శుక్రవారం, జులై 04, 2014

ఇక్కడ శివుడు తలక్రిందులుగా దర్శనమిస్తాడు...!!!

సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోను శివుడు లింగరూపంలో దర్శనమిస్తూ వుంటాడు. అలాంటిది ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే ... అందునా తలక్రిందులుగా దర్శనమిస్తే ... ఆశ్చర్యపోని భక్తులంటూ వుండరు. ఇక అమ్మవారి విషయానికే వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో ... అదీ ఒకే పీఠంపై ... అమ్మవారు కొలువై వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

ఇక ఇక్కడ అమ్మవారు బాలింతరాలుగా ఒడిలో పసివాడైన కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తూ వుండటం మరో పత్యేకత. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా 'యనమదుర్రు' కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడుని గురించి తపస్సు చేసిన కారణంగా, ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది.

లోక కంటకుడైన 'శంభరుడు' ని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంభరుడు మహా శివభక్తుడు కావడంతో, ఆయనని అంతమొందించదానికి పరమశివుడి అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలోని కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ వుంటుంది.

అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికి వస్తుంది. లోక కల్యాణం కోసం తాను తపస్సు చేస్తోన్న ప్రదేశంలో ఉన్నపళంగా ఆవిర్భవించవలసిందిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడు నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించడంతో, వాళ్లు కైలాసంలో ఎలా వున్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ వుంటారు. అశేష భక్త జనకోటికి ఆదిదంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ వుంటారు.

యనమదుర్రు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము. పశ్ఛిమగోదావరి జిల్లా భీమవరం పట్టాణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్లుండి వార్తల్లోకి ఎక్కింది.ఇక్కడ త్రేతయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాలక్రిందట తవ్వకాలలో బయటపడింది. ఈ త్రవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు, మూడు నెలల పసికండు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతిమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి