బుధవారం, జులై 23, 2014

కాశీలో ఏం వదలాలి...?

కాశీలో ఈషణ త్రయాన్ని వదలాలి.

అనగా
దారైషణ = భార్య/భర్త మీద మోహం
ధనైషణ = ధనం ఐశ్వర్యం మీద మోహం
పుత్రైషణ = సంతానం మీద మోహం

కాశీలో వదలవలసినవి ఈ మూడూ. అవి మూడూ వదిలి విరాగిగా మారు వరకు అభ్యాసంగా ఇతర ఇష్టమైన పదార్థములు వదులుతూ ఉంటారు.

అందరూ ఇవి వదలలేరు కనుక ప్రతిగా ఆకు, కూర, పండు వదులుతారు. (బహుశా అలా తినే వస్తువులను వదలగా వదలగా మనసు సంస్కరింపబడి కాస్త వైరాగ్యం పాలు పెరుగుతుందనేమో). 

షోడశోపచార పూజావిధి

మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి మర్యాద చేస్తామో అదే మన ఇష్ట దైవాన్ని కూడా పూజ పరంగా మర్యాద చేయడమే షోడశ (పదహారు) ఉపచారాల విధానం. ఈ విధానం ప్రతీ దేవత పూజలోను పాటించి తీరాలి.

1)ఆవాహనము: మనస్పూర్తి గా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
2)ఆసనము: వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
3)పాద్యము: కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
4)అర్ఘ్యము: చేతులు పరిశుభ్ర పరచడం
5)ఆచమనీయము: మంచినీళ్ళు ఇచ్చుట
6)స్నానము: ప్రయాణాలసట తొలిగే నిమ్మిత్తం
7)వస్త్రము: స్నాన అనంతరం – పొడి బట్టలివ్వడం
8)యజ్ఞోపవీతము: మార్గ మధ్యంలో మైలపడిన – యజ్ఞోపవీతాన్ని మార్చడం
9)గంధం: శరీరం మీద సుగంధాన్ని చిలకడం
10)పుష్పం: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు.
11)ధూపము: సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం
12)దీపము: పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం
13)నైవేద్యము: తన స్థాయి అనుసరించి – తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం.
14)తాంబూలం: మనం భక్తి తో ఇచ్చిన పదార్థాల వల్ల – వారి ఇష్టాయిష్టాలకి కలిగే – లోపాన్ని తొలగించడం
15)నమస్కారం: గౌరవించడానికి సూచన
16)ప్రదక్షిణం: ముమ్మూర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం.

ఉజ్జయిని జ్యోతిర్లింగం

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.

ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి (చెట్టు నుండి పండు పడిపోయినట్టు) ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.

ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.

దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.


శుక్రవారం, జులై 18, 2014

కాశీ విశ్వనాథుడు

తురుష్కులు దండయాత్రకు వస్తున్నారని విని విశ్వనాథుని సేవించుకుంటున్న అర్చకులు, ఋషులూ అక్కడ విగ్రహానికి హాని కలుగకూడదని, ఇంకోచోట భద్రపరచే ఉద్దేశ్యముతో పెకలించబోయారు. కాని విశ్వనాథుడు కదలలేదు.. ఏంచేయాలో తెలియని భక్తులు "మా ప్రాణాలు తీసికాని స్వామిని ముట్టనివ్వ" మని ఆస్వామిని కౌగలించుకుని ఉండిపోతే.. అప్పుడు విగ్రహములో కదలిక వచ్చింది..

వెంటనే విగ్రాహాన్ని పెకలించి ప్రక్కనున్న నూతిలో దాచారు... తురుష్కులు వచ్చి ముట్టడించారు. చేయదలచిన
విధ్వంసం చేసి నిష్క్రమించారు.. ఆ తర్వాత పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి నూతిలో కనపడలేదు.

రాణీ అహల్యాబాయికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను ఆ కూపంలో ( అదే ఙ్ఞానవాపిగా చెప్పబడుతున్నది)
లుప్తమయ్యానని, గుడి కట్టించి ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడట... ఆ ప్రకారం అన్నీ ఏర్పాటులు చేసి
లింగాన్ని తెచ్చి ఓ ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుట.

అంతా అయ్యాక లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట.. ఆ స్థలమే తనకి ఇష్టమైనదని అక్కడే అలాగే దాన్ని ఉంచి అర్చించమని స్వప్నంలో అహల్యాబాయికి చెప్పాడట స్వామి. ఆ కారణంగా గర్భగుడిలో ఓ ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు.. ముందుగా ప్రతిష్టింపబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు.

కాశీ విశ్వనాథుణ్ణి ఇక్కడ ఎవరైనా స్వయంగా అభిషేకించుకోవచ్చు.. భక్తుల అభిషేకజలాలతో తడిసిన అభిషేక ప్రియుడు తన శిరో భాగాన్ని మాత్రమే చూపుతూ ఉంటాడు.. అంతే ఆ విగ్రహమనుకునేరు.. కాని ఓ సారి ఆ నీరు అర్చకులు తీసేసినప్పుడు - ఓహ్!! పూర్తి స్వామి కన్నులపండువగా దర్శనమిస్తాడు... సుమారు 3అడుగుల సుందరమూర్తి....

కొంచెం దూరంగా అమ్మ విశాలాక్షి శోభాయమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడం విశేషం....

విశాలాక్షీ శక్తి పీఠం

విశ్వేశ్వరుడి నివాస స్థానమైన కాశీ క్షేత్రంలో ‘విశాలాక్షీ శక్తి పీఠం’ ఆవిర్భవించింది. సతీదేవి ‘మణికర్ణిక’ ఈ ప్రదేశంలో పడిందని చెబుతుంటారు. సప్త మోక్షపురాల్లో ఒకటిగా … ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక ఇక్కడి అమ్మవారికి విశాలాక్షి అనే పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథ వినిపిస్తోంది.

భూలోకంలో అధర్మం పెరిగిపోతుండటంతో, పరిపాలన చేపట్టి ధర్మాన్ని కాపాడమని ‘దివో దాసు’అనే క్షత్రియుడిని కోరాడు బ్రహ్మదేవుడు. అయితే దేవతలంతా భూలోకం విడిచి వెళితేనేగాని తాను పరిపాలనా బాధ్యతలను స్వీకరించనని దివోదాసు తేల్చిచెప్పాడు. ఆ సమయంలోనే శివుడు కూడా కాశీ నగరాన్ని వదలి కైలాసానికి వెళ్లిపోయాడు.

కాలం గడుస్తున్నా కొద్దీ కాశీ నగర వియోగాన్ని పరమ శివుడు తట్టుకోలేకపోయాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తుండటం వల్ల, అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోయాడు. ఇది గమనించిన వినాయకుడు దివోదాసుకి వైరాగ్యాన్ని కలిగించి, అతనే శివుడిని ఆహ్వానించేలా చేశాడు.

దివోదాసు ఆహ్వానం అందుకున్న శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీ క్షేత్రంలో కాలుపెట్టాడు. పట్టరాని ఆనందంతో వస్తోన్న శంకరుడిని పార్వతీదేవి తన కళ్లను విశాలం చేసుకుని చూస్తూ మురిసిపోయిందట. ఈ కారణంగానే అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తూ వుంటారు.

శుక్రవారం, జులై 04, 2014

ఇక్కడ శివుడు తలక్రిందులుగా దర్శనమిస్తాడు...!!!

సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోను శివుడు లింగరూపంలో దర్శనమిస్తూ వుంటాడు. అలాంటిది ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే ... అందునా తలక్రిందులుగా దర్శనమిస్తే ... ఆశ్చర్యపోని భక్తులంటూ వుండరు. ఇక అమ్మవారి విషయానికే వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో ... అదీ ఒకే పీఠంపై ... అమ్మవారు కొలువై వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

ఇక ఇక్కడ అమ్మవారు బాలింతరాలుగా ఒడిలో పసివాడైన కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తూ వుండటం మరో పత్యేకత. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా 'యనమదుర్రు' కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడుని గురించి తపస్సు చేసిన కారణంగా, ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది.

లోక కంటకుడైన 'శంభరుడు' ని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంభరుడు మహా శివభక్తుడు కావడంతో, ఆయనని అంతమొందించదానికి పరమశివుడి అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలోని కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ వుంటుంది.

అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికి వస్తుంది. లోక కల్యాణం కోసం తాను తపస్సు చేస్తోన్న ప్రదేశంలో ఉన్నపళంగా ఆవిర్భవించవలసిందిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడు నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించడంతో, వాళ్లు కైలాసంలో ఎలా వున్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ వుంటారు. అశేష భక్త జనకోటికి ఆదిదంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ వుంటారు.

యనమదుర్రు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము. పశ్ఛిమగోదావరి జిల్లా భీమవరం పట్టాణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్లుండి వార్తల్లోకి ఎక్కింది.ఇక్కడ త్రేతయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాలక్రిందట తవ్వకాలలో బయటపడింది. ఈ త్రవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు, మూడు నెలల పసికండు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతిమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయి.