బుధవారం, జులై 23, 2014

ఉజ్జయిని జ్యోతిర్లింగం

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.

ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి (చెట్టు నుండి పండు పడిపోయినట్టు) ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.

ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.

దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి