గురువారం, డిసెంబర్ 11, 2014

గంగావతరణం

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాధలున్నాయి.

ఒకసారి నారదుడు మహతి మీటుకుంటూ ఆకాశమార్గాన వెళ్తూ ఉండగా ఒకచోట కొంతమంది స్త్రీపురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండడం అతడి కంటపడింది. ఆ పాటలు వింటూ దగ్గరికి వెళ్ళి చూడగా, వాళ్లలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక శారీరకలోపం ఉన్నట్లు కనబడింది. ఒకరికి కన్ను లొట్టబోయి ఉంటే ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండడం, కొందరికి ముక్కు లేకుండా ఉండడం, ఇలా. వాటికితోడు అందరికీ వంటిమీద గాయాలున్నాయి. అది గమనించిన నారదుడు ఆశ్చర్యంగా, "మీరెవరు? మీకీ గాయాలేమిటి?" అని అడగ్గా, వాళ్ళు "మేం రాగ-రాగిణులం. (అంటే సంగీతంలోని రాగాల అధిదేవతలు. రాగాలు స్థూలంగా రెండు రకాలు: జనక రాగాలు, జన్య రాగాలు. జనకరాగాలు మళ్ళీ స్త్రీరాగాలు, పురుషరాగాలు అని రెండురకాలు. ఆ స్త్రీరాగాలనే రాగిణులని అంటారు.) భూలోకంలో గాయనీగాయకులు ఒక్కో అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి. మా అవకరాలన్నీ వాటి ఫలితమే." అని వివరించారు.

స్వయంగా సంగీతజ్ఞుడైన నారదుడు అది విని ఎంతో బాధపడి, "ఐతే దీనికి విరుగుడు లేదా?" అని అడిగాడు. దానికి వాళ్ళు, "పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుంది" అని చెప్పారు. "మరి ఆ పరిపూర్ణ గాయకుడెవరు?" అని నారదుడడగ్గా, పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు. "మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు గదా?" అని అడిగితే వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడుతాడని తెలిపారు.

"మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు?"

"బ్రహ్మ, విష్ణువు వీళ్ళిద్దరే పరిపూర్ణ శ్రోతలు."

"ఐతే నేను వాళ్ళు ముగ్గుర్నీ ప్రార్థించి, మీ కోసం పరమశివుడు పాడేలా చేస్తాను" అని నారదుడు అక్కణ్ణించీ సత్యలోకానికెళ్ళి బ్రహ్మను, వైకుంఠానికెళ్ళి విష్ణువును, కైలాసానికెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ పరమశివుడి గానాన్ని వినడానికి మహదానందంగా అంగీకరించారు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు. కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణువు, నారదుడు, రాగ-రాగిణులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు. విష్ణువు ఆ గానాన్ని మైమరచి వింటూ ఉండగా, ఆయన శరీరంలోని ఒకపొర కరిగి నీరై కదిలింది. అలా మెల్లగా కదిలి కదిలి విష్ణుపాదం నుంచి జారి కింద పడబోతున్న ఆ నీటిబొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు. ఆ విధంగా విష్ణువు పాదం నుంచి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటిబొట్టే గంగ.  శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము – అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

గంగావతరణం కథ:
ఇక్ష్వాకు వంశపు రాజైన సగరమహారాజుకు ఇద్దరు భార్యలు.పెద్ద భార్య కేశిని. రెండవ భార్య  సుమతి. వీరికి సంతానం కలుగక పోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు  భృగు మహర్షి వచ్చి వారి పూజలను మెచ్చి వారు అడుగ కుండానే వరమిస్తాడు. ఒక భార్యకు అరువది వేల మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు. ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెబుతాడు. కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక 60 వేల చిన్న చిన్న మంసఖండములు  పుట్టగా, ఆకాశ వాణి భృగు మహర్షి వాక్కు ఫలిస్తుందనీ ఆ మంసఖండములను నేతికుండలలో దాచమనీ చెబుతుంది. రాజు అలాగే చేయగా వాటినుండి అరవై వేలమంది పుత్రులు కలుగుతారు.

అసమంజసుడు పూర్వ జన్మలో ఒక మహాయోగి. చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్లీ జన్మ పొందాడు. ఆ అసమంజునుడికి పూర్వజన్మ వాసన ఉండి, విపరీతం తెచ్చింది. కిందటి జన్మలా ఈ జన్మలో కూడా చెడ్డసహవాసం ఉండకూడదని తనకు దగ్గర వారిని, స్నేహం చేయ వచ్చిన వారినీ సరయూ నదిలో ముంచేసేవాడు. అది తెలుసుకుని రాజు అతనిని తన రాజ్యం నుంచి వెడలగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగబలంతో తను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించగలిగాడు. వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కాని అతడు యెవరికీ తెలియకుండా యెక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యమవలేదు. ఆ అసమంజునుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు.

సగరుడు తన గురువైన ఔర్యుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని వంద ఆశ్వమేధయాగాలు తలపెట్టాడు. తొంబైతొమ్మిది చేసి నూరవయాగం ఆరంభించగా, దేవేంద్రుడికి ఓర్వలేనితనమయింది. యాగాశ్వాన్ని అపహరించి దానిని యెక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదలి వెళ్లిపోయాడు. యజ్ఞాశ్వమును వెతికి తీసుకు రమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకులనూ పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపిస్తాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుకుకుంటూ  దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరనూ హింసిస్తూ భూమి నాలుగు చెరగులా త్రవ్వి పోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్నిదొంగిలించి తెచ్చాడని తిట్టి పోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరచిన కపిల ముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీ పటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు అసమంజసుని కొడుకూ తన మనుమడూ అయిన అంశుమంతుని వారిని వెదికి రమ్మని పంపిస్తాడు. అంశుమంతుడు తన పిన తండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిల బిలం చేరి అక్కడ తన పిన తండ్రుల భస్మ రాశులనూ ఆ ప్రక్కనే కపిలమునినీ ఆయన ప్రక్కనే కట్టబడి ఉన్న యాగాశ్వాన్నీ కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకు పోవచ్చని అనుమతిస్తూ ఆతని పిన తండ్రుల బూడిద ప్రోవుల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్లాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు.

సగరుడూ ఆయన తరువాత అంశుమంతుడూ చాలా కాలం రాజ్యం చేస్తారు.అంశుమంతుడు తన పిన తండ్రులకు సద్గతులను కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తుడౌతాడు. అతడి వలెనే అతని కుమారుడు దిలీపుడు కూడాప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు.

దిలీపుని కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకప్పగించి  గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగ వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి  తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అని అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్ళారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది.




హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో సహా దూకింది. పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేసాడు.  శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది. 

భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుని మీది దయతో తన జటలను విదలించాడు కారుణ్య మూర్తి. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాలలోనుండి బయటపడింది పావన గంగ. 

భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగ పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు. మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపోయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు అంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. 

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశింఛాడు.  బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథము వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది. ఇలా సాగిపొతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.

గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు, ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.

ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరధా నీ కోసం గంగను విడిచిపెట్టేస్తున్నా అని తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి. వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోను, భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్దేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూడు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.
ఫలశ్రుతి :
ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు. ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.

1 కామెంట్‌:

  1. మేము చేపలు పట్టే వాళ్ళం గంగామాతను విశేషంగా పూజించాలని ఉంది ఎలా పూజించాలో చెప్తారా

    రిప్లయితొలగించండి