మంగళవారం, నవంబర్ 17, 2020

నాకు నచ్చిన పద్యం

నాకు ఈ పద్యం అంటే చాలా ఇష్టం. ఇది ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోనిది. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. ఈయన  16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని అంచనా. ఈయన ఆనాటి "పొత్తపి సీమ" (ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి) పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మతః వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడయ్యాడని భావన. ధూర్జటి రచనలుగా మనకు లభించేవి రెండు మాత్రమే. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము

ధూర్జటి తాను ఈ  శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు 'కస్తూరి రంగ' కవి తన "యానంద రంగరాట్ఛందము" లో ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ "ఇది ధూర్జటి వారి శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి స్వీకరించబడినది" అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవియే రచించెననుట నిర్వివాదాంశం. 

వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, చే
గిన్నే బ్రహ్మకపాల, ముగ్రమగు భోగే కంఠాహారంబు మే
ల్నిన్నీ లాగున నుంటయుం దెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వరా!


ఈశ్వరా! నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము. తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె బ్రహ్మ కపాలము. కంఠాభరణాలు భయంకర సర్పాలు. మరి ఇవన్నీ తెలిసి కూడా లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి నిన్ను ఎలా పూజిస్తున్నాడు స్వామీ! ఆయన సంపన్నుడైయుండియు ఆదిభిక్షువవైన నిన్ను ధ్యానించుట చిత్రమని భావము.



2 కామెంట్‌లు:

  1. నమస్తే ! రావి చెట్టు మొదట్లో అలక్ష్మి నివాసం ఉంటుందని అంటారు కదా ! రావి చెట్టును రోజులలో ఏ తిథులలో తాకరాదు, మరియు ఏ రోజులలో తాకవచ్చు . ఏ రోజులలో చెట్టు ఆకులను కోయవచ్చు, మరియు ఏ రోజులలో రావి చెట్టు వద్ద దీపం పెట్టవచ్చు, మరియు ఏ రోజులలో రావి ఆకు మీద దీపం పెట్టవచ్చు, రావి చెట్టు పైన వివరంగా ఒక వీడియో చెయ్యగలరు

    రిప్లయితొలగించండి