓంకారేశ్వరుడిగా వెలిసాడు. ఓంకారేశ్వరుడిని కపిలేశ్వర్, నాగేశ్వర్ అని కూడా పిలుస్తారు.

కాశీ పట్టణంలోని ఓంకారేశ్వరుడి ముందు నిలబడి ఎవరైతే బ్రహ్మగారు చేసినటువంటి ఓంకారేశ్వర స్తోత్రం చేసి అభిషేకం చేస్తారో వారు సశాస్త్రీయంగా నమక చమకాలతో రుద్రాభిషేకం చేసిన ఫలితం పొందుతారు. ఈ లింగార్చన వలన లక్ష మార్లు రుద్రజపం చేసిన ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 

ఓంకారేశ్వరుడి లింగంతో పాటూ అకారేశ్వర లింగం, మకారేశ్వర లింగం కూడా ఉంటాయి. వాటిని కూడా తప్పకుండా దర్శించండి. (పూర్వం బిందు లింగం, నాద లింగం కూడా ఉండేవట). ఈ ఐదు లింగాలను (అకార, మకార, ఓంకార, బిందు, నాద లింగాలు) పంచ అక్షర లింగాలు అని పిలుస్తారట. మత్స్యోదరీ తీర్ధంలో స్నానం చేసి ఓంకారేశ్వరుడిని అర్చిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మచ్చోదరి ప్రాంతంలో పథాని టోలా మార్గంలో ఈ ఆలయం ఉంది.

కవళీ మాత లేక కౌడీ బాయి మందిరం:
కవళీ మాతని గవ్వలమ్మ అని కూడా అంటారు. ఈమెని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదని అంటారు. ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు. అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.

కవళీ మాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేశ్వరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం, తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే, ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం, తిరిగి హరిజనుడు స్పృజించడం, తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. 

ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక, ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు, కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండరాదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళినందుకు, విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోతున్నందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది. 

ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం కాగా "ఈశ్వరా! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను?" అని ఆవేదనపడింది. ఈశ్వరుడు "కవళీ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు" అని చెప్పి అదృశ్యం అయ్యాడట. 

అప్పటి నుండీ కవళీ "కవళీ మాత" అయింది. కనుక, భక్తులు కాశీ విశ్వేశ్వరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని, ఆమెతో "ఈ గవ్వలు నీకు, కాశీ ఫలితం నాకు" అని ప్రార్ధించిన భక్తులకు కాశీ వెళ్లిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా తప్పకుండా దర్శించుకుంటారు. ఈమెను విశ్వనాధుడికి సోదరిగా భావిస్తారు.

దుర్గా మందిరం:
పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుద్ధంలో అతనిని ఓడించి సంహరించింది. తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసింది. దుర్గుని సంహరించినది కనుక దుర్గాదేవిగా ప్రసిధ్ధి గాంచింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఆలయం గోపురం ఉత్తర భారత శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును 'దుర్గా కుండ్' అంటారు.

ఈ ఆలయంలో కొన్ని ముఖ్య ఉపాలయాలు ఉన్నాయి. 
చండ భైరవుడు:
కాశీ క్షేత్రం లోని అష్ట భైరవులలో ఒకరు. 

కుక్కుటేశ్వర్ మహాదేవ్:
అండాకారంలో ఉన్న కుక్కుటేశ్వర్ మహాదేవ్ ని అర్చించడం వలన జనన మరణాల నుండి విముక్తి కలుగుతుందట.

తులసీ మానస మందిరం:
ఇది దుర్గమందిరానికి అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే గోస్వామి తులసీదాసు రామాయణాన్ని రచించాడు. తరువాత 1964లో ఈ ప్రదేశంలో పాలరాతి కట్టడం నిర్మించారు. భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం రాయబడింది. రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలు కూడా వున్నాయి. రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి. పురాణాలలోని కొన్ని ఘట్టాలను బొమ్మలతో దృశ్య కావ్యంగా ప్రదర్శిస్తారు. దీన్ని సందర్శించడానికి టిక్కెట్ ఉంది. నామమాత్రపు రుసుము (5/-) మాత్రమే. తప్పకుండా దర్శించండి.

సంకట మోచన్ హనుమాన్ మందిరం:
ఈ ఆలయం కూడా దుర్గమందిరానికి సమీపంలోనే ఉంటుంది. కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. గోస్వామి తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినదే ఈ ఆలయం. కష్టాలు (సంకట్) నుండి భక్తులను కడతేర్చే (మోచన్) దేవునిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య దైవాలైన సీతారాముల ఆలయం ఉంది.

బిర్లా మందిరం:
ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే బెనారస్ విశ్వ విద్యాలయం పూర్వం కాశీ రాజు గారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంది. దీనిని 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా గారు స్ధాపించారు. ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం ఉంది. బిర్లాలచే నిర్మించబడింది కనుక దీనిని బిర్లా మందిర్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి ఉంటుంది. కాశీ విశ్వనాధుని ఆలయంలో కేవలం హిందువులకే అనుమతి. విదేశీయులని అనుమతించరు. కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగలవారు ఎవరైనా చేసుకోవచ్చు.

ఇక్కడే 'భారత కళాభవన్' అనే మ్యూజియం కూడా ఉంది. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు తెరిచి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయానికి సెలవు ఉన్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసి ఉంటుంది.

భారతమాత మందిరం:
1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ కి 1.5 కి.మీ. దూరంలో ఉంది. పాలరాతితో చెక్కిన మొత్తం భారతదేశ చిత్రపటం ఇందులో ఉంది. పర్వతాలు, నదులు, సముద్రాలు, మైదానాలు పాలరాతితో చెక్కిన తీరు బాగుంటుంది.

వ్యాస కాశీ:
పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు. వేద విభాగము చేసినవాడు. అంతటి గొప్ప వ్యక్తి తన కోపం కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు. 

పురాణ కధనం ప్రకారం.. పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో ఉండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది. ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశారు. కాశీలో ఇంట శవం ఉన్నా కూడా అతిధులకు అన్నం పెడతారు. అటువంటి కాశీలో అన్నం దొరక్కపోవడంతో, వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. 

కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పట్టుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సంవత్సరాల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన అనుష్ఠానం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను" అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి అనుష్ఠానం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఔపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు అన్నింటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. 

అమ్మవారు వచ్చి మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి, అప్పుడు శంకరుని తీసుకు వచ్చింది. తర్వాత నెమ్మదిగా చీవాట్లూ పెట్టింది. "ఏడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలు ఎలా రాశావయ్యా? కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు ఊరుకుంటాడా?" అని నిలదీసింది. అపుడు శంకరుడు "వ్యాసా! నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తి క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో" అన్నాడు.

వెనక్కి తిరిగి బాధతో అయ్యో! కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు "వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడ నుండి దక్షారామం వెళ్ళిపో" అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.

వ్యాస కాశీకి దగ్గరలోనే వనదుర్గా ఆలయం ఉంది. కుదిరినవారు దర్శించుకోండి. 

రామనగర్ కోట:
రామనగర్ కోట 18వ శతాబ్దంలో కాశీనరేశ్ రాజా బల్వంత్ సింగ్ చేత నిర్మించబడిది. 18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసంగా ఉంది. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ, నామమాత్ర రాజరికం మరియు పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఉన్న మ్యూజియంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు భద్రపరచబడి ఉన్నాయి. 'An Eccentric Museum' అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్నఖచ్ఛిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల మరియు అరుదైన జ్యోతిష గడియారం భద్రపరచబడి ఉన్నాయి. ఆకాలానికి చెందిన వివిధ రకాల కారులు కూడా మ్యూజియంకి ప్రధాన ఆకర్షణ. సరస్వతీ భవనంలో మతసంబంధిత వ్రాతపతులు భద్రపరచబడి ఉన్నాయి. ఇందులోనే గోస్వామీ తులసీదాసు వ్రాసిన రామాయణ ప్రతులు కూడా ఉన్నాయి. ఈ కోటలో కొంత భాగం పర్యాటకుల కొరకు తెరచి ఉన్నప్పటికీ మిగిలిన భాగం కాశీ నరేశ్ కుటుంబానికి నివాసంగా ఉపయోగపడుతూ ఉంది. ప్రస్తుతం ఈ కోటలో ప్రస్తుత కాశీనరేశ్ అనంత నారాయణ్ సింగ్ నివసిస్తున్నారు. ఇప్పటికీ పర్వటి రోజుల్లో కాశీ విశ్వనాధుడిని మొదటగా కాశీ నరేశ్ కుటుంబమే దర్శించుకుంటుంది.
========@========

కాశీలోని ద్వాదశ ఆదిత్యులు:
దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. కాశీలోని ద్వాదశ ఆదిత్యుల వివరాలు కూడా ఇస్తున్నాను. వీలు కుదిరిన వారు తప్పకుండా దర్శించండి. ఈ క్రింది లింకు పైన నొక్కండి.
http://sivooham.blogspot.in/2017/11/blog-post.html

========@========
కాశీలోని జ్యోతిర్లింగాలు:
మన భారతదేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలున్నాయి. వాటిలో కాశీలోని విశ్వనాథలింగం కూడా ఒకటి. కానీ పరమపవిత్రం అయిన కాశీ నగరంలో విశ్వనాధ లింగం కాకుండా మిగిలిన 11 జ్యోతిర్లింగాలకు ప్రతిగా 11 లింగాలు ఉన్నాయి. కాశీలోని ఈ 12 లింగాలను దర్శిస్తే 12 జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం కలుగుతుందట. ఈ లింగాల ప్రాశస్త్యం కాశీఖండంలో వివరించి ఉంది. వాటి వివరాలు కూడా ఇస్తున్నాను. వీలు కుదిరిన వారు తప్పకుండా దర్శించండి. ఈ క్రింది లింకు పైన నొక్కండి.
http://sivooham.blogspot.in/2017/10/blog-post.html

                                                           ========@========
గంగా ఘాట్స్:
గంగా ఘాట్ ల గురించి తెలుసుకునే ముందు అసలు గంగావతరణం ఎలా జరిగిందో తెలుసుకుందాం.. ఈ క్రింది లింకు పైన నొక్కండి. 
http://sivooham.blogspot.in/2014/12/blog-post.html

గంగా తీరంలో 80కు పైగా ఘాట్లు ఉన్నాయి. వీటిలో పంచ గంగా ఘాట్, మణికర్ణిక ఘాట్‌, దశాశ్వమేధ్‌ఘాట్‌, కేదార్ ఘాట్, అస్సి ఘాట్... ముఖ్యమైనవి. కాశీ వెళ్లిన వారు కనీసం ఈ ఐదు ఘాట్ లలో తప్పకుండా గంగాస్నానం చేయాలి. మీరు బోట్ మాట్లాడుకునేటప్పుడే ఈ ఐదు చోట్లా స్నానం చేస్తామని ఖచ్చితంగా ముందే చెప్పండి. 

పంచ గంగా ఘాట్:
ఈ ఘాట్ లో పంచ నదుల సంగమ స్థానం ఉందట. అవి గంగ, యమున, ధర్మ, ధూత్ పాప, కిరణా నదులు. కార్తీక మాసం నెలరోజులూ సాక్షాత్తూ శ్రీ కాశీ విశ్వనాథుడు కూడా ఈ పంచగంగా ఘాట్ లో స్నానం చేస్తాడట. అలహాబాద్ లోని త్రివేణీ సంగమంలో మాఘ మాసం నెల రోజులూ స్నానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఈ పంచగంగా ఘాట్ లో ఒక్కసారి స్నానం చేయడం వలన కలుగుతుందట.

ధూత్ పాప నది & ధర్మ నదుల ఆవిర్భావం:
భృగు వంశానికి చెందిన వేదసిర మహర్షి, అప్సరస శుచి ల కుమార్తె ధూత్ పాప. ఒకసారి ధూత్ పాప బ్రహ్మదేవుని కొరకై ఘోర తపస్సు చేయగా, ఈమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఈ విశ్వంలోని మూడున్నర కోట్ల పవిత్ర తీర్ధాలను ఆమె యందు నిక్షిప్తం చేసాడట. ఒకసారి ఈమెని చూసిన ధర్ముడు ఈమె అందానికి ముగ్ధుడై మనువాడ దలిచి ఆమెని అడుగగా, తన తండ్రిని అడగవలిసినదిగా కోరిందట. ఆయన నీ అభిప్రాయం తెలుపమని అడుగగా ఆమె నిరాకరించిందట. దానితో కోపించిన ధర్ముడు ఆమెని శిల్పం కావాల్సిందిగా శపించాడట. ఆగ్రహించిన ధూత్ పాప కూడా ధర్ముడిని నదిగా మారమని శపించిందట. దీనితో ఆయన ధర్మ నదిగా మారిపోయాడట. జరిగినది అంతా తెలుసుకున్న వేదసిర మహర్షి తన తపశ్శక్తితో, ధూత్ పాపని రాతి శిల్పంగా కాక చంద్ర కాంత శిల్పంగా మార్చాడట. ధూత్ పాపకు ధర్ముడు తగిన భర్త అని చెప్పగా, చంద్ర కాంత శిల్పంగా మారిన ధూత్ పాప.. చంద్ర కిరణాలకు కరిగి, ప్రవాహంగా మారి ధర్మ నదితో సంగమించిందట. మూడున్నర కోట్ల పవిత్ర తీర్ధాలను తనలో నిక్షిప్తం చేసుకోవడం వలన అతి పవిత్ర నదిగా ధూత్ పాప అవతరించింది. 

కిరణా నది ఆవిర్భావం: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద పరమేశ్వర లింగాన్ని, మంగళ గౌరిని ప్రతిష్టించి, వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచాడు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట.

గాభస్తీశ్వర లింగం, మంగళ గౌరీ ఆలయం & మయూఖాదిత్యుడు:
సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యుని గా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. మయూఖాదిత్యుని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితం లోని అశాంతులు అన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.



బిందు మాధవ ఆలయం:
ఈ ఘాట్ లోనే పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన బిందు మాధవ క్షేత్రం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి అగ్ని బిందు మహర్షి పేరు మీద బిందు మాధవుడిగా వెలిసాడు. ఇక్కడ స్వామి వివిధ యుగాలలో వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు.

కృత యుగంలో - ఆది మాధవుడు 
త్రేతా యుగంలో - ఆనంద మాధవుడు 
ద్వాపర యుగంలో - శ్రీ మాధవుడు 
కలి యుగంలో - బిందు మాధవుడు 

ఔరంగజేబు బిందు మాధవ ఆలయం కూలగొట్టి, ఆలంగిర్ మసీదు (Alamgir Mosque) నిర్మించాడు. ఇప్పుడు బిందు మాధవ క్షేత్రం స్దానభ్రంశం చెంది చిన్న ఆలయంగా ఉంది. 

పంచ మాధవ క్షేత్రాలు:
1) బిందు మాధవుడు - కాశీ 
2) వేణీ మాధవుడు - ప్రయాగ
3) లీలా మాధవుడు - రామతీర్ధం 
4) కుంతీ మాధవుడు - పిఠాపురం 
5) సేతు మాధవుడు - రామేశ్వరం 


త్రైలింగ స్వామి మఠం:
పంచగంగా ఘాట్ దగ్గరలోనే త్రైలింగ స్వామి మఠం ఉంది. తప్పకుండా దర్శించుకోండి. త్రైలింగ స్వామి తెలుగు దేశానికి చెందిన మహా యోగి. దాదాపు 250 సంవత్సరాలు జీవించారు. ఈయన గురించి విపులంగా మరో పోస్టులో వివరిస్తాను. 

మణికర్ణిక ఘాట్‌:
మణికర్ణిక ఘాట్‌ను మహావిష్ణువే స్వయంగా నిర్మించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక సరస్సు తవ్వగా అది విష్ణువు స్వేదంతో నిండిపొయిందట. దాని ఒడ్డున మహా శివుని కోసం 1008 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తల ఆడించాడట. అప్పుడు ఆయన కుడి చెవికి ఉన్న కర్ణాభరణం జారి ఆ తటాకంలో పడింది. సాక్షాత్తూ ఆ విశ్వేశరుడు ధరించిన చెవి కుండలం పడిన ప్రదేశం మణికర్ణికా ఘాట్ అయింది. తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీద నుంచి ప్రవహించిందని కొందరంటారు. ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా మెట్లు కట్టబడిన పుష్కరిణి ఒకటి ఉంది. అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు. మహా విష్ణువు కోరిక మేరకు ఈ మణికర్ణికా హ్రదం సమస్త విశ్వంలోనే ఉత్తమ తీర్ధంగా విరాజిల్లుతుంది.

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు గంగానదిలోని మణికర్ణికా ఘాట్ లో స్నానం చేసి, పైకి వెళ్ళి ఆ హ్రదం(తటాకం) లో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని చెప్తారు. ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గంటలకు సకల దేవతలూ వస్తారట. ఆ సమయంలో అక్కడ స్నానం చేసిన వారికి కలిగే పుణ్యరాశిని వర్ణించడానికి, బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖములతోను వంద సంవత్సరాల పాటు చెప్పినా సమయం సరిపోదట. అంత పుణ్యం లభిస్తుందట. అందుకే మణికర్ణికకి ముక్తికాంత కింకరి (దాసీ) అంటారు. మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికలో స్నానం చేసి 'మణికర్ణికా స్తవం' తప్పక పఠించాలి. ఈ ఘాట్ లోని తారకేశ్వరాలయం తప్పక దర్శించాలి. 

మణికర్ణికా స్నానానంతరం మౌన వ్రతంలో కాశీ విశ్వనాధుడిని దర్శిస్తే, సమస్త వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందట.  ఈ మణికర్ణిక వద్ద తిల తర్పణం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందట.  

ఇక్కడ స్మశాన ఘట్టంలో 24 గంటలూ శహదహనం జరగుతుంది. మిగిలిన చోట్ల సూర్యాస్తమయం తరువాత శవదహనం జరగదు.

దశాశ్వమేథ్‌ఘాట్‌:
వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది దశాశ్వమేథ్‌ఘాట్‌. ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్‌లోనే గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. విశ్వనాధుని అభిషేకానికి గంగా జలం ఈ ఘాట్ నుండే తీసుకువెళతారు.

గంగా హారతి:
ప్రతిరోజు దశాశ్వమేధ్ ఘాట్ లో ఇచ్చే గంగా హారతిని కూడా తప్పకుండా దర్శించాలి. చల్లని తల్లి  గంగమ్మ ఒడ్డున కూర్చుని ఈ హారతిని దర్శించడానికి రెండు కళ్ళు చాలవు. అన్ని ప్రముఖ గంగా ఘాట్ లలోను గంగా హారతిని ఇస్తారు. కానీ దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే హారతిని  చూడ్డానికి అధిక భక్తులు హాజరవుతారు. ఈ హారతి అయ్యాక మనం కూడా గంగలో దీపాలు వదలచ్చు. దీపాలు అక్కడే అమ్ముతారు. 


ఈ దశాశ్వమేథ్‌ఘాట్‌ లోనే శూలటంకేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, ప్రయాగేశ్వరుడు, ప్రయాగ మాధవుడు, వరాహేశ్వరుడు, దశాశ్వమేధేశ్వర్, అభయవినాయకుడు, గంగాదేవి, బండీదేవి ఆలయాలు ఉన్నాయి. 

వాటి వివరాలు సంక్షిప్తంగా... 
శూలటంకేశ్వరుడు: కాశీ క్షేత్రం లోకి గంగ అతి దూకుడుగా వేగంతో ప్రయాణించేదట. గంగాదేవి వేగాన్ని తగ్గించడానికి పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని అడ్డుపెట్టి గంగాదేవి వేగాన్ని తగ్గించి శూలటంకేశ్వరుడుగా వెలిశాడట. ఈ లింగ దర్శనం, అభిషేకాదులు నూరు రెట్లు అధిక ఫలితం ఇస్తుందట. 

బ్రహ్మేశ్వరుడు: ఈ లింగార్చన వలన బ్రహ్మలోకం సిద్ధిస్తుందని  కాశీఖండం వివరిస్తుంది. 

బండీదేవి: ఈ అమ్మవారి దర్శనం వలన అపాత్ర దానం వలన కలిగే పాపాలు నశిస్తాయి. అలాగే శారీరకంగా కానీ, మానసికంగా గాని ఎవరినైనా తెలిసో, తెలియకో హింసించిన పాపాలు కూడా నశిస్తాయట. ఈ తల్లిని దర్శిస్తే మీతో పాటూ మీ కుటుంబ సభ్యులు చేసిన పాపాలను కూడా కడిగేస్తుందట. అంత శక్తివంతమైనది బండీ దేవి. కాబట్టి తప్పకుండా దర్శించండి.

ప్రయాగేశ్వరుడు: బండిదేవి ఆలయంలోనే ప్రయాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన ధనం, ధాన్యం, భక్తి తత్పరులైన పుత్రసంతానం కలుగుతాయి. అంతిమంగా మోక్షం సిద్ధిస్తుందట. 

ప్రయాగ మాధవుడు: దశాశ్వమేధ్ ఘాట్ లో గల రామ మందిరంలో ప్రయాగ మాధవుడు కొలువై ఉన్నాడు. ఈయన దర్శనం వలన అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగి, అంత్యంలో మోక్షం లభిస్తుందట. 

వరాహేశ్వరుడు: ఈ లింగ దర్శనం వలన మానసిక అశాంతి కలుగదట. దశాశ్వమేధ్ ఘాట్ లోని రామమందిరంలో రామలక్ష్మణుల విగ్రహాల వెనుక ఆది వరహేశ్వరుడు కొలువైయున్నాడు.

దశాశ్వమేధేశ్వర్: శీతలా దేవి మందిరంలో దశాశ్వమేధేశ్వరుడు కొలువైయున్నాడు. ఈ లింగార్చన వలన సుఖసంతోషాలు కలుగుతాయట. 

కేదార్ ఘాట్:
ఈ ఘాట్ లో స్నానం చేసి కేదారేశ్వరుడిని దర్శిస్తారు. ఈ ఘాట్ లోనే హరిశ్చంద్ర ప్రతిష్ఠిత శివ లింగం ఉంది. దానిని కూడా దర్శించుకోండి.

అస్సి ఘాట్:
ఇది అస్సి నది, గంగా నదుల సంగమ స్థానం. కాబట్టి ఈ ఘాట్ లో తప్పకుండా స్నానం చేయాలి.

మరి కొన్ని ఘాట్ లు.. అక్కడ దర్శించాల్సిన ముఖ్యమయిన ఆలయ వివరాలు... 

తులసీ ఘాట్ :
లోలార్కాదిత్యుడు:
తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెబుతారు. ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ఈ లోలార్క ఆదిత్యుడిని తప్పకుండా దర్శించాలి. 

అమరేశ్వరుడు:
గంగాసాగర్ తీర్ధం నుండి అమరేశ్వర లింగం ఉద్భవించిందట. అమర్ నాథ్ లింగానికి ప్రతీకగా ఈ అమరేశ్వరుడిని చెప్తారు. అమర్ నాథ్ వెళ్లలేని యాత్రికులకు ఈ లింగ ఆరాధన వల్ల అమర్ నాథ్ వెళ్లిన ఫలితం దక్కుతుంది. లోలార్క్ కుండ్ దగ్గర అమరేశ్వరుడు కొలువై ఉన్నాడు. 
అర్క వినాయకుడు:
తులసీ ఘాట్ నుండి మెట్లు ఎక్కగానే అర్క వినాయకుడు దర్శనం ఇస్తారు. ఆదివారం అర్క వినాయకుని పూజ అధిక ఫలప్రదం.

హరిశ్చంద్రఘాట్‌:
ఈ ఘాట్‌లో హరిశ్చంద్రుడే స్వయంగా కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద దీన్ని హరిశ్చంద్రఘాట్‌ అంటారు. ఇక్కడ స్మశాన ఘట్టంలో కూడా 24 గంటలూ శహదహనం జరగుతుంది.

ఆనంద భైరవుడు:
కాశీ క్షేత్రంలోని అష్ట భైరవులలో ఒకరు. ఈయననే రురు భైరవుడు అని కూడా పిలుస్తారు. హనుమాన్ ఘాట్ కి దగ్గరలో ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్ పక్కనే హనుమాన్ ఘాట్. 

క్షేమేశ్వర్ ఘాట్:
ఈ ఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెళదామా అని తాపత్రయపడి, కాశీ వచ్చి వెలిసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉంది. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని అంటారు. ఈ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది.

క్షేమేశ్వర్ ఆలయం:
ఈ లింగార్చన వలన సకల పాపాలు నశిస్తాయట. 

సింధియా ఘాట్:
ఈ ఘాట్ వద్ద దర్శించాల్సిన ముఖ్య ఆలయాలు ఉన్నాయి.

సంకట మందిరం:
సింధియా ఘాట్ వద్ద సంకట మందిరం ఉంది. సంకట మాత విగ్రహం వెండితొడుగుతో, మూడు కన్నులతో, నాలుగు చేతులతో సుమారు 5 అడుగులు ఉంటుంది. ఈ మాతకు ఒకప్రక్క హనుమంతుడు, మరోప్రక్క భైరవుడు ఉంటారు. ఈ మందిరాన్ని పాండవులు తమ వనవాస సమయంలో దర్శించుకున్నారట. సంకటాలను (కష్టాలు) దూరం చేస్తుంది. ఈ మాత చాలా శక్తివంతమైనదిగా చెప్తారు. ఈ మందిరంలో పెద్ద సింహం శిల ఉంది.

యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియాఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. 


ఆత్మ వీరేశ్వరుడు:
సింధియా ఘాట్ లో ఉన్న ఆత్మ వీరేశ్వరలింగం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ లింగాన్ని అర్చిస్తే 3 కోట్ల లింగాలను అర్చించిన ఫలితం దక్కుతుందట. పిల్లలు లేని దంపతులు ఒక సంవత్సరం పాటు నిష్టగా 'అభిలాష అష్టకం' చదివి, స్వామిని అర్చిస్తే తప్పక సంతానం కలుగుతుందట.
మణికర్ణికా దేవి:
సింధియా ఘాట్ లోని ఆత్మ వీరేశ్వరుడి ఆలయం ఎదురుగా ఉంటుంది మణికర్ణికా దేవి. 12 సంవత్సరాల బాలికా విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. ఈమె మణికర్ణికా తీర్ధ మాత. ముక్తి కాంత ఈమె దాసీ.
కాత్యాయనీ ఆలయం:
సింధియా ఘాట్ లోనే కొలువై ఉన్న మరో ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయాన్ని 'పంచ ముద్ర మహా పీఠం' అంటారు. అమ్మవారి పేరు వికటా దేవి. కాత్యాయనుడు అనే భక్తుడు మొదటగా ఈ అమ్మవారిని కొలిచాడు. ఆయన పేరు మీద కాత్యాయని గా పిలువబడుతుంది. మహిషాసుర సంహార సమయంలో త్రిమూర్తులు ముగ్గురూ తమ తమ శక్తులను అమ్మవారికి ఇచ్చారట. ఆ శక్తులతో అమ్మవారు అసురసంహారం చేసిందట. అమ్మవారి వాహనం సింహం.

ఉపశాంతేశ్వర్:
ఈ లింగ దర్శనం వలన మానసిక శాంతి కలుగుతుందట. ఆత్మ వీరేశ్వర్ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. కనుక్కుంటూ వెళ్లాల్సిందే. 

త్రిలోచన్ ఘాట్:
ఈ ఘాట్ లో తప్పని సరిగా దర్శించాల్సిన ఆలయాలు ఉన్నాయి. 
హిరణ్యగర్భేశ్వర్:
త్రిలోచన ఘాట్ మెట్ల పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఈ లింగారాధన వలన ప్రశాంత జీవనానికి ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఈ ఆలయం లోనే ప్రణవ వినాయకుడు కొలువై ఉన్నాడు దర్శించుకోండి. ప్రణవ వినాయకుని అర్చిస్తే స్వర్గలోక ప్రవేశం కలుగుతుందట. 

త్రిలోచనేశ్వర్ లింగం:
భూలోకం క్రింద ఉన్న 7పాతాళ లోకాలను చీల్చుకుంటూ, భూలోకంలో వెలిసిన స్వయంభూ లింగమే ఈ త్రిలోచనేశ్వర్ లింగం. కాశీ విశ్వనాధుని త్రినేత్రమే ఈ లింగం అని చెప్తారు. ఎక్కడ చేసిన పాపాలైనా కాశీ ప్రవేశం తోనే పోతాయంటారు. కానీ కాశీ లో చేసిన పాపాలు ఈ లింగార్చన వలన తొలగిపోతాయట. ఈ ఆలయంలోనే పిల్ పిలా తీర్ధం ఉంది. ఈ తీర్ధంలో యమున, సరస్వతి, నర్మదా నదులు సంగమిస్తాయి అని చెప్తారు. ఈ తీర్ధం ఇప్పుడు బావి రూపంలో ఉంది. ఈ ఆలయంలోనే మరో బావి రూపంలో పాదోదక తీర్ధం కూడా ఉంది.

పాదోదక తీర్ధం:
విష్ణుమూర్తి కాశీ వచ్చినప్పుడు ముందుగా, ఈ కాశీ క్షేత్రం అంతా విహంగ వీక్షణం చేసి వరుణా, గంగా నదుల సంగమ స్థానం వద్ద కాళ్ళు చేతులు కడుక్కుని, కాశీ నగర ప్రవేశం చేసాడట. ఆ ప్రదేశమే ఈ పాదోదక తీర్ధం. ఈ తీర్ధంలో స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయట. ఈ తీర్ధంలో పెట్టిన శ్రార్ధం 21 తరాల పితృదేవతలకు చేరుతుందట. అందుకే ఇక్కడ పెట్టిన శ్రార్ధం గయలో పెట్టిన శ్రార్ధంతో సమానం అంటారు. ఇప్పుడు ఈ పాదోదక తీర్ధం కూడా త్రిలోచనేశ్వర్ మందిరం లోనే బావి రూపంలో ఉంది. ఈ బావిని ఇప్పుడు పైన మూసివేసి చేతి పంపు (bore well) అమర్చారు. 

అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 

ఆదిమహాదేవ మందిరం:
సత్య యుగంలో దేవతల, ఋషుల ప్రార్ధన మేరకు భూమిని చీల్చుకుని స్వయంభూ ఆదిమహాదేవ లింగం వెలిసిందట. ఈ లింగం వల్లనే కాశీ ముక్తి క్షేత్రంగా మారిందని చెప్తారు. ఈ ఆదిమహాదేవ లింగాన్నిఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి కాశీ క్షేత్రంలో మరణించకపోయినా కూడా ముక్తిని ప్రసాదిస్తానని వరం ఇచ్చాడుట. పరిపూర్ణ మనసుతో ఈ స్వామిని ఒక్కసారి ఆరాధించినా ఈ లోకంలో ఉన్న సమస్త లింగాలని ఆరాధించిన ఫలితం దక్కుతుంది. త్రిలోచన్ ఘాట్ వద్ద ఉంది ఈ ఆలయం.

మోదక ప్రియ వినాయకుడు:
ఈ వినాయకార్చన వలన తలపెట్టిన ప్రతీ కార్యం లోనూ విజయం లభిస్తుందట. ఆది మహాదేవ లింగం ఉన్న గర్భగుడిలోని గోడ పైన ఉన్నాడు మోదక ప్రియ వినాయకుడు. 

కామేశ్వర్ ఆలయం:
ఈ లింగం దూర్వాస మహర్షి ప్రతిష్ఠిత లింగం. ఈ లింగార్చన వలన సకల కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయం లోనే  ఖగోళ ఆదిత్యుడు కొలువై ఉన్నాడు.

ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 
లాల్ ఘాట్:
గోప్రేక్షేశ్వర్:
ఈ లింగారాధన వలన అర్హుడైన వ్యక్తికి గోదానము ఇచ్చిన ఫలితం లభిస్తుంది. ఈ మందిరాన్ని గౌరీ శంకర్ మందిరం అని కూడా అంటారు. లాల్ ఘాట్ మెట్లు ఎక్కి కుడి వైపుకు తిరిగితే ఈ ఆలయం వస్తుంది. 

ఆదికేశవ్ ఘాట్:
గంగా ఘాట్ లలో మొట్టమొదటిది ఈ ఆదికేశవ్ ఘాట్. 
ఆదికేశవాలయం:
విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి. ఆదికేశవుని దర్శనం ముక్తి కారకం. 

కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి మూర్తికి ఎడమ వైపున కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. 

జ్ఞాన కేశవుడు:
ఆదికేశవాలయం లోనే జ్ఞాన కేశవుడు కొలువై ఉన్నాడు. జ్ఞాన సంపదను కరుణిస్తాడు కనుక జ్ఞాన కేశవుడిగా పిలువబడుతున్నాడు. 

వరుణా సంగమేశ్వరుడు:
సాక్షాత్తు ఆదికేశవుడే గంగా వారుణా సంగమం వద్ద ప్రతిష్టించిన లింగం. ఈ లింగార్చన వలన సకల పాపాలు తొలుగుతాయి. ఈ లింగానికి రుద్రాభిషేకం చేస్తే, అర్హుడైన వ్యక్తికి గోదానం ఇచ్చిన ఫలితం కలుగుతుందట.  

వేదేశ్వరుడు :
ఆదికేశవ ఆలయంలో గల ఈ వేదేశ్వర లింగార్చన వలన 4 వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. 

నక్షత్రేశ్వర్:
ఈ లింగారాధన జాతకంలో గల గ్రహ నక్షత్ర దోషాలు తొలగిపోతాయట. 

చతుర్ ముఖేశ్వర్:
చతుర్ ముఖ బ్రహ్మ ప్రతిష్టించిన ఈ లింగార్చన వలన బ్రహ్మలోకం సిద్ధిస్తుందట. ఆదికేశవ్ ఆలయంలోనే ఉంది ఈ లింగం. 

ఖర్వ వినాయకుడు:
ఆదికేశవాలయానికి దగ్గరలోనే ఖర్వ వినాయకుడు కొలువై ఉన్నాడు. 56 వినాయక స్వరూపాలలో ఒకరు ఖర్వ వినాయకుడు. 

========@========
ముగింపు:
శ్రీనాధ కవిసార్వభౌముడు కాశీఖండంలో తెలియచేసిన పద్యం:
పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ,
ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి,
ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు,
ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ,
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ,
పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి!

భావం: 
ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్ర్కమణం అవుతున్నవేళ.. చేతి గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవి వచ్చి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పవిటతో గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు. డుంఠి గణపతి వచ్చి ఎగ ఊపిరి తీస్తున్న జీవుడికి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర నిమురుతూ ఊపిరి అందిస్తాడు. ఇక దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిని పొందుతాడు. ప్రమధ గణములలో ఉత్తముడైన భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడవద్దని విభూది పెడతాడు. చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా, గణ గణ గంటల ధ్వనులు వినిపిస్తుండగా, సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని, ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశించగా, జీవుడు తారక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాడు. మరణ సమయంలో తారకాన్ని పలికావు అన్న మిషతో ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు.

సాక్షాత్తూ రామకృష్ణ పరమహంస తన యోగ దృష్టితో దర్శించి చెప్పారు.. కాశీలో చనిపోతున్న ప్రతీ జీవి కుడి చెవిలో ఆ విశ్వనాథుడు తారక మంత్రోపదేశం చేస్తున్నాడని. మనకి అంత యోగ దృష్టి లేకపోయినా కాశీలో చనిపోయిన జీవులని గమనిస్తే తెలుస్తుంది.. వాటి కుడి చెవి పైకి పెట్టి వింటున్నట్టుగా ఉంటుంది. అదే మనకి ప్రత్యక్ష నిదర్శనం.  

ఇలా ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా, తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమయిన భూమి కాశీ. కాశీలో ప్రతీ జీవీ శివస్వరూపమే. ప్రతీదీ శివమయమే.. 

ఇటువంటి కాశీలో 9 రోజులు నిద్రచేయటం మంచిది. ఇంకా 9 నెలల 9 రోజులు (గర్భవాసం) ఉండడానికి చాలామంది కాశీ చేరుకుంటారు. మరణించే వరకు కాశీలో ఉందామని వచ్చిన వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. వీరిని క్షేత్ర సన్యాసులు లేక కాశీవాసులని అంటారు.

మనం ఏదైనా పుణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు.. ఎన్నో విధి విధానాలను పాటిస్తూ.. దాన, ధర్మ, యజ్ఞాది క్రతువులు నిర్వహిస్తేనే ఆ దివ్య క్షేత్ర దర్శన ఫలం లభిస్తుందట. ఊరికే ఆ క్షేత్రాలలో నివశిస్తే ఎలాంటి ఫలితం కలుగదు. కానీ కాశీ క్షేత్రానికి ఇది మినహాయింపు. మనం కేవలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన తులా పురుష దాన ఫలం మన ఖాతాలో చేరుతుందట. అటువంటి ఈ కాశీ క్షేత్రంలో నివసిస్తే దివ్యమైన ఫలితాలు కలుగుతాయట. మరి అవేంటో తెలుసుకుందామా?

కాశీలో 3 రోజులు నివసిస్తే --- అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం 
కాశీలో 5 రోజులు నివసిస్తే --- చతుర్వేదాలను అధ్యయనం చేసిన ఫలం 

(ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం.. చాలా మంది కాశీలో 3 లేదా 5 లేదా 9 నిద్రలు చేయాలని వస్తారు. పగలు గయ లేదా ప్రయాగ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లి రాత్రిళ్ళు కాశీలో నిద్రిస్తే చాలనుకుంటారు. ఒక రోజు అంటే పగలు + రాత్రి కలిపి ఒక రోజుగా పరిగణించాలని శాస్త్రం చెప్తుంది. 3 రోజులు అనగా పూర్తిగా 3పగళ్లు + 3రాత్రులు అని అర్ధం. హా... ఈ రోజుల్లో మాది బిజీ బిజీ జీవితం అంటారా.. కానీ కాశీ లాంటి క్షేత్ర యాత్ర మాత్రమే మన ప్రస్తుత జీవితానికీ.. మన అనంతర జీవితానికీ ఉపయోగపడుతుందని మాత్రం మర్చిపోకండి. ఏదో వెళ్ళాం.. వచ్చాం.. అని కాకుండా అన్ని విషయాలను పక్కన పెట్టి, మీ కాశీ యాత్రని సఫలం చేసుకోండి)

కాశీలో చాలా ఆలయాలు చిన్నవే. కానీ వాటి మహత్యమే అత్యున్నతం. కాశీలో శివలింగాలను తాకి పూజ చేయవచ్చు. కానీ అమ్మవార్లని మాత్రం తాకరాదు. కాశీలో అనేక దేవాలయాలు, క్షేత్రాలు, మఠాలు ఉన్నాయి. మీకు వీలైనంతమటుకు దర్శించడానికి ప్రయత్నం చెయ్యండి. కాశీలో ఎన్ని చూసినా ఇంకా చూడాల్సినవి మిగిలే ఉంటాయి. నేను నా బ్లాగ్ లో వివరించినవి కొన్ని మాత్రమే. వీటిలో చాలామటుకు దర్శించగలిగాను. నేను కాశీ వెళ్ళినప్పుడు కాశీలోని ఆలయాల గురించి సరైన అవగాహన లేక ఏదో లోటుగా అనిపించింది. రెండు సార్లు కాశీ యాత్ర చేసే భాగ్యాన్ని పరమేశ్వరుడు ఈ సేవకురాలికి కల్పించాడు. వీలైనంత వరకూ నాకు తెలిసిన సమాచారాన్ని అందించగలిగాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ధన్యురాలను. మీ సలహాలు సూచనలకు ఆహ్వానం. ఏమైనా తప్పులు ఉంటే చెప్పగలరు. సరిదిద్దుతాను. 

నేను కాశీ వెళతాను, అక్కడే నివసిస్తాను అనుకుంటే చాలట. మోక్షం సిద్దిస్తుందని పురాణ వచనం. అటువంటి కాశీ గురించి ఎంత రాసినా తక్కువే.. ఎంత చెప్పినా తక్కువే.. "కాశ్యతే ప్రకాశతే ఇతి కాశీ" అని బ్రహ్మ వైవర్త పురాణం కాశీ నామానికి అర్ధం చెప్తుంది. కాశీ అనగా ప్రకాశించునది అని అర్ధం. జ్ఞాన రూపం అయిన పరబ్రహ్మమే కాశీ. మనం కేవలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన తులా పురుష దాన ఫలం మన ఖాతాలో చేరుతుందట. ఒకరోజు కాశీవాసంలో అతి పవిత్రంగా, విధి విధానంగా, శాస్త్ర ప్రకారం శివార్చన చేసిన మనుష్యునకు యావజ్జీవితం శివార్చన చేసిన ఫలం లభిస్తుందట. 

కాశీ నామ స్మరణ, ఉచ్చారణ, శ్రవణం.. కాశీలో ధ్యానం, జపం, పూజ, దానం... అనేవి అత్యధిక పుణ్యప్రదాలు. కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా కోటి రెట్లు ఫలితం కలుగుతుంది. అందుకే ఈ క్షేత్రంలో వీలైనంత పవిత్రంగా జీవిస్తూ, మనకు చేతనయినంత వరకూ దైవ సేవలో గడపాలి. ఉన్నంతలోనే దాన ధర్మాలు చెయ్యాలి. 

కాశీలో గంగా స్నానం, డుంఠి గణపతి దర్శనం, విశ్వనాధ దర్శనం, అన్నపూర్ణమ్మ దర్శనం, విశాలాక్షి దర్శనం, కాలభైరవుని దర్శనం, దండపాణి దర్శనం, కేదారేశ్వరుని దర్శనం, మణికర్ణికా స్నానం, గంగా హారతి.. ఇలా ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు.


****************

సారనాధ్ :

కాశీ లోకల్ సైట్ సీయింగ్ లో భాగంగానే సారనాధ్ కూడా చూపిస్తారు. కాబట్టి మీ వాహనం మాట్లాడుకునేటప్పుడే సారనాధ్ కూడా చూపించాలని చెప్పండి. కాశీ నుండి సారనాధ్ సుమారుగా 12 కి.మీ దూరం ఉంటుంది. సారనాధ్  అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. దీని ఎత్తు 143 అడుగులు.  దీనిని నిర్మించింది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దం వరకూ అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ ఉన్న మ్యూజియంలో బుద్ధుని గురించిన అనేక విశేషాలు కలవు. 


ఇంకా అలహాబాద్, గయ గురించిన వివరాలు మరో పోస్టులో రాసాను. వాటి వివరాల కోసం ఈ క్రింది లింకుపై నొక్కండి,.. 
https://sivooham.blogspot.com/2018/10/blog-post.html


*** సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ***