ఆదివారం, డిసెంబర్ 14, 2014

పంచభూతలింగాలు

ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

వాయు లింగం:
శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ
మన తిరుపతికి దగ్గర శ్రీ కాళహస్తిలో ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా! ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి. ఇక్కడి స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానవట్టాన్ని మాత్రమే తాకుతారు. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అని అంటారు. 

తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది.

జలలింగం:
శివుడు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి
తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ‘జలం’ ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. 

బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానవట్టంలో ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. 

చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు.

తేజోలింగం:
శివుడు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ 
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువణ్ణామలై) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి. 

ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది. 

చెన్నై నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న అరుణాచలానికి అనేక బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. 

పృథ్విలింగం:
శివుడు ఏకాంబరేశ్వరుడు, అమ్మవారు కామాక్షీదేవి
తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. భారతదేశంలో అతి పెద్ద గోపురాలు గల ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కంచి లోని శివలింగం మట్టితో చేసినది (పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు. 

దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం

చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాంబరేశ్వర దేవాలయం. కంచికి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి.

ఆకాశలింగం:
శివుడు నటరాజ స్వామి, అమ్మవారు శివకామసుందరీదేవి
పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ‘ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. 

నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ –> శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మనః స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.


అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు.
జీవిత కాలంలో ఒక సారయినా చూడవలసిన ప్రదేశం చిదంబరం.. 

తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది.  చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి