ఆదివారం, డిసెంబర్ 14, 2014

పంచక్రియలు

జీవితం ప్రశాంతంగా ... ఆనందంగా ... హాయిగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ వుంటారు. పవిత్రమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడే అలాంటి జీవితం సాధ్యమవుతుంది. ఆ పవిత్రత అనేది కేవలం ఆధ్యాత్మిక భావాల వలన మాత్రమే కలుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన అలాంటి జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగించడానికి 'పంచక్రియలను' అనుసరించ వలసి ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

ఉపాసన ... ఉత్సవం ... అహింస ... తీర్థయాత్ర ... సంస్కారం అనేవి పంచక్రియలుగా చెప్పబడుతున్నాయి.

నియమ నిష్ఠలను పాటిస్తూ ... సంప్రదాయాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనుదినం భగవంతుడిని ఆరాధించాలని 'ఉపాసన' చెబుతోంది.

చక్కని కుటుంబ వాతావరణాన్ని కలిగి వుండి, పండుగ సందర్భాల్లో జరిగే వేడుకల్లోను ... దైవ సంబంధమైన ఉత్సవాల్లోను భక్తితో పాల్గొనాలని 'ఉత్సవం' స్పష్టం చేస్తోంది.

ఇక ఇతరులకు ఏ విధంగాను కష్టాన్ని కలిగించకుండా ... ఎలాంటి కారణం చేతను వాళ్లను హింసించకుండా నడచుకోవాలని 'అహింసా' విధానం తెలియజేస్తోంది.

బరువు బాధ్యతల పేరుతో భగవంతుడిని దర్శించడం ... సేవించడం మరిచిపోకూడదని చెప్పడానికే 'తీర్థయాత్రలు' ఉద్దేశించబడ్డాయి. తీర్థయాత్రలు ... ప్రతి ఒక్కరి మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భగవంతుడి సన్నిధిలో గడపడం వలన కలిగే ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజేస్తాయి.

ఇక పుట్టుక నుంచి మరణం వరకూ ఆచారవ్యవహారాల పేరుతో పూర్వీకుల నుంచి సంక్రమించిన పద్ధతులను పాటించడమే 'సంస్కారం'గా చెప్పబడుతోంది. తరతరాలుగా వస్తోన్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ .. సంప్రదాయాలను గౌరవిస్తూ ... ఇతరులను ప్రేమిస్తూ ... భగవంతుడిని సేవిస్తూ ... పుణ్య క్షేత్రాలను దర్శించమనే 'పంచక్రియలు' చెబుతున్నాయి. వీటిని అనుసరించడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ? ? ? ? ?

మరణం తరువాత ఏమిటి? 

ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంకా బతికే ఉన్నాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని.. మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని.. ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.

ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోర ఉపనిషత్తు లో తెలుపబడింది. 

నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు. అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది? అప్పుడు యమధర్మరాజు "నచికేతా! ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకో" అని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు. "నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలని ఉంది" అంటాడు. అప్పుడు యమధర్మరాజు, "ఓ నచికేతా! నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను విను" అంటాడు. 

ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం...

యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే తను ఏమి సాధించాలి? నేను ఎందుకు పుట్టాను? అని మాత్రం ఆలోచించడు. ఏదో మంచి జీవితం.. మంచి భార్యా.. తరువాత పిల్లలు.. వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడా తెలుసుకునేంత సమయం లేదు. కాని ఏదో ఒక రోజు నువ్వు కాదన్నా.. ఎవరు కాదన్నా.. మరణం మాత్రం నీ వెనకే ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడా మనం గమనించే పరిస్థితిలో ఉండము.

మరణం తరువాత ఏమీ జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని ఉంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో విలీనం అవుతావు. లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి ఉంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి ఉంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు. 

ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే.. కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని ఉంటే.. నీకు మరల మనిషి జన్మ వస్తుంది. అదీ ఒక మంచి యోగుల కుటుంబంలో.. ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అట్లా కాక, సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి.. మనస్సును బుద్దిని అదుపులో ఉంచుకొని.. యోగాన్ని అవలంబించి.. అన్ని కర్మలను తొలగించుకొని.. నువ్వు విముక్తుడవు అయి ఉంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

కానీ మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినవో లేవో.. కావున మనం మన ఈ స్థూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే.. దానికి మనం చేయవలసిన పని.. సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంక ఎటువంటి సందేహాలు ఉండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి? ఇలా ప్రతీ సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు.. మనస్సు అనేదే ఒక భ్రమ అని. అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ పరమాత్మను మన హృదయంలో దర్శించుకోవడమే.

ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరల ఏ ఏ జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి. అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం.. అంటే జ్ఞానాన్ని గ్రహించి, అతని తత్వాన్ని అందరికి తెలియపరచి, ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ.. ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.




పంచభూతలింగాలు

ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

వాయు లింగం:
శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ
మన తిరుపతికి దగ్గర శ్రీ కాళహస్తిలో ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా! ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి. ఇక్కడి స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానవట్టాన్ని మాత్రమే తాకుతారు. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అని అంటారు. 

తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది.

జలలింగం:
శివుడు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి
తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ‘జలం’ ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. 

బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానవట్టంలో ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. 

చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు.

తేజోలింగం:
శివుడు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ 
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువణ్ణామలై) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి. 

ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది. 

చెన్నై నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న అరుణాచలానికి అనేక బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. 

పృథ్విలింగం:
శివుడు ఏకాంబరేశ్వరుడు, అమ్మవారు కామాక్షీదేవి
తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. భారతదేశంలో అతి పెద్ద గోపురాలు గల ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కంచి లోని శివలింగం మట్టితో చేసినది (పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు. 

దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం

చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాంబరేశ్వర దేవాలయం. కంచికి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి.

ఆకాశలింగం:
శివుడు నటరాజ స్వామి, అమ్మవారు శివకామసుందరీదేవి
పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ‘ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. 

నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ –> శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మనః స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.


అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు.
జీవిత కాలంలో ఒక సారయినా చూడవలసిన ప్రదేశం చిదంబరం.. 

తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది.  చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది.



2015లో ప్రదోష వ్రత రోజులు

S =  Sukla Paksham

K = Krishna Paksham

శివ ప్రదక్షిణ విధి

శివ ప్రదక్షిణ విధి
శ్లో:-ధ్వజాత్ పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం - పృష్టాత్ ధ్వజమ్.

భావము:-
శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ వలెను అని శ్లోక భావము.

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

నందీశ్వరుని వద్ద ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు ( నందీశ్వరుని మీదుగా )సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని- నేరుగా చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం.కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.


గురువారం, డిసెంబర్ 11, 2014

గంగావతరణం

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాధలున్నాయి.

ఒకసారి నారదుడు మహతి మీటుకుంటూ ఆకాశమార్గాన వెళ్తూ ఉండగా ఒకచోట కొంతమంది స్త్రీపురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండడం అతడి కంటపడింది. ఆ పాటలు వింటూ దగ్గరికి వెళ్ళి చూడగా, వాళ్లలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక శారీరకలోపం ఉన్నట్లు కనబడింది. ఒకరికి కన్ను లొట్టబోయి ఉంటే ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండడం, కొందరికి ముక్కు లేకుండా ఉండడం, ఇలా. వాటికితోడు అందరికీ వంటిమీద గాయాలున్నాయి. అది గమనించిన నారదుడు ఆశ్చర్యంగా, "మీరెవరు? మీకీ గాయాలేమిటి?" అని అడగ్గా, వాళ్ళు "మేం రాగ-రాగిణులం. (అంటే సంగీతంలోని రాగాల అధిదేవతలు. రాగాలు స్థూలంగా రెండు రకాలు: జనక రాగాలు, జన్య రాగాలు. జనకరాగాలు మళ్ళీ స్త్రీరాగాలు, పురుషరాగాలు అని రెండురకాలు. ఆ స్త్రీరాగాలనే రాగిణులని అంటారు.) భూలోకంలో గాయనీగాయకులు ఒక్కో అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి. మా అవకరాలన్నీ వాటి ఫలితమే." అని వివరించారు.

స్వయంగా సంగీతజ్ఞుడైన నారదుడు అది విని ఎంతో బాధపడి, "ఐతే దీనికి విరుగుడు లేదా?" అని అడిగాడు. దానికి వాళ్ళు, "పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుంది" అని చెప్పారు. "మరి ఆ పరిపూర్ణ గాయకుడెవరు?" అని నారదుడడగ్గా, పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు. "మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు గదా?" అని అడిగితే వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడుతాడని తెలిపారు.

"మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు?"

"బ్రహ్మ, విష్ణువు వీళ్ళిద్దరే పరిపూర్ణ శ్రోతలు."

"ఐతే నేను వాళ్ళు ముగ్గుర్నీ ప్రార్థించి, మీ కోసం పరమశివుడు పాడేలా చేస్తాను" అని నారదుడు అక్కణ్ణించీ సత్యలోకానికెళ్ళి బ్రహ్మను, వైకుంఠానికెళ్ళి విష్ణువును, కైలాసానికెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ పరమశివుడి గానాన్ని వినడానికి మహదానందంగా అంగీకరించారు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు. కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణువు, నారదుడు, రాగ-రాగిణులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు. విష్ణువు ఆ గానాన్ని మైమరచి వింటూ ఉండగా, ఆయన శరీరంలోని ఒకపొర కరిగి నీరై కదిలింది. అలా మెల్లగా కదిలి కదిలి విష్ణుపాదం నుంచి జారి కింద పడబోతున్న ఆ నీటిబొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు. ఆ విధంగా విష్ణువు పాదం నుంచి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటిబొట్టే గంగ.  శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము – అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

గంగావతరణం కథ:
ఇక్ష్వాకు వంశపు రాజైన సగరమహారాజుకు ఇద్దరు భార్యలు.పెద్ద భార్య కేశిని. రెండవ భార్య  సుమతి. వీరికి సంతానం కలుగక పోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు  భృగు మహర్షి వచ్చి వారి పూజలను మెచ్చి వారు అడుగ కుండానే వరమిస్తాడు. ఒక భార్యకు అరువది వేల మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు. ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెబుతాడు. కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక 60 వేల చిన్న చిన్న మంసఖండములు  పుట్టగా, ఆకాశ వాణి భృగు మహర్షి వాక్కు ఫలిస్తుందనీ ఆ మంసఖండములను నేతికుండలలో దాచమనీ చెబుతుంది. రాజు అలాగే చేయగా వాటినుండి అరవై వేలమంది పుత్రులు కలుగుతారు.

అసమంజసుడు పూర్వ జన్మలో ఒక మహాయోగి. చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్లీ జన్మ పొందాడు. ఆ అసమంజునుడికి పూర్వజన్మ వాసన ఉండి, విపరీతం తెచ్చింది. కిందటి జన్మలా ఈ జన్మలో కూడా చెడ్డసహవాసం ఉండకూడదని తనకు దగ్గర వారిని, స్నేహం చేయ వచ్చిన వారినీ సరయూ నదిలో ముంచేసేవాడు. అది తెలుసుకుని రాజు అతనిని తన రాజ్యం నుంచి వెడలగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగబలంతో తను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించగలిగాడు. వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కాని అతడు యెవరికీ తెలియకుండా యెక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యమవలేదు. ఆ అసమంజునుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు.

సగరుడు తన గురువైన ఔర్యుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని వంద ఆశ్వమేధయాగాలు తలపెట్టాడు. తొంబైతొమ్మిది చేసి నూరవయాగం ఆరంభించగా, దేవేంద్రుడికి ఓర్వలేనితనమయింది. యాగాశ్వాన్ని అపహరించి దానిని యెక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదలి వెళ్లిపోయాడు. యజ్ఞాశ్వమును వెతికి తీసుకు రమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకులనూ పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపిస్తాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుకుకుంటూ  దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరనూ హింసిస్తూ భూమి నాలుగు చెరగులా త్రవ్వి పోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్నిదొంగిలించి తెచ్చాడని తిట్టి పోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరచిన కపిల ముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీ పటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు అసమంజసుని కొడుకూ తన మనుమడూ అయిన అంశుమంతుని వారిని వెదికి రమ్మని పంపిస్తాడు. అంశుమంతుడు తన పిన తండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిల బిలం చేరి అక్కడ తన పిన తండ్రుల భస్మ రాశులనూ ఆ ప్రక్కనే కపిలమునినీ ఆయన ప్రక్కనే కట్టబడి ఉన్న యాగాశ్వాన్నీ కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకు పోవచ్చని అనుమతిస్తూ ఆతని పిన తండ్రుల బూడిద ప్రోవుల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్లాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు.

సగరుడూ ఆయన తరువాత అంశుమంతుడూ చాలా కాలం రాజ్యం చేస్తారు.అంశుమంతుడు తన పిన తండ్రులకు సద్గతులను కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తుడౌతాడు. అతడి వలెనే అతని కుమారుడు దిలీపుడు కూడాప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు.

దిలీపుని కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకప్పగించి  గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగ వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి  తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అని అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్ళారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది.




హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో సహా దూకింది. పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేసాడు.  శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది. 

భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుని మీది దయతో తన జటలను విదలించాడు కారుణ్య మూర్తి. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాలలోనుండి బయటపడింది పావన గంగ. 

భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగ పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు. మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపోయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు అంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. 

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశింఛాడు.  బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథము వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది. ఇలా సాగిపొతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.

గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు, ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.

ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరధా నీ కోసం గంగను విడిచిపెట్టేస్తున్నా అని తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి. వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోను, భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్దేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూడు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.
ఫలశ్రుతి :
ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు. ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.

సోమవారం, అక్టోబర్ 27, 2014

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.


మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు. వీటి గురించి విపులంగా మరో పోస్ట్ రాసాను చదవండి. 
http://sivooham.blogspot.in/2015/10/blog-post_79.html


శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండమునందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!


ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కల జడలును, పైకి ఎత్తి కట్టబడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను. 

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.

శ్రీ రుద్ర ప్రశ్నః
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః


నమకం

మొదటి అనువాకము: 
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||

శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||

తాత్పర్యము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాంచుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

రెండవ అనువాకము:
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||

తాత్పర్యము:
స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము. 


మూడవ అనువాకము: 
నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||

తాత్పర్యము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


నాలుగవ అనువాకము: 
నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యో‌உరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || ౪ ||

తాత్పర్యము:
దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


అయిదవ అనువాకము:
నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః 
శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || ౫ ||

తాత్పర్యము:
సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.


ఆరవ అనువాకము: 
నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || ౬ ||

తాత్పర్యము:
అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


ఏడవ అనువాకము:
నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || ౭ ||

తాత్పర్యము:
పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.


ఎనిమిదవ అనువాకము:
నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || ౮ ||

తాత్పర్యము:
ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు


తొమ్మిదవ  అనువాకము:
నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || ౯ ||

తాత్పర్యము:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.   


పదవ అనువాకము:
ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్‍మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’‌உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్‍మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || ౧౦ ||

తాత్పర్యము:
పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.


పదకొండవ అనువాకము: 
సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”‌உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || ౧౧ ||

త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||

సదాశివోమ్ |

ఓం శాంతిః శాంతిః శాంతిః

తాత్పర్యము:
ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.


ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, అయిదవ ప్రపాఠకములోనిది.


చమకం 

భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది.

మొదటి అనువాకము:
ఓం అగ్నా’విష్ణో సజోష’సేమావ’ర్ధన్తు వాం గిరః’ | ద్యుమ్నైర్-వాజే’భిరాగ’తమ్ | వాజ’శ్చ మే ప్రసవశ్చ’ మే ప్రయ’తిశ్చ మే ప్రసి’తిశ్చ మే ధీతిశ్చ’ మే క్రతు’శ్చ మే స్వర’శ్చ మే శ్లోక’శ్చ మే శ్రావశ్చ’ మే శ్రుతి’శ్చ మే జ్యోతి’శ్చ మే సువ’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உపానశ్చ’ మే వ్యానశ్చ మే‌உసు’శ్చ మే చిత్తం చ’ మ ఆధీ’తం చ మే వాక్చ’ మే మన’శ్చ మే చక్షు’శ్చ మే శ్రోత్రం’ చ మే దక్ష’శ్చ మే బలం’ చ మ ఓజ’శ్చ మే సహ’శ్చ మ ఆయు’శ్చ మే జరా చ’ మ ఆత్మా చ’ మే తనూశ్చ’ మే శర్మ’ చ మే వర్మ’ చ మే‌உఙ్గా’ని చ మే‌உస్థాని’ చ మే పరూగ్‍మ్’షి చ మే శరీ’రాణి చ మే || ౧ ||

తాత్పర్యము :
ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 

రెండవ అనువాకము: 
జైష్ఠ్యం’ చ మ ఆధి’పత్యం చ మే మన్యుశ్చ’ మే భామ’శ్చ మే‌உమ’శ్చ మే‌உమ్భ’శ్చ మే జేమా చ’ మే మహిమా చ’ మే వరిమా చ’ మే ప్రథిమా చ’ మే వర్ష్మా చ’ మే ద్రాఘుయా చ’ మే వృద్ధం చ’ మే వృద్ధి’శ్చ మే సత్యం చ’ మే శ్రద్ధా చ’ మే జగ’చ్చ మే ధనం’ చ మే వశ’శ్చ మే త్విషి’శ్చ మే క్రీడా చ’ మే మోద’శ్చ మే జాతం చ’ మే జనిష్యమా’ణం చ మే సూక్తం చ’ మే సుకృతం చ’ మే విత్తం చ’ మే వేద్యం’ చ మే భూతం చ’ మే భవిష్యచ్చ’ మే సుగం చ’ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే క్లుప్తం చ’ మే క్లుప్తి’శ్చ మే మతిశ్చ’ మే సుమతిశ్చ’ మే || ౨ ||

తాత్పర్యము :
నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 


మూడవ అనువాకము:
శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనసశ్చ’ మే భద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే యన్తా చ’ మే ధర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే సంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే లయశ్చ’ మ ఋతం చ’ మే‌உమృతం’ చ మే‌உయక్ష్మం చ మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం చ మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే || ౩ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.


నాలుగవ అనువాకము:
ఊర్క్చ’ మే సూనృతా’ చ మే పయ’శ్చ మే రస’శ్చ మే ఘృతం చ’ మే మధు’ చ మే సగ్ధి’శ్చ మే సపీ’తిశ్చ మే కృషిశ్చ’ మే వృష్టి’శ్చ మే జైత్రం’ చ మ ఔద్భి’ద్యం చ మే రయిశ్చ’ మే రాయ’శ్చ మే పుష్టం చ మే పుష్టి’శ్చ మే విభు చ’ మే ప్రభు చ’ మే బహు చ’ మే భూయ’శ్చ మే పూర్ణం చ’ మే పూర్ణత’రం చ మే‌உక్షి’తిశ్చ మే కూయ’వాశ్చ మే‌உన్నం’ చ మే‌உక్షు’చ్చ మే వ్రీహయ’శ్చ మే యవా”శ్చ మే మాషా”శ్చ మే తిలా”శ్చ మే ముద్గాశ్చ’ మే ఖల్వా”శ్చ మే గోధూమా”శ్చ మే మసురా”శ్చ మే ప్రియఙ్గ’వశ్చ మే‌உణ’వశ్చ మే శ్యామాకా”శ్చ మే నీవారా”శ్చ మే || ౪ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక. 


అయిదవ అనువాకము:
అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే సిక’తాశ్చ మే వనస్-పత’యశ్చ మే హిర’ణ్యం చ మే‌உయ’శ్చ మే సీసం’ చ మే త్రపు’శ్చ మే శ్యామం చ’ మే లోహం చ’ మే‌உగ్నిశ్చ’ మ ఆప’శ్చ మే వీరుధ’శ్చ మ ఓష’ధయశ్చ మే కృష్ణపచ్యం చ’ మే‌உకృష్ణపచ్యం చ’ మే గ్రామ్యాశ్చ’ మే పశవ’ ఆరణ్యాశ్చ’ యఙ్ఞేన’ కల్పన్తాం విత్తం చ’ మే విత్తి’శ్చ మే భూతం చ’ మే భూతి’శ్చ మే వసు’ చ మే వసతిశ్చ’ మే కర్మ’ చ మే శక్తి’శ్చ మే‌உర్థ’శ్చ మ ఏమ’శ్చ మ ఇతి’శ్చ మే గతి’శ్చ మే || ౫ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.


ఆరవ అనువాకము:
అగ్నిశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే సోమ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే సవితా చ’ మ ఇన్ద్ర’శ్చ మే సర’స్వతీ చ మ ఇన్ద్ర’శ్చ మే పూషా చ’ మ ఇన్ద్ర’శ్చ మే బృహస్పతి’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మిత్రశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే వరు’ణశ్చ మ ఇన్ద్ర’శ్చ మే త్వష్ఠా’ చ మ ఇన్ద్ర’శ్చ మే ధాతా చ’ మ ఇన్ద్ర’శ్చ మే విష్ణు’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే‌உశ్వినౌ’ చ మ ఇన్ద్ర’శ్చ మే మరుత’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే విశ్వే’ చ మే దేవా ఇన్ద్ర’శ్చ మే పృథివీ చ’ మ ఇన్ద్ర’శ్చ మే‌உన్తరి’క్షం చ మ ఇన్ద్ర’శ్చ మే ద్యౌశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే దిశ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మూర్ధా చ’ మ ఇన్ద్ర’శ్చ మే ప్రజాప’తిశ్చ మ ఇన్ద్ర’శ్చ మే || ౬ ||

తాత్పర్యము :
ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక. 


ఏడవ అనువాకము:
అగ్ంశుశ్చ’ మే రశ్మిశ్చ మే‌உదా”భ్యశ్చ మే‌உధి’పతిశ్చ మ ఉపాగ్ంశుశ్చ’ మే‌உన్తర్యామశ్చ’ మ ఐన్ద్రవాయవశ్చ’ మే మైత్రావరుణశ్చ’ మ ఆశ్వినశ్చ’ మే ప్రతిప్రస్థాన’శ్చ మే శుక్రశ్చ’ మే మన్థీ చ’ మ ఆగ్రయణశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే ధ్రువశ్చ’ మే వైశ్వానరశ్చ’ మ ఋతుగ్రహాశ్చ’ మే‌உతిగ్రాహ్యా”శ్చ మ ఐంద్రాగ్నశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే మరుత్వతీయా”శ్చ మే మాహేన్ద్రశ్చ’ మ ఆదిత్యశ్చ’ మే సావిత్రశ్చ’ మే సారస్వతశ్చ’ మే పౌష్ణశ్చ’ మే పాత్నీవతశ్చ’ మే హారియోజనశ్చ’ మే || ౭ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.


ఎనిమిదవ అనువాకము:
ఇధ్మశ్చ’ మే బర్హిశ్చ’ మే వేది’శ్చ మే దిష్ణి’యాశ్చ మే స్రుచ’శ్చ మే చమసాశ్చ’ మే గ్రావా’ణశ్చ మే స్వర’వశ్చ మ ఉపరవాశ్చ’ మే‌உధిషవ’ణే చ మే ద్రోణకలశశ్చ’ మే వాయవ్యా’ని చ మే పూతభృచ్చ’ మ ఆధవనీయ’శ్చ మ ఆగ్నీ”ధ్రం చ మే హవిర్ధానం’ చ మే గృహాశ్చ’ మే సద’శ్చ మే పురోడాశా”శ్చ మే పచతాశ్చ’ మే‌உవభృథశ్చ’ మే స్వగాకారశ్చ’ మే || ౮ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.


తొమ్మిదవ అనువాకము:
అగ్నిశ్చ’ మే ఘర్మశ్చ’ మే‌உర్కశ్చ’ మే సూర్య’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உశ్వమేధశ్చ’ మే పృథివీ చ మే‌உది’తిశ్చ మే దితి’శ్చ మే ద్యౌశ్చ’ మే శక్వ’రీరఙ్గుల’యో దిశ’శ్చ మే యఙ్ఞేన’ కల్పన్తామృక్చ’ మే సామ’ చ మే స్తోమ’శ్చ మే యజు’శ్చ మే దీక్షా చ’ మే తప’శ్చ మ ఋతుశ్చ’ మే వ్రతం చ’ మే‌உహోరాత్రయో”ర్-దృష్ట్యా బృ’హద్రథంతరే చ మే యఙ్ఞేన’ కల్పేతామ్ || ౯ ||

తాత్పర్యము :
ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక. 


పదవ అనువాకము:
గర్భా”శ్చ మే వత్సాశ్చ’ మే త్ర్యవి’శ్చ మే త్ర్యవీచ’ మే దిత్యవాట్ చ’ మే దిత్యౌహీ చ’ మే పఞ్చా’విశ్చ మే పంచావీ చ’ మే త్రివత్సశ్చ’ మే త్రివత్సా చ’ మే తుర్యవాట్ చ’ మే తుర్యౌహీ చ’ మే పష్ఠవాట్ చ’ మే పష్ఠౌహీ చ’ మ ఉక్షా చ’ మే వశా చ’ మ ఋషభశ్చ’ మే వేహచ్చ’ మే‌உనడ్వాం చ మే ధేనుశ్చ’ మ ఆయు’ర్-యఙ్ఞేన’ కల్పతాం ప్రాణో యఙ్ఞేన’ కల్పతామ్-అపానో యఙ్ఞేన’ కల్పతాం వ్యానో యఙ్ఞేన’ కల్పతాం చక్షు’ర్-యఙ్ఞేన’ కల్పతాగ్ శ్రోత్రం’ యఙ్ఞేన’ కల్పతాం మనో’ యఙ్ఞేన’ కల్పతాం వాగ్-యఙ్ఞేన’ కల్పతామ్-ఆత్మా యఙ్ఞేన’ కల్పతాం యఙ్ఞో యఙ్ఞేన’ కల్పతామ్ || ౧౦ ||

తాత్పర్యము :
ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.

(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)


పదకొండవ అనువాకము:
ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పఞ్చ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పఞ్చ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పఞ్చ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మే‌உష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మే‌உష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మే‌உష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాన్త్యాయనశ్-చాన్త్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || ౧౧ ||

ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరో‌உను’మదన్తు ||


ఓం శాంతిః శాంతిః శాంతిః 

తాత్పర్యము :
గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక.  


ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

శ్రీరుద్రం నేర్చుకోవాలనుకునే జిజ్ఞాసువుల కోసం ఆడియో పిడిఎఫ్ లింక్ జతపరుస్తున్నాను
నమకం: http://www.sssbpt.org/sri-rudram/instructions-to-user.htm
చమకం: http://www.sssbpt.org/sri-rudram/chamakam.html



శతరుద్రీయ శ్లోకాలు

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.

ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.

కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.

మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం – వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.

విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని – స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.

పైగా – ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.

ధ్యానమ్

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిసఫుర
జ్జ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దా కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తిభేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్
తతః ప్రణమ్య బహుధా కృతాంజలిపుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!

గణేశ ఉవాచ:

౧. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్ర మన్యవే
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః
౨. నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే
నమస్తే భగవన్ శమ్భో బాహుభ్యాముత తే నమః
౩. ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్
శివం ధనుర్యద్బభూవ తేనాపి మ్ఋడయాధునా
౪. శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో
యా తే రుద్ర శివా నిత్యం సర్వజ్ఞ్గల సాధనమ్
౫. తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాప తే
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ
౬. యా తయా మృడయ స్వామిన్ సదా శన్తమా ప్రభో
గిరిశన్త మహారుద్ర హస్తే యా మిషు మస్ే
౭. బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామస
౮. త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్
౯. యథా తథావమా రుద్ర తదన్యధాపి మే ప్రభో
రుద్ర త్వం ప్రథమో దైవ్యోభిషక్ పాపవినాశకః
౧౦. అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా
అహీన్ సర్వాన్ యాతుధాన్యః సర్వా అప్యద్య జమ్భయమ్
౧౧. అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః
విలోహితో స్త్వయం శమ్భో త్వదధిష్ఠాన ఏవహి
౧౨. నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మీఢుషే
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందమూర్తయే
౧౩. ఉభయోరార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్
సంప్రాప్య ధను రన్యేషాం భయాయ ప్రభవిష్యతి
౧౪. అస్మద్భయవినాశార్థ మధునాభయద ప్రభో
యాశ్చతేహస్త ఇషవః పరాతా భగవో వప
౧౫. అవతత్య ధను శ్చ త్వం సహస్రాక్ష శతేషుఢే
ముఖా నిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ
౧౬. విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః
౧౭. కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యేతు భయం భవేత్
౧౮. యాతే హేతిర్ధను ర్హస్తే మీఢుష్టమ బభూవ యా
తయాస్మాన్ విశ్వత స్తేన పాలయ త్వ మయక్ష్మయా
౧౯. అనాతతాయాయుధాయ నమస్తే ధష్ణవే నమః
బాహుభ్యాం ధన్వనే శమ్భో నమో భూయో నమో నమః
౨౦. పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః
ఇషుధిస్తవ యా తవదస్మారే నిధేహి తమ్
౨౧. హిరణ్యబాహవే తుభ్యం సేనాన్యే తే నమో నమః
దిశాంత పతయే తుభ్యం పశూనాం పతయే నమః
౨౨. త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః
౨౩. నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః
నమస్తే హరికేశాయ రుద్రాయా స్తూపవీతినే
౨౪. పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః
సంసారహేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే
౨౫. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే
అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః
౨౬. రోహితాయ స్థపతయే మన్త్రిణే వాణిజాయ చ
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువన్తయే
౨౭. తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే
౨౮. ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రన్దయతే నమః
౨౯. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః
ధావతే ధవాలాయపి సత్త్వనాం పతయే నమః
౩౦. ఆవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే
స్తేనానాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. తస్కరాణాం చ పతయే వంచతే పరివంచే
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః
౩౩. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరచరాయతే
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ
౩౪. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతే నమః
నమ ఉగ్రాయ భీమాయ నమ శ్చాగ్రేవధాయచ
౩౫. నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః
౩౬. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే
౩౭. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే
౩౮. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః
నమశ్శివాయ శర్వాయ నమ శ్శివతరాయ చ
౩౯. నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయ తే నమః
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ
౪౦. నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ
౪౧. నమ శ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః
౪౨. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః
వర్షీయసే నమస్ేస్తు నమో వృద్ధాయతే నమః
౪౩. సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ
౪౪. శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయ తే నమః
౪౫. స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః
జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః
౪౬. పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ
మధ్యమాయ నమస్తుభ్య మపగల్భాయ తే నమః
౪౭. జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ చ నమోనమః
౪౮. క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయచ నమోనమః
౪౯. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః
నమో వన్యాయ కక్ష్యాయ మౌంజ్యాయ చ నమోనమః
౫౦.శ్రవాయ చ నమస్తభ్యం ప్రతిశ్రవ నమోనమః
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ
౫౧. వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః
౫౨. దుందుభ్యాయ నమస్తుభ్యమాహనన్యాయ తే నమః
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయచ
౫౩. పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః
౫౪. నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః
నమో నీప్యాయ సూద్యాయ సరస్యాయ చ తే నమః
౫౫. నమో నాద్యాయ భవ్యాయ వైశన్తాయ నమోనమః
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః
౫౬. అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః
విద్యుతాయ నమస్తుభ్య మీథ్రియాయ నమోనమః
౫౭. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః
౫౮. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః
నమోరుద్రాయ తామ్రాయా ప్యరుణాయ చ తే నమః
౫౯. నమ ఉగ్రాయ భీమాయ నమ శ్శంగాయ తే నమః
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః
౬౦. ప్రవాహ్యాయ నమస్తుభ్య మిరిణ్యాయ నమోనమః
నమస్తే చన్ద్ర చూడాయ ప్రపధ్యాయ నమోనమః
౬౧. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే
౬౨. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః
౬౩. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్ంసవ్యాయ తే నమః
౬౪. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః
౬౫. హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః
౬౬. నమోపగురమాణాయ పర్ణశద్యాయ తే నమః
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః
౬౭. విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః
త్ర్యమ్బకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః
౬౮. మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః
వేదవేదాన్త వేద్యాయ వృషారూఢాయ తే నమః
౬౯. అవిజ్ఞేయస్వరూపాయ సున్దరాయ నమోనమః
ఉమాకాన్త నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే
౭౦. హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ
నమో హిరణ్యరూపాయ రూపాతీతాయ తే నమః
౭౧. హిరణ్యపతయే తుభ్యమంబికా పతయే నమః
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక
౭౨. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణరూపిణే
౭౩. అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ
కాలాంతకాయాపి నమోనమస్తే దిక్కాలరూపాయ నమోనమస్తే
౭౪. వేదాంత బృందస్తుత సద్గుణాయ గుణప్రవీణాయ గుణాశ్రయాయ
శ్రీ విశ్వనాథాయ నమోనమస్తే కాశీనివాసాయ నమోనమస్తే
౭౫. అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధిరూపాయ నమోనమస్తే
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమోనమస్తే
౭౬. నీహారశైలాత్మజ హృద్విహార ప్రకాశహార ప్రవిభాసి వీర
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే

వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః
కృతాంజలిపుట స్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః
త మాలోక్య సుతం ప్రాప్తం వేదవేదాంగ పారగమ్
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః
ఇతి శ్రీ శివరహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్థే
గణేశకృత రుద్రాధ్యాయస్తుతిః నామ దశమోధ్యాయః
అనేన శ్రీ గణేశకృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భవతు!!

బుధవారం, జులై 23, 2014

కాశీలో ఏం వదలాలి...?

కాశీలో ఈషణ త్రయాన్ని వదలాలి.

అనగా
దారైషణ = భార్య/భర్త మీద మోహం
ధనైషణ = ధనం ఐశ్వర్యం మీద మోహం
పుత్రైషణ = సంతానం మీద మోహం

కాశీలో వదలవలసినవి ఈ మూడూ. అవి మూడూ వదిలి విరాగిగా మారు వరకు అభ్యాసంగా ఇతర ఇష్టమైన పదార్థములు వదులుతూ ఉంటారు.

అందరూ ఇవి వదలలేరు కనుక ప్రతిగా ఆకు, కూర, పండు వదులుతారు. (బహుశా అలా తినే వస్తువులను వదలగా వదలగా మనసు సంస్కరింపబడి కాస్త వైరాగ్యం పాలు పెరుగుతుందనేమో). 

షోడశోపచార పూజావిధి

మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి మర్యాద చేస్తామో అదే మన ఇష్ట దైవాన్ని కూడా పూజ పరంగా మర్యాద చేయడమే షోడశ (పదహారు) ఉపచారాల విధానం. ఈ విధానం ప్రతీ దేవత పూజలోను పాటించి తీరాలి.

1)ఆవాహనము: మనస్పూర్తి గా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
2)ఆసనము: వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
3)పాద్యము: కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
4)అర్ఘ్యము: చేతులు పరిశుభ్ర పరచడం
5)ఆచమనీయము: మంచినీళ్ళు ఇచ్చుట
6)స్నానము: ప్రయాణాలసట తొలిగే నిమ్మిత్తం
7)వస్త్రము: స్నాన అనంతరం – పొడి బట్టలివ్వడం
8)యజ్ఞోపవీతము: మార్గ మధ్యంలో మైలపడిన – యజ్ఞోపవీతాన్ని మార్చడం
9)గంధం: శరీరం మీద సుగంధాన్ని చిలకడం
10)పుష్పం: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు.
11)ధూపము: సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం
12)దీపము: పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం
13)నైవేద్యము: తన స్థాయి అనుసరించి – తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం.
14)తాంబూలం: మనం భక్తి తో ఇచ్చిన పదార్థాల వల్ల – వారి ఇష్టాయిష్టాలకి కలిగే – లోపాన్ని తొలగించడం
15)నమస్కారం: గౌరవించడానికి సూచన
16)ప్రదక్షిణం: ముమ్మూర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం.

ఉజ్జయిని జ్యోతిర్లింగం

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.

ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి (చెట్టు నుండి పండు పడిపోయినట్టు) ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.

ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.

దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.